టీఆర్ఎస్ ఓ పిల్లకాకి... కేసీఆర్ పెద్ద అవకాశవాది
టీఆర్ఎస్ పార్టీ ఓ పిల్లకాకి అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదని పొన్నాల స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ విచ్చేసిన పొన్నాల విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. కేసీఆర్ పెద్ద అవకాశవాది అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఓ విధమైన నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.
30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైన ప్రజా సంక్షేమం కోసం ఓ పథకం గురించి మాట్లాడారా అంటూ కేసీఆర్ను పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకున్న వారిని, తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఘనత కేసీఆర్దని పొన్నాల నిప్పులు చెరిగారు. ఈ నెల 16న సోనియాగాంధీ కరీంనగర్ వేదికగా బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను పొన్నాల ఈ సందర్బంగా పర్యవేక్షించారు.