రాజమల్లయ్య మృతదేహం,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్
కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం వేర్వే రు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో ఓ యువకుడు మోసం చేశాడని బాలిక(16) నిప్పంటించుకుంది. మేడిపెల్లికి చెందిన దామెర కనక(47) మానసికస్థితి సరిగ్గా లేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని చనిపోయింది. ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన బొత్త రాజమల్లయ్య(60) ఉరివేసుకున్నాడు.
బైక్ కొనివ్వడం లేదని వేములవాడ మండలంలోని తిప్పాపూర్‌కు చెందిన బానోతు మల్లేశ్ (19) ఆత్మహత్య చేసుకున్నాడు.చిగురుమామిడి(హుస్నాబాద్): తెలిసీ.. తెలియని వయసులో ఓబాలిక యువకుడి మాటలకు మోసపోయి.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని ముదిమానిక్యంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది.
ఇటీవల గ్రామంలో జేసీబీ ద్వారా మిషన్ భగీరథ పైపులైన్లు వేసేందుకు మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముత్తారం గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీకాంత్(25) వచ్చాడు. ఈ క్రమంలో బాలికకు- శ్రీకాంత్ మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 25న ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని సదరు బాలిక తల్లిదండ్రులకు తెలిపింది.
ఈ క్రమంలో తీవ్రమనస్తాపం చెంది సాయంత్రం ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. కుటుంబసభ్యులు కరీంనగర్ తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలకుంట శ్రీకాంత్‌పై కేసునమోదు చేసినట్లు్ల చిగురు మామిడి పోలీసులు తెలిపారు.
మానసిక స్థితి సరిగా లేక..
మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండల కేంద్రానికి చెందిన దామెర కనక(47) మానసికస్థితి సరిగ్గా లేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కనక గత కొద్ది రోజులుగా మానసికస్థితి సరిగ్గా లేక బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబసభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కొడుకు దివాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
అనారోగ్యంతో..
ముస్తాబాద్(సిరిసిల్ల) : ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన బొత్త రాజమల్లయ్య(60) అనారోగ్యంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించిన రాజమల్లయ్య తెల్లవారేసరికి దూలానికి వేలాడాడు. రాజమల్లయ్య, లక్ష్మి దంపతులకు ఏకైక కుమార్తె రజిత ఉండగా.. ఆమెకు వివాహం చేశారు. వృద్ధదంపతులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. కొంత కాలంగా రాజమల్లయ్య అనారోగ్యానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసునమోదు చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
బైక్ కొనివ్వడం లేదని..
వేములవాడఅర్బన్ : వేములవాడ మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన బానోతు మల్లేశ్ (19) ఇంట్లో ఉరి వేసుకుని గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. మల్లేశ్ జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తనకు ద్విచక్ర వాహనం కావాలని తండ్రి కిష్టయ్యను కొద్దిరోజులుగా కోరుతున్నాడు. వాహనం కొనివ్వక పోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఘటనాస్థలానికి పట్టణ ఎస్సై వెంకట్రాజమ్ సందర్శించి, కేసు నమోదు చేశారు.
పోలీసుల భయంతో ఆత్మహత్యాయత్నం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం) : పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నారన్న భయంతో నిందితుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. ఇటీవల ఓసీపీ- 3 పంప్‌హౌస్‌వద్ద జరిగిన కాఫర్‌కేబుల్ చోరీ,సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ సమీపంలోని ఓబీ డంప్‌యార్డ్‌పై జరిగిన కేబుల్ చోరీల్లో గండికోట కుమార్‌పై గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈక్రమంలో పోలీస్‌స్టేషన్ రమ్మని ఇంటికి కబురంపడంతో భయపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. దీనిపై టూటౌన్ సీఐ చిలుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్టేషన్‌లో కేబుల్ చోరీపై కేసునమోదైన విషయం వాస్తవమే అన్నారు. ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్‌కు రాలేదని, ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment