చినబాబు రాక.. కబ్జాదారుల వేట! | Mangalagiri Constituency Land Grabbers Happy With Nara Lokesh | Sakshi
Sakshi News home page

చినబాబు రాక.. కబ్జాదారుల వేట!

Published Sun, Mar 17 2019 1:36 PM | Last Updated on Sun, Mar 17 2019 1:38 PM

Mangalagiri Constituency Land Grabbers Happy With Nara Lokesh - Sakshi

ఆత్మకూరు (మంగళగిరి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌ మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీకి రంగంలోకి దిగారో లేదో.. వెంటనే భూకబ్జాదారులు సైతం అక్కడ వాలిపోయారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి లోకేష్‌ పేర్లు చెప్పి  రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం శనివారం మంగళగిరిలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఆత్మకూరు గ్రామంలో హ్యాపీ రిసార్ట్స్‌ అధినేత అంబటి మధుమోహనకృష్ణ మరికొంతమంది కలిసి శాంతి హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 1995లో భూములు కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేశారు. ఆత్మకూరు గ్రామం 373 సర్వే నంబరులోని ఎనిమిది ఎకరాల భూమిలో రియల్‌ వెంచర్‌ వేసి ఒక్కో ప్లాటు 200 గజాల చొప్పున అందులో టేకు, మామిడి, జామ మొక్కలు పెంచి ఐదు సంవత్సరాల పాటు వాయిదా కట్టేలా ప్లాట్లు విక్రయించారు.

దీంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు చెందిన 127 మంది ప్లాట్లను కొనుగోలు చేసి నెలా నెలా వాయిదా చెల్లించి 1999–2000వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అయితే 373 సర్వే నంబర్లోని ఎనిమిది ఎకరాలను తాను కొనుగోలు చేశానంటూ 2003లో పిడుగురాళ్ళకు చెందిన పచ్చవ వేమయ్య దస్తావేజులు తేవడంతో వెంచర్‌ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. పిడుగురాళ్ళలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కార్యాలయం సైతం వేమయ్యదే కావడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అడంగల్‌లో పేర్లు ఎక్కించుకుని మళ్లీ కబ్జాకు యత్నించగా ప్లాట్ల యజమానులంతా అసోసియేషన్‌గా ఏర్పడి సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. వివాదం కోర్టులో ఉండగా వేమయ్య హైకోర్టును ఆశ్రయించగా..ఇరు పక్షాలు సివిల్‌ కోర్టులో రుజువులు చూపించాలని ఆదేశించింది.

సివిల్‌ కోర్టులో వాదనలు జరుగుతుండగా కోర్టు ఈనెల 27 వ తేదీకి వాయిదా వేసింది. కోర్టులో తమ నకిలీ దస్తావేజులు చెల్లవనే ఆందోళనతో వేమయ్య తమ అధికార బలంతో పాటు, తన అల్లుడికి జిల్లా ఉన్నతాధికారి స్నేహితుడు కావడంతో అటు రాజకీయ నాయకుల్ని, ఇటు అధికారుల్ని ఉపయోగించి ఆగమేఘాల మీద భూమిలోని టేకు చెట్లను తొలగించేందుకు ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్‌తో తహసీల్దార్‌ ఎన్‌వోసీ ఇవ్వగా దాన్ని ఆధారంగా చూపి అటవీశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇదే అదనుగా వేమయ్య 50 మంది అనుచరులతో శనివారం అర్ధరాత్రి వివాదాస్పద స్థలంలో టేకు చెట్లను నరికించారు.

విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లలో ఉన్న టేకు చెట్లు ఎలా నరుకుతారంటూ ప్రశ్నించగా, ఎవరు వచ్చినా మమ్మల్ని అడ్డుకోలేరని, లోకేష్‌ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారని ఇక తమను అడ్డుకునే ధైర్యం ఎవరికీ ఉండదని.. అడ్డుకుంటే అడ్డుకున్న వారిని నరుకుతామంటూ వేమయ్య బెదిరింపులకు దిగినట్లు ప్లాట్ల యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న యజమానులంతా అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగడంతో చెట్లను నరకడం ఆపారు. బాధితులు ఆందోళన చేస్తుండగా వేమయ్య మాత్రం తన వాహనాల్లో వచ్చిన వారితో అక్కడే తిష్ట వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు సైతం సివిల్‌ వివాదం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితులు కోర్టు వాయిదా ఉన్న 27వ తేదీ వరకు కుటుంబాలతో సహా ఇక్కడే ఉండి తమ ప్లాట్లను కాపాడుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.

పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు..
1995లో వేసిన ప్లాట్లను వాయిదాల్లో డబ్బు కట్టి 1999–2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. నకిలీ దస్తావేజులు సృష్టించిన వేమయ్య మమ్మల్ని బెదిరిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, లోకేష్‌ తమకు అండగా ఉన్నారని, అడ్డుకుంటే నరుకుతామని బెదిరిస్తున్నారు. కోర్టులో వివాదం నడుస్తుండగా అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడితో పాటు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసింది.  –పడిగి శ్రీనివాసరావు ప్లాట్ల యజమానుల సంఘం కార్యదర్శి

కోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఎవరినీ అనుమతించవద్దు..
భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందని నోరు కట్టుకుని నెలా నెలా కట్టుకుని ఎంతో కష్టపడి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. భూముల ధరలు పెరగడంతో టీడీపీ నేతల అండతో కబ్జాకు యత్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఎవరినీ అనుమతించకుండా చర్యలు తీసుకోవాలి. – నసీమున్నీషా

అధికారులు మాకు రక్షణ కల్పించాలి
భూమిపై వేమయ్యకు అన్ని హక్కులుంటే అర్ధరాత్రులు ఎందుకు చెట్లు నరకడం. పగలే తనది భూమి అని చెప్పి చెట్లు నరికి స్వాధీనం చేసుకోవచ్చు కదా. తాము వచ్చి అడ్డుకుంటే బెదిరిస్తున్నారు. లోకేష్, యరపతినేని అండగా ఉన్నారని, కబ్జాను అడ్డుకుంటే మనుషులను నరుకుతాం అంటున్నారు. అధికారులు మాకు రక్షణ కల్పించాలి.    – ఎన్‌.ఝాన్సీరాణి

నోటికాడ ముద్ద లాక్కోవాలని చూస్తున్నారు
పిల్లలతో పాటు మా జీవితాలకు ఆధారంగా ఉంటుందని తినీ తినక నెలా నెలా కిస్తీలు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. ఇప్పుడు మా నోటి కాడ ముద్ద లాక్కోవాలని చూస్తున్నారు. అధికార పార్టీ నేతలు అధికారుల అండతోనే ఆక్రమణకు పూనుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులు కలుగజేసుకుని మా ప్లాట్లను కాపాడి మా జీవితాలను నిలబెట్టాలి.    – బండి నాగమల్లేశ్వరి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement