సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సైదాబాద్: టీఆర్‌ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల యూనిఫారాలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఊడదీయిస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖుబా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ, 317 జీవోకు సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు కరీంనగర్ జైల్లో ఉన్న సంజయ్‌ని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ టీఆర్‌ఎస్ పార్టీ ఇంటినౌకరుగా ప్రవర్తిస్తున్నారని, ఐపీఎస్ శిక్షణ సమయంలో ప్రజారక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేసి, ప్రజాభక్షకుడిగా మారారని విమర్శించారు. జరిగిన ఉదంతానికి త్వరలోనే ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ లాంటివారినే ప్రజలు ఓడించారని, కుటుంబపాలన చేస్తున్న కేసీఆర్‌కు అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని విమర్శించారు. 317 జీవోతో రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందుల పాలు జేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం సంజయ్ దీక్ష చేపట్టిన కార్యాలయాన్ని సందర్శించారు.
మాజీ ఎమ్మెల్యే శోభ అరెస్టు
సంజయ్ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అదే కేసులో నిందితులుగా ఉన్న కార్పొరేటర్ రాపర్తి ప్రసాద్, బీజేపీ నేత ఉప్పరపల్లి శ్రీనివాస్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. వైద్యపరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ విధించడంతో ముగ్గురినీ జిల్లా జైలుకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment