
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి, టీడీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ ప్రచారంలో జనం కన్నా కార్ల హవానే ఎక్కువ కనబడుతోంది. ఆదివారం తాడేపల్లి మున్సిపాలిటీలో జరిగిన లోకేశ్ ప్రచార కార్యక్రమం జనం లేక వెలవెలబోయింది. ఉండవల్లి సెంటర్ నిత్యం వాహనాలతో రద్దీగా ఉండడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభమైన సమయంలో ప్రజలు ఆయన కాన్వాయ్ వెంట కనిపించారు. అయితే అక్కడనుంచి దారి పొడవునా లోకేష్ కారు వెంట ఆయన సామాజికవర్గం, తాడేపల్లిలోని ముఖ్య నేతలు తప్ప ఎవరూ కనిపించలేదు.
తాడేపల్లి సాయిబాబా గుడి, ఉండవల్లి సెంటర్ ప్రధాన రహదారిలో టీడీపీ నాయకులు ఇళ్లలో ఉన్న వారిని బయటకు రావాలంటూ మరీ పిలుచుకొచ్చి లోకేశ్‌తో మాట్లాడించారు. ఒకానొక సమయంలో తన కాన్వాయ్ వెంట కార్లు తప్ప జనం కనిపించడం లేదంటూ లోకేశ్ స్థానిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కారు వేసుకు రావడంతో ఆయన ప్రచారం చేసే కారు వెనుక 10, 15 కార్లు ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment