సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. తమ పరిధిలోని కళాశాలల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాళోజీ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్)–2018లో అర్హత సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.in లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 21 ఉదయం 8 గంటల నుంచి 26 మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. 26 రాత్రికే మెరిట్ జాబితా తయారు చేస్తామని చెప్పారు.
ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ 27 నుంచి ప్రారంభమై 10 రోజుల పాటు కొనసాగనుంది. నేషనల్ పూల్‌కు సంబంధించి 1వ రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అక్కడ ఒకటో రౌండ్ పూర్తి కాగానే ఇక్కడ మొదటి రౌండ్ పూర్తవుతుందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అక్కడ రెండో రౌండ్ పూర్తయ్యాక ఇక్కడ రెండో రౌండ్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. నీట్‌లో పొందిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
వివరాలు..
♦ రాష్ట్రంలో 3,350 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్త విధానం ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో 70 శాతం స్థానికులకే కేటాయిస్తారు. 15 శాతం సీట్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోటాగా, మరో 15 శాతం సీట్లు నేషనల్ పూల్‌లో ఉంటాయి.
♦ ఏపీ పునర్విభజన ప్రకారం విద్యా సంస్థలకు పదేళ్లపాటు (2024 వరకు) ఉమ్మడి కౌన్సెలింగ్ నిబంధన అమల్లో ఉంది.
♦ తెలంగాణ, ఏపీలోని విద్యా సంస్థల్లోని సీట్లలో 15 శాతం కోటాను మెరిట్ ప్రాతిపదికన పదేళ్లపాటు పరస్పరం కేటాయించాలని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ 15 శాతం సీట్ల కోసం ఏపీ విద్యార్థులు పోటీ పడతారు. అలాగే ఏపీలోనూ తెలంగాణ విద్యార్థులు పోటీ పడతారు.
♦ కొత్త విధానం ప్రకారం మరో 15 శాతం సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్తాయి. అన్ని రాష్ట్రాల్లోని అభ్యర్థులు మెరిట్ ప్రాతిపదికన నేషనల్ పూల్‌లోని సీట్ల కోసం పోటీ పడతారు. అలాగే మన రాష్ట్ర విద్యార్థులు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 15 శాతం సీట్లను మెరిట్ ప్రాతిపదికన పొందే అవకాశముంటుంది.
Comments
Please login to add a commentAdd a comment