హాస్యానికి నంది
హాస్యానికి నంది
Published Fri, Mar 3 2017 1:11 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
► తాగుబోతు రమేశ్‌కు అవార్డు
► అమ్మానాన్నలే మొదటి గురువులు
► ఉత్తమ హాస్యనటుడిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
► 150 చిత్రాల్లో ప్రతిభ చాటుకున్న నటుడు
కోల్‌సిటీ(రామగుండం) : సర్.. ఒక్క ఛాన్సివ్వండి.. నేనేంటో చూపిస్తా అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోదావరిఖనికి చెందిన తాగుబోతు రమేశ్... నంది అవార్డుకు ఎంపికయ్యాడు. ఒక్కఛాన్స్ సర్... అంటూ స్టూడియోల చుట్టూ తిరిగిన సింగరేణి గని కార్మికుడి కొడుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు... చుక్క మందు కూడా తీసుకోని అతను ఒక్క సన్నివేశమైనా పెడితే బాగుండని డైరెక్టర్లు ఫోన్ చేసి పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు... చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో... కాలే కడుపుతో కళను నమ్ముకుని ఎలాగైనా నటిస్తాను... నా నటనతో నవ్విస్తానని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో తాగుబోతు రమేశ్ పండించిన హాస్యానికి అబ్బురపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఉత్తమ హాస్యనటుడిగా గుర్తిస్తూ నంది అవార్డుకు ఎంపిక చేసింది.
ఇదీ ఫ్యామిలీ...
రామిళ్ల చినవెంకటి ఉరఫ్ పొట్లరాములు–రాజమ్మ దంపతులు ఉద్యోగరీత్యా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉన్నారు. వీరికి నలుగురు కుమారులు, కూతురు సంతానం. వెంకటయ్య ఆర్జీ–1 పరిధిలోని 2వ గనిలో మెకదామ్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. పెద్ద కుమారుడు కుమార్ తండ్రి వారసత్వ ఉద్యోగాన్ని శ్రీరాంపూర్‌లో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు సదానందం హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్నాడు. మూడో కొడుకు వెంకటస్వామి గోదావరిఖనిలో ఉంటున్నాడు. నాలుగో కొడుకైన రమేశ్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీస్‌లో తాగుబోతు రమేశ్‌గా ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. ఇటీవలనే స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
అమ్మా, నాన్నలే గురువులు...
సింగరేణి బొగ్గుబాయిలో పనిచేసే రమేశ్ తండ్రి వెంకటి అలిసిపోయి మద్యం తాగి ఇంటికి వస్తే... తండ్రిని అనుసరిస్తూ తల్లిని ఆటపట్టించడానికి, రమేశ్ చేసిన అల్లరి చేష్టలకు రాజమ్మ మురిసిపోయేది. భలే చేసినవురా కొడుకా... ఇంకోసారి సెయ్యిబిడ్డ సూత్త అంటూ ప్రోత్సహించేది. రమేశ్‌లో తెలియకుండానే ఈ నటన నాటుకుపోయింది. ఎక్కడ స్టేజీ ఫోగ్రాం ఉంటే అక్కడ రమేశ్ ప్రత్యక్ష్యమయ్యేవాడు. తాగుబోతు నటనకు అందరూ చప్పట్లతో అభినందించేవారు. కానీ రమేశ్ చుక్క మందు తీసుకోడు. మిత్రుల ప్రోత్సాహంతో ఈ నటననే సినిమా ఇండస్ట్రీ వైపు రమేశ్‌ను నడిపించింది.
పదేళ్ల క్రితం ఇండస్ట్రీ వైపు...
సినిమా పిచ్చే రమేశ్‌ను ఇండస్ట్రీకి నడిపించింది. ఈ పిచ్చితోనే ఎలాగైనా సినిమాలో ఛాన్స్ కొట్టాలని 2006లో హైదరాబాద్‌కు వెళ్లాడు. రాత్రిళ్లు పార్ట్‌టైం పనులు చేస్తూ... పగలంతా ఫిలిం ఇండస్ట్రీలలో తన నటనను డైరెక్టర్లకు చూపించడానికి కాలిబాటలో తిరిగాడు. రోడ్ల పక్కన తాగుబోతులు, మానసిక రోగులు పడుతున్న ఇబ్బందులు చూసిన రమేశ్... రూంకెల్లాక వారిని అనుసరిస్తూ ప్రాక్టిస్ చేసేవాడు. మిత్రుల ముందు వాటిని ప్రదర్శిస్తూ వారెలా ఫీలవుతున్నారో గమనించేవాడు. అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఎన్నో కష్టాలు పడి చివరికి డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన మహాత్మ చిత్రం ద్వారా తన నటనను రంజిపజేయడంతో, ప్రపంచానికి కొత్త అనుభూతిని పంచే హాస్యనటుడిగా పరిచయమయ్యాడు.
సుమారు 150కు పైగా సినిమాల్లో ప్రతిభ
తాగుబోతు రమేశ్‌గా ఇప్పటికీ సుమారు 150కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడు. జగడం, మహాత్మ, భీమిలి కబడ్డి జట్టు, అలా మొదయ్యింది, పిల్లజమిందార్, ఈగ, రచ్చ, రొటీన్‌లవ్ స్టోరీ, చిత్రాలు బెస్ట్ హాస్యనటుడిగా గుర్తింపు వచ్చింది. అలాగే జగడం, గొడవ, నామనసుకు ఏమైంది, ఈ వయసులో, అప్పలరాజు, వాంటెడ్, అహానాపెళ్లంట, ఎస్‌ఎంఎస్, కెమెరామెన్ గంగతో రాంబాబు, డమరుకం, 100% లవ్, సుడిగాడు, ఇష్క్, షాడో, శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్‌షా, అరుపు, దశమి, దళం, చదువుకోవాలి, కూల్‌బాయ్స్ హాట్‌గాళ్స్, జీనియస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తదితర అనేక సినిమాల్లో రమేశ్ నవ్వులు కురిపించాడు. పవన్‌కళ్యాణ్, రాంచరణ్, శ్రీకాంత్, నానీ, రామ్ తదితర నటులు, కృష్ణవంశీ, రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకుల సినిమాల్లో రమేశ్ నటించాడు. హాస్యం, మిమిక్రీతోపాటు పాటలుకూడా పాడుతున్నాడు. ఇష్క్ సినిమాలో కోడివాయ లచ్చమ్మదీ...,అతడు ఆమె ఓ స్కూటర్ సినిమాలో.. బస్టాప్ శరణం గచ్ఛామి... అనే పాటలు పాడాడు.
Advertisement
Advertisement