కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోస్టుల భర్తీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. జిల్లాలో వీఆర్వో పోస్టులు 105, వీఆర్‌ఏ పోస్టులు 176 భర్తీ చేస్తున్నామని తెలిపారు. మండలాల నుంచి కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీల వివరాలు సేకరించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28న నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు రూ. 200, ఇతరులు రూ.500ను పరీక్ష ఫీజు కింద మీ-సేవ కేంద్రాల్లో చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు.
వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉందని, ఇందుకు సదరం ధృవీకరణ పత్రం ఉండాలని తెలిపారు. రెండు కేటగిరీల పోస్టులకు పోటీ పడేవారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీఆర్వో పోస్టులు జిల్లా యూనిట్‌గా భర్తీ చేస్తామన్నారు. వీఆర్‌ఏ పోస్టులకు ఆయా రెవెన్యూ గ్రామాలకు చెందిన వారే అర్హులన్నారు. వీఆర్వో పోస్టులకు ఇంటర్, వీఆర్‌ఏ పోస్టులకు 10వ తరగతి కనీస అర్హతగా ఉందన్నారు. 4వ తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివి ఉంటారో అదే వారి స్థానిక జిల్లాగా పరిగణిస్తామన్నారు. 2013 జూలై 1వతేదీ నాటికి 18 ఏళ్లు నుంచి 36, వీఆర్‌ఏ పోస్టులకు 18 నుంచి 37 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వికలాంగులకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుందన్నారు. నోటిఫికేషన్ విడుదల, సెంటర్ల గుర్తింపు, ఇతర చర్యలపై దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు.
రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు
Published Mon, Dec 23 2013 4:31 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
Advertisement