దాదాపు సగం మంది గైర్హాజరు
ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ పార్టీ అభ్యర్థులు కరువయ్యారు. కరీంనగర్‌లో సోనియా బహిరంగ సభ నిర్వహణలో టీపీసీసీ ఘోరంగా విఫలమైంది. తెలంగాణలో పార్టీ తరఫున పోటీ చేస్తున్న మొత్తం 119 మంది ఎమ్మెల్యే, 17 మంది ఎంపీ అభ్యర్థులను ఈ సభకు టీపీసీసీ ఆహ్వానించింది. అందరినీ ఇక్కడికి రప్పించి.. సోనియాకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు సభా వేదికపై పరిచయ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు హెలీపాడ్ నుంచి వేదికపైకి వెళ్లే మార్గంలో అభ్యర్థులందరినీ క్యూలో నిలబెట్టేందుకు వీలుగా సోనియా భద్రతను చూసుకునే ఎస్‌పీజీ అధికారుల నుంచి టీపీసీసీ చీఫ్ పొన్నాల ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు.
అభ్యర్థుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. తీరా సమయానికి ఎమ్మెల్యే అభ్యర్థులు సగానికిపైగా సభకు డుమ్మా కొట్టారు. ఇక ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులే హాజరయ్యారు. దీంతో పార్టీలోని సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు తొలిసారిగా తెలంగాణలో ఎన్నికల పర్యటనకు వస్తే.. కనీసం మర్యాదపూర్వకంగానైనా కలిసేందుకు రావాల్సిన అభ్యర్థులు ముఖం చాటేయడంతో పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోనియా వచ్చే సమయానికి క్యూలో నిలబడే అభ్యర్థులు కరువవడంతో పొన్నాల హడావుడి పడటం కనిపించింది. అప్పటికప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను సైతం క్యూ లైన్‌లోకి అనుమతించారు. అమ్మ దృష్టిలో పడేందుకు అదృష్టం కలిసిరావడంతో.. సోనియాకు నమస్కారం పెట్టేందుకు, పాదాభివందనం చేసేందుకు.. కండువాలు బహుకరించేందుకు చోటా లీడర్లు పోటీ పడ్డారు.
అమ్మ సభకు అభ్యర్థుల డుమ్మా
Published Thu, Apr 17 2014 1:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement