
సాక్షి, కరీంనగర్: ‘ఇదో లక్కీ స్కీం. నెలకు రూ.1000 చొప్పున 3వేల మంది సభ్యులతో స్కీం. 16 నెలలపాటు ఈ స్కీం కొనసాగుతుంది. ప్రతి నెల 8న డ్రా తీస్తారు. డ్రాలో క్విడ్ కారుతోపాటు ఫ్రిజ్‌లు, బైక్‌లు, స్కూటర్లు, టీవీలు మొదలుకొని బంగారు ఆభరణాల వరకు విజేతలు దక్కించుకోవచ్చు. ’ ఇదీ కరీంనగర్‌లో జనం ‘కిస్మత్’ మీద కొంతమంది కలిసి ఆడుతున్న లక్కీ డ్రా ఆట. నెలకు వెయ్యి రూపాయలు కడితే 16 నెలల్లో ఏదో ఓ బహుమతి తప్పనిసరి అనే హామీతో... అదృష్టం బాగుంటే కారు, మూడు తులాల బంగారం, బుల్లెట్ బైక్ వంటివి కూడా పొందవచ్చు అనే ప్రచారంతో అమాయకులను టార్గెట్ చేస్తూ సాగిస్తున్న దందా శుక్రవారం ‘సాక్షి’ దృష్టికి వచ్చింది.
పెద్దపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఇప్పటికే సభ్యులుగా చేరిన వ్యక్తులతో శుక్రవారం సమావేశం పెట్టి తొలి లక్కీ డ్రా తీశారు. 2021 ఫిబ్రవరి 8న ఆఖరి 16వ లక్కీ డ్రా వరకు నెలకు వెయ్యి చొప్పున చెల్లించిన 3వేల మందికి బహుమతులు అందజేయనున్నట్లు ‘కిస్మత్’వాలాలు తయారు చేయించిన బ్రోచర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కలిగిన ఈ ‘కిస్మత్’ గురించి సంబంధిత పోలీసులకు కూడా తెలియకపోవడం గమనార్హం.
నెలకు రూ.1000 పేరిట దిగువ తరగతి టార్గెట్
రూ.1000 చొప్పున 16 నెలలు చెల్లించేందుకు ఉద్ధేశించిన ఈ స్కీంలో ప్రతి నెల డ్రా తీస్తామని ‘కిస్మత్’ సంస్థ ప్రచురించిన బ్రోచర్‌లో పేర్కొన్నారు. హుస్సేనీపురా అడ్రస్‌తో ఉన్న ఈ కిస్మత్ కార్యాలయానికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా ఈ బ్రోచర్ మీద పొందుపర్చారు. ఇటీవలే ప్రారంభించినట్లుగా భావిస్తున్న ఈ స్కీంకు సంబంధించి మొదటి నెల డ్రా శుక్రవారం తీశారు.
ఈ డ్రాలో మొదటి బహుమతి కింద యాక్టివా 5జీ వాహనంతోపాటు ఓరియంట్ ఐరన్, ప్యూర్‌ఇట్ వాటర్ ఫిల్టర్, 32 అంగుళాల ఐవా టీవీ, హయర్ 190 లీటర్ల ఫ్రిడ్జి, డానిక్స్ వాషింగ్ మిషన్, హాయర్ ఓవెన్, గ్యాస్ స్టవ్, బజాజ్ మిక్సర్ గ్రైండర్ ఇస్తున్నట్టు బ్రోచర్‌లో పేర్కొన్నారు. అలాగే 2 నుంచి 8 వరకు ప్రైజులను పేర్కొన్నారు. శుక్రవారం డ్రాలో ఎవరికి ఎన్ని ప్రైజులు ఇచ్చారో తెలియదు. వచ్చే నెల 8న మళ్లీ లక్కీ డ్రా ఉంటుంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అదే సమయంలో సభ్యులను తమ ‘టార్గెట్’కు అనుగుణంగా చేర్చుకుంటూనే ఉంటారు.
నెలకు 3వేల మంది ...రూ.30 లక్షల వసూలు
లక్కీడ్రా పేరుతో నెలకు 3 వేల మంది నుంచి వెయి రూపాయల చొప్పున వసూలు చేస్తే నెలకు రూ.30 లక్షలు వసూలు అవుతున్నాయి. నెలకు తీసే డ్రాలో మాత్రం వస్తువుల విలువ రెండు లక్షలు దాటని పరిస్థితి ఉంది. మొదటి నెల పేర్కొన్న వస్తువుల విలువ రూ.3 లక్షలు కూడా దాటదు. మిగతా డబ్బులు జమ అయినట్టే. రెండో నెలలో మొదటి నెల బహుమతులు పొందిన 8 మందిని తొలగించినా... రూ.30 లక్షలకు ఓ 8వేల రూపాయలే తక్కువ.
ఇలా 16 నెలలకు మొత్తం రూ.4.50 కోట్ల వరకు వసూలవుతున్నాయి. చివరి 16వ నెలలో కారు, ఫ్రీజ్, టీవీ మొదటి బహుమతిగా పేర్కొంటూ... అప్పటి వరకు బహుమతులు రాని వారికి 400 మందికి సాంసంగ్ 32 జీబీ స్మార్ట్ ఫోన్, 600 మందికి హాయర్ వాషింగ్ మిషన్లు, 199 మందికి చెవి రింగులు, 658 మందికి ఐవా 32 అంగులాల టీవీలు, 200 మందికి ఫ్రిజ్‌లు ఇస్తున్నట్లు బ్రోచర్‌లో పేర్కొన్నారు.
నిజాయితీగా లక్కీ డ్రాలో అందరికీ చెప్పినట్లు బహుమతులు ఇచ్చినా 16 నెలల వరకు ఇచ్చే వస్తువుల విలువ కనీసం రూ.కోటి దాటే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వ్యక్తులు వేసిన ఈ ప్రణాళిక ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి.
మధ్యలో ఒక నెల ఎగ్గొట్టినా... అవుట్
ఈ బ్రోచర్‌ను పరిశీలించి ‘వెనుక పేర్కొన్న ఒక వ్యక్తికి ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్ చేయగా, తొలి డ్రా శుక్రవారమే ముగిసినట్లు చెప్పాడు. ఇంకా కొందరు సభ్యులుగా చేరేందుకు అవకాశం ఉందని, రూ.1000 చెల్లించి చేరవచ్చని తెలిపాడు. ఆరు నెలలు చెల్లించిన తరువాత డబ్బులు లేక మిగతా కిస్తీలు కట్టకపోతే ఎలా అని ప్రశ్నిస్తే... కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వబోమని, జప్తు అయినట్టేనని స్పష్టం చేశాడు. అందరికీ బహుమతులు ఇస్తామని, చిన్నవి, పెద్దవి అంటే ‘కిస్మత్’ను బట్టేనని తెలిపాడు.
లక్కీ డ్రాలు నిషేధం
అదృష్టం పేరుతో ప్రజలను మోసం చేసే లక్కీ డ్రా స్కీమ్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఇలాంటి స్కీంలలో ఎవరూ చేరకూడదు. నిర్వాహకులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. లక్కీడ్రా స్కీమ్‌లను ప్రజలు నమ్మి మోసపోవద్దు. స్కీమ్ కట్టాలని ఎవరైనా సంప్రదిస్తే వెంటనే మాకు సమచారం అందించాలి.
– త్రీటౌన్ సీఐ విజ్ఞాన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment