సాక్షి, అమరావతి : జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. టీడీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో విచ్చల విడిగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. అడ్డాకూలీలతో జెండాలు మోయిస్తూ ప్రచారంలో హడావుడి చేస్తున్నారు.
టీడీపీ పాలనపై సానుకూలత లేకపోవడంతో ఓటర్లతో బేరసారాలకు దిగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలు సేకరిస్తూ, స్లిప్పులు పంచుతూ ఆ ఇంటిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ఆ తరువాత వారికి డబ్బులు ఇస్తున్నారు. మరి కొందరి బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకుని నగదు జమచేస్తున్నారు. ప్రధానంగా డ్వాక్రా సంఘాల మహిళ ఓట్లు పొందేందుకు కానుకలతో వల విసురుతున్నారు. బాపట్ల, సత్తెనపల్లిలో చీరెలు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే గ్రామాలకు చేరిన డబ్బు మూటలు
టీడీపీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే డబ్బుల మూటలు సిద్ధం చేసుకున్నారు. గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పొన్నూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఆయా గ్రామాల్లో తమ అనుకూలంగా, నమ్మకంగా ఉండే నాయకుల వద్దకు డబ్బు సంచులు చేర్చి పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో సీఎం తనయుడు లోకేష్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో అందరి చూపై ఆ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంచి వ్యక్తిగా, రాజధాని ప్రజల సమస్యలపై పోరాటం చేయడంతోపాటు, నిత్యం అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు పొందారు.
దీనికితోడు రాజన్న క్యాంటీన్లో నాలుగు రూపాయలకు భోజనం, పది రూపాయలకు ఐదు రకాల కూరగాయలు పంపిణీ ద్వారా పేద ప్రజలకు సేవ చేశారు. ప్రచారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందంజలో ఉండగా, టీడీపీ అభ్యర్థి లోకేష్ వెనుకబడిపోయారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తలంపుతో అక్కడ డబ్బులు భారీగా పంచుతున్నారని టీడీపీ నాయకులే పేర్కొంటున్నారు.
ఏజెంట్లపై గురి
టీడీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో ఎన్నికల్లో ఏదో విధంగా గట్టెక్కేందుకు రకరకాల ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో చోటామోటా నాయకులకు డబ్బులతో ఎర వేస్తున్నారు. పోలింగ్ రోజున ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంబంధించి పోలింగ్ బూత్‌ల్లో కూర్చునే ఏజెంట్లుగా ఎవరు ఉంటారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారీని పోలింగ్ ముందు రోజు రాత్రి నయానోభయానో డబ్బులతో లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పొన్నూరు, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లు, చోటామోటా నాయకులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ అభ్యర్థులు గెలుస్తామని ఆశపెట్టుకొన్న నియోజక వర్గాలోనూ ఎదురుగాలి వీస్తుండటంతో డబ్బు మూటలపైనే ఆశలు పెట్టుకొన్నట్లు టీడీపీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతోంది.
టీడీపీ ప్రలోభాలను దీటుగా తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద పోలింగ్ గడువు సమీపించే కొద్దీ ఓటరు దేవుళ్లలను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు.
Comments
Please login to add a commentAdd a comment