చుట్టూ అడవులు.. పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. సహజసిద్ధంగా జాలువారే జలపాతాలు.. హోరెత్తే నీటి హొయలు.. వెరసి ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయిన అద్భుత ‘చిత్రం’.. రాయికల్ జలపాతం. వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో.. వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా మిగిలిపోయిన ఈ జలపాతం.. ఇప్పుడిప్పుడే పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. – సాక్షి, హైదరాబాద్
కమనీయం.. ప్రకృతి రమణీయం
చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు.. ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదిక్కడ. 170 అడుగుల ఎత్తు నుంచి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతూ ఉంటుంది. 5 అంచెలలో సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది.
చక్కటి పర్యాటక కేంద్రం
కరీంనగర్, వరంగల్ నగరాలకు అత్యంత సమీపం లో ఉండటం వల్ల ఈ జలపాతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతానికి ఏ మాత్రం తీసిపోని విధంగా రాయికల్ జలపాతం ఉంటుంది. అయితే ఈ జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, కొండలపై భాగంలో ఎలుగుబంట్లు ఉండటం తదితర కారణాల రీత్యా ఇది అంతగా ఆదరణకు నోచుకోలేదు. సరైన భద్ర తా చర్యలు చేపట్టి, అవసరమైన సౌకర్యాలను సమకూరిస్తే ఇది తెలంగాణలో ఓ మంచి పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశం ఉందని పర్యాటకుల అభిప్రాయం.
ఆద్యంతం ఆహ్లాదభరితం
ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంతదూరం గుట్టల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి.
పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం వరంగల్ సమీపంలో లేనే లేదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న చెరువు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పర్యాటకులకు ఏమి కావాలన్నా వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
చేపట్టాల్సిన భద్రతా చర్యలివీ
♦ నీళ్లలో ప్రమాదవశాత్తు పడితే బయటపడేందుకు జలపాతాల వద్ద ఇరువైపులా తాళ్లు ఏర్పాటు చేయాలి.
♦ జలపాతాల వద్ద తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది నియామకం.
♦ నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు.
♦ నీళ్లలోకి వెళ్లకుండా ఇరువైపులా జాలీ ఏర్పాట్లు
ఎలా వెళ్లాలి?
హుస్నాబాద్ సిద్దిపేట రోడ్లో ములుకనూరు వద్ద కుడి వైపు వెళ్లాలి. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన వంగర మీదుగా రాయికల్ గ్రామానికి వెళ్లాలి. గ్రామం నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది. అక్కడ వాహనాలను నిలిపి , జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment