మద్యం కల్తీ.. జేబు లూటీ | Adulteration of alcohol .. | Sakshi
Sakshi News home page

మద్యం కల్తీ.. జేబు లూటీ

Published Wed, Nov 19 2014 4:06 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM

మద్యం కల్తీ.. జేబు లూటీ - Sakshi

మద్యం కల్తీ.. జేబు లూటీ

మద్యం ప్రియులకు కిక్కు దిగిపోయే విషయమిది. సీలు మద్యం సీసాలో ‘స్పిరిట్’ చేరుతోంది. సర్కారు పుణ్యమా అంటూ బార్లు బార్లాగా తెరవడంతో మద్యం విక్రయాలు కూడా పెరిగాయి. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మకాలు జరుగుతున్నాయి. అధికార పక్ష నాయకుల ఆశీస్సులున్న దుకాణాల వైపు అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా మద్యంలో స్పిరిట్ కలిపి కల్తీ చేస్తున్నారు. దీంతో మందుబాబులు మరింత అనారోగ్యం పాలవుతున్నారు.
 
* మందుబాబులకు టోకరా
*మత్తు కోసం ‘స్పిరిట్’ వినియోగం
* రోజుకు రూ.30 వేలు అక్రమార్జన
* శివారు ప్రాంతాలే టార్గెట్
* అనారోగ్యం పాలవుతున్న మద్యం ప్రియులు

కైకలూరు : సాయంత్రం 6 గంటలు.. కైకలూరు పట్టణ శివారులోని ఓ మద్యం దుకాణం.. రోజంతా కష్టపడిన కూలీలు మద్యం కోసం కౌంటర్ వద్ద గుమిగూడారు. ఇంతలో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి రెండు క్వార్టర్ల మద్యం కొన్నారు. ఓ చేపల చెరువు గట్టుపై కూర్చుని తాగడం మొదలుపెట్టారు. అలా నోటి దగ్గర పెట్టారో లేదో వాంతులయ్యాయి. అసలు విషయం ఏమిటంటే అది కల్తీ మద్యం. వివిధ బ్రాండ్లకు చెందిన క్వార్టర్, హాఫ్ సీసాల్లో ఈ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. సీసాల మూతలను చాకచక్యంగా తీసి అందులో కొంత మద్యాన్ని తీసి, అనుమానం రాకుండా నీరు, స్పిరిట్‌తో నింపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు తాగే మందులో నాణ్యత ఎంత అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. మందు బాబులు దుకాణదారులను గట్టిగా నిలదీద్దామంటే.. గొడవ జరిగితే పరువు పోతుందని మిన్నకుంటున్నారు. కొంతమంది కల్తీ మందు అంటగట్టారని అడిగితే అదేదో సీసా మూత తీయకముందే చెప్పాలంటూ దుకాణ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు.
 
కల్తీ ఎలా జరుగుతోందంటే...
మద్యం దుకాణం మూసేసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతును దుకాణంలో పనిచేసే సిబ్బందితో చేయిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ అమ్మకాలు జరిగే  బ్రాండ్లపై వీరు దృష్టి సారిస్తున్నారు. మూడు అంగుళాల సైజులో స్క్రూ డ్రైవర్ (కనెక్టర్) అనే చిన్న పరికరంతోసీసా మూతను తీస్తున్నారు. ఒక్కో బాటిల్ నుంచి మద్యం తీసి, దాని స్థానంలో నీరు, ‘స్పిరిట్’ కలుపుతున్నారు. తిరిగి యథావిధిగా మూతను పెడుతున్నారు. అలా సేకరించిన మద్యాన్ని ఖాళీ ఫుల్‌బాటిల్స్‌లో పోసి దుకాణం వద్ద లూజు విక్రయాల్లో వినియోగిస్తున్నారు.

ఎక్కువగా మెన్స్‌క్లబ్, ఎంసీ బ్రాందీ, ఎంసీ విస్కీ బ్రాండ్లలో కల్తీ చేస్తున్నారు. కల్తీ చేసిన మద్యం సీసాలను తాము గుర్తించడం కోసం దుకాణంలో ఒక అరలో పెడుతున్నారు. రోజూ వచ్చే వ్యక్తులకు కాకుండా కొత్తవారు,  ప్రయాణంలో వెళుతూ ఆగి తీసుకునేవారికి కల్తీ చేసిన మందును అంటగడుతున్నారు. కల్తీలో ఉపయోగించే స్పిరిట్‌ను మందుల దుకాణాల్లో తీసుకుంటున్నారు.
 
కేసుకు రూ.1,850 లాభం...
కల్తీదారులు ఒక క్వార్టర్ బాటిల్ నుంచి 60 ఎంఎల్ మద్యం తీస్తున్నారు. సాధారణంగా క్వార్టర్‌కు 180 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. దీనిని ఒక్కో పెగ్గుగా మూడు బాగాలుగా విభజిస్తారు. పెగ్గు 60 ఎంఎల్‌గా ఉంటుంది. ఉదాహరణకు ఒక రకం బ్రాందీ క్వార్టర్ సీసాకు రూ.115 వసూలు చేస్తున్నారు. దీనిని బట్టి కేసులోని 48 బాటిళ్లలో పెగ్గు మందు చొప్పున తీస్తే వారికి రూ.1,850 మిగులుతుంది. బ్రాండు రేటు పెరిగితే ఆదాయం మరింత పెరుగుతుంది. దీనికి తోడు ఈ విధంగా సేకరించిన మద్యాన్ని ఖాళీ ఫుల్ బాటిల్స్‌లో పోసినప్పుడు నీటిని కలుపుతున్నారు. అంటే లూజు విక్రయాల ద్వారా మరికొంత ఆదాయం వస్తుంది.

ఇక బాటిల్‌లో కల్తీ చేసే ‘స్పిరిట్’ 500 ఎంఎల్ ధర సుమారు రూ.150 ఉంటుంది. దీనిని ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సల సమయంలో పైపూతగా వాడతారు. స్పిరిట్‌లో ఆల్కహాల్ ఇమిడి ఉంటుంది. ఒక కేసుకు రెండు స్పిరిట్ బాటిళ్లను వినియోగిస్తారు. దీనిని బయట మందుల దుకాణాల్లో విక్రయించడం లేదు. ఆస్పత్రుల నుంచి వీటిని సేకరిస్తున్నట్లు సమాచారం. స్పిరిట్ అందుబాటులో లేనప్పుడు చీప్ క్వార్టర్ బాటిళ్లలోని మందును నింపుతున్నారు. ప్రధాన బ్రాండ్ల విషయంలో స్పిరిట్ వాసన వచ్చే అవకాశం ఉన్నప్పుడు నీళ్లు కలిపి మూత బిగించేస్తున్నారు.
 
అమలుకు నోచని ‘ఎమ్మార్పీ’ విక్రయాలు...
ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు జరగాలని అధికారులు ఆదేశాలిస్తున్నా అనేక చోట్ల అమలు కావడం లేదు. క్వార్టర్‌కు రూ.5, హాఫ్‌కు రూ.10, ఫుల్ బాటిల్‌కి రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని సామాన్యులు అడిగితే అధికార సిండికేట్లు రంగంలోకి దిగితున్నారు. వాళ్ల అండ చూసుకుని దుకాణాల్లో పనిచేసే సిబ్బంది రెచ్చిపోతున్నారు. రాత్రిపూట నిర్ణీత సమయం దాటిన తరువాత కూడా విక్రయాలు సాగిస్తున్నారు. అదేమిటంటే ‘అధికారం మాది.. రాత్రి ఎన్ని గంటలైనా అమ్ముతాం ఏంటంటా?’ అని సమాధానం ఇస్తున్నారు.

అధికార పక్ష అండదండలున్న దుకాణాల వైపు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. కొద్ది నెలల క్రితం ఓ దుకాణంలో కల్తీ మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి, ఇంటికి వెళ్లిన తర్వాత గుర్తించి దుకాణంలో సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో అతనికి మరో బాటిల్ అందించారు. ఇటీవల కైకలూరులో రాత్రివేళ మందు తాగిన యువకులను గొడ్డును బాదినట్లు బాదిన ఓ ఎస్సై ఆ సమయంలో తెరిచి ఉన్న మద్యం దుకాణం జోలికి వెళ్లకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కల్తీ విక్రయాలపై కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.  
 
ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం
కల్తీ మద్యం అమ్మకాలపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని కైకలూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ సి.భార్గవ చెప్పారు. అనుమానం కలిగిన మద్యం బాటిళ్లను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసిన తర్వాత కల్తీ కలిసిందని తెలిస్తే సదరు దుకాణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement