సాక్షి, అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అంటేనే కాదు.. ఆయన అల్లుడు నారా లోకేశ్ అన్నా టీడీపీ నాయకులు భయపడుతున్నారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే వీరంగం సృష్టిస్తుండగా.. లోకేశ్ తన తత్తరపాట్లు.. బిత్తిరి వ్యాఖ్యలు, అర్థంలేని ఆరోపణలతో సొంత పార్టీనే అభాసుపాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను ప్రచారానికి పిలువడానికి టీడీపీ అభ్యర్థులు జంకుతున్నారని తెలుస్తోంది.
లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి తప్ప.. ఇతర జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు ఆయనను పిలువడం లేదు. కనీసం గుంటూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ లోకేశ్‌ను టీడీపీ అభ్యర్థులు ఆహ్వానించడం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచార భేరి రేపటితో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నా.. లోకేశ్‌తో ప్రచారం చేయించుకోవడానికి పార్టీ అభ్యర్థులు సుముఖత వ్యక్తం చేయడం లేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో లోకేశ్ చేస్తున్న అర్థంపర్థం లేని వ్యాఖ్యలు.. తత్తరపాట్లు పార్టీకి నష్టాన్ని చేకూరుస్తున్నాయని టీడీపీ వర్గాలు తాజాగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తాను పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ లోకేశ్ ఎదురీదుతున్నారు. గెలుపు మీద నమ్మకం లేకపోవడంతో ఇంటింటికి తిరిగి మరి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు పార్టీ అధినేత తనయుడినైనా తనను ఎవ్వరూ ఎన్నికల ప్రచారానికి పిలువకపోవడంపై లోకేశ్ కినుక వహించారట. టీడీపీ అభ్యర్థులు తనతో ప్రచారం చేయించుకోవడానికి ఉత్సాహం చూపకపోవడంపై ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment