- ఎక్సైజ్ శాఖలో అద్దె స్కానర్ల హడావుడి
- లెసైన్స్‌తో స్కానర్లకు లింకు
- కొనుగోలు స్థానంలో అద్దె ప్రతిపాదన
- నెలకు రూ.4,997 అద్దె
- 28లోపు ఏర్పాటు చేస్తామని వ్యాపారుల నుంచి అఫిడవిట్
సాక్షి, విజయవాడ : ఎక్సైజ్ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా చర్చనీయాంశమవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ప్రతి మద్యం దుకాణంలో అద్దె ప్రాతిపదికన బార్‌కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయాలని అఫిడవిట్లు స్వీకరించడం ఎక్సైజ్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. మద్యం దుకణాల్లో అక్రమాలు నివారించేందుకు, స్టాకు వివరాలు తెలుసుకునేందుకు ప్రతి షాపులో బార్‌కోడ్ స్కాన్ మిషన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు అధికారులు అన్ని షాపుల యజమానులకు సూచించారు. అయితే వ్యాపారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు కొత్త లెసైన్స్‌లతో లింకు పెట్టారు. స్కానర్ ఉంటేనే లెసైన్స్‌లు జారీ చేస్తామని నిబంధన విధించారు. గతంలో స్కానర్ల వ్యవహారం కొంత వివాదాస్పదమైంది. ఈ క్రమంలో స్కానర్ల కొనుగోలు కాకుండా, అద్దె ప్రాతిపదికన తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 28లోపు స్కానర్లు ఏర్పాటు చేస్తామని వ్యాపారుల నుంచి అధికారులు అఫిడవిట్లు స్వీకరిస్తున్నారు.
శ్రీ టెక్నో సిస్టమ్స్‌కు బాధ్యతలు..
జిల్లాలో 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. వీటిలో సొంతగా స్కానర్లు ఏర్పాటు చేయాలంటే రూ.4.10 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో వ్యాపారికి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. దీంతో స్కానర్ల ఏర్పాటును వ్యాపారులు వ్యతిరేకించారు. ప్రభుత్వం మాత్రం స్కానరు ఉంటేనే లెసైన్స్ ఇవ్వాలని, అవసరమైతే మద్యం సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది.
దీంతో అధికారులు, వ్యాపారులు సమావేశమై అద్దె ప్రాతిపదికన స్కానర్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండేళ్లకు అద్దెకు స్కానర్లు సరఫరా చేయాలని శ్రీ టెక్నో సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో షాపునకు నెలకు రూ.4,997 చొప్పున అద్దె చెల్లించేలా నిర్ణయించారు. ఈ లెక్కన శ్రీటెక్నో సిస్టమ్స్‌కు నెలకు రూ.22లక్షల వరకు అద్దె లభిస్తుంది.
నెల రోజుల కిందట జరిగిన ఈ ఒప్పందానికి అన్ని దుకాణాలు, బార్ల యజమానులు అంగీకరించారు. అయితే నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు స్కానర్లు ఏర్పాటు చేయకపోవడంతో అధికారులు మళ్లీ హడావుడి చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీలోపు స్కానర్లు ఏర్పాటు చేసుకుంటామని అఫిడవిట్లు అందజేయాలని వ్యాపారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు పది శాతం మంది వ్యాపారులు మాత్రమే అఫిడవిట్లు సమర్పించారు. స్కానర్లు శ్రీటెక్నో సిస్టం నుంచే ఎందుకు అద్దెకు తీసుకోవాలని మరికొందరు తర్జనభర్జనపడుతున్నట్లు సమాచారం.