దరఖాస్తుల కొరత | Voter registration has received good response from the public | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల కొరత

Published Mon, Mar 10 2014 3:29 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

Voter registration has received good response from the public

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఓటరు నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఫారం-6 దరఖాస్తులు తగినన్ని సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఈ కారణంగా చాలా మంది ఓటరుగా నమోదయ్యే అవకాశాన్ని కోల్పోయారు. జిల్లా కేంద్రంలోని ఎన్నికల సెల్‌లో ఫారం-6 దరఖాస్తులు భారీగా నిల్వ ఉన్నప్పటికీ పోలింగ్ స్టేషన్లకు తరలించడంలో సంబంధిత తహశీల్దార్లు, ఆర్‌ఓలు అసలత్వం వహించినట్లు తెలుస్తోంది.
 
 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉండగా, దాదాపు అన్నింటినీ బీఎల్‌ఓలు తెరచి ఉంచారు. కొన్ని నియోజకవర్గాల్లో ఫారం-6 దరఖాస్తుల కొరత ఏర్పడగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో తగిన ప్రచారం లేక స్పందన కరువైంది. కోడుమూరు నియోజకవర్గంలో ఫారం-6ల కొరత స్పష్టంగా కనిపించింది. కోడుమూరు, సి.బెళగల్ మండలాల్లోని చాలా పోలింగ్ కేంద్రాలకు దరఖాస్తులే సరఫరా చేయకపోవడం గమనార్హం. ఇంత ప్రచారం చేసి తీరా దరఖాస్తులు అందుబాటులో ఉంచకపోవడంతో ఓటర్లుగా నమోదయ్యేందుకు వెళ్లిన వారు అసంతృప్తితో వెనుదిరిగారు. గూడూరు మండలంలోని పోలింగ్ కేంద్రాలకు 10 ప్రకారం దరఖాస్తులు పంపారు. ఇవి ఏమాత్రం సరిపోకపోవడంతో జిరాక్స్ చేసి వినియోగించుకున్నారు. కోవెలకుంట్ల, సంజామల, అవుకు మండలాల్లోను దరఖాస్తులు కొరత తలెత్తింది. కల్లూరులోనూ ఇదే పరిస్థితి నెలకొనగా అప్పటికప్పుడు కలెక్టరేట్‌లోని ఎన్నికల సెల్ నుంచి తరలించారు. జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆదోని మండగిరి గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రం బీఎల్‌ఓ ఓటరు నమోదు కార్యక్రమానికి గైర్హాజరైనట్లు గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని ఆర్‌ఓను ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమంతో పాటు పోలింగ్ కేంద్రాల్లోని సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు.
 
 పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని కోరుగోలు, చింతాలపల్లి, గుమ్మితంతండాల్లోని పోలింగ్ కేంద్రాల్లో తూతూమంత్రంగా ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. బీఎల్‌ఓలు పోలింగ్ స్టేషన్లను కొద్దిసేపు మాత్రమే తెరచి ఉంచడంతో పలువురు ఓటర్లుగా నమోదు కాలేకపోయారు. కర్నూలు, డోన్, ఆళ్లగడ్డ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు మంచి స్పందన వచ్చింది. పాణ్యం, ఆలూరు, పత్తికొండ, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఓటరు నమోదు కార్యక్రమానికి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు నమోదు కార్యక్రమంపై తగిన ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణమైంది.
 
 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలతో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా ఉండాలి. బోగస్ ఓటర్లు నమోదు కాకుండా ఉండేందుకు బీఎల్‌ఏలు తప్పక ఉండాలని ఎన్నికల అధికారులు సూచించారు. అయితే 80 శాతం పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఏలు గైర్హాజరయ్యారు. కర్నూలులో పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే విచారించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆర్‌ఓలు, బీఎల్‌ఓలను ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement