
ప్రియుడి ఇంటి ముందు ధర్నా
నేరేడ్‌మెట్ : ప్రేమించాడు...పెళ్లి చేసుకుంటానన్నాడు....తీరా మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం....కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన పల్లె స్రవంతి (20), వాజ్‌పేయినగర్‌కు చెందిన కారు డ్రైవర్ దురిశెట్టి లక్ష్మణ్‌లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన లక్ష్మణ్, స్రవంతితో మూడు సంవత్సరాలుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఫోన్ చేయడం మానేశాడు. దీంతో స్రవంతి వారం రోజుల క్రితం వేరే ఫోన్‌తో లక్ష్మణ్‌కు ఫోన్ చేసింది.
అప్పుడు లక్ష్మణ్ తండ్రి మల్లయ్య ఫోన్ తీయడంతో.. నాకు కారు డ్రైవర్ కావాలి.. లక్ష్మణ్‌కు ఎంత ఫోన్ చేసినా తీయడంలేదని చె ప్పింది. దానికి లక్ష్మణ్ తండ్రి లక్ష్మణ్ ఇప్పుడు రావడం కుదరదు. ఈనెల 14న అతని వివాహం జరగనుందని తెలిపాడు. ఇది విన్న స్రవంతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏంచేయాలో తోచక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. లక్ష్మణ్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో ఉంటాడని తెలుసుకున్న బాధితురాలు కరీంనగర్ నుంచి బయలుదేరి అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు నేరేడ్‌మెట్‌లోని వాజ్‌పేయినగర్‌లో లక్ష్మణ్ నివాసం ఉంటున్నాడని చెప్పడంతో.. స్రవంతి సోమవారం తెల్లవారు జామున వాజ్‌పేయినగర్‌లోని లక్ష్మణ్ ఇంటికి చేరుకుని ఇంటి ముందు నిరసనకు దిగింది. ఇది గమనించిన అతని కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఉడాయించారు. సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు స్రవంతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇదిలా ఉండగా..... లక్ష్మణ్ వివాహం 14వ తేదిన వాజ్‌పేయినగర్‌లో నివాసముండే మరో అమ్మాయితో నిశ్చయమయింది. బాధితురాలు ఆదివారం అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో.. ఎలాగూ స్రవంతి వాజ్‌పేయినగర్‌కు కూడా వస్తుందని.. ఇప్పటికే అందరికి పెళ్లి శుభ పత్రికలు పంచడంతో వివాహం ఆగిపోయి నలుగురిలో పరువు పోతుందని భావించి.. ఆదివారమే పెద్దల సమక్షంలో మరో అమ్మాయితో గుళ్లో వివాహం చేసుకున్నట్లు సమాచారం.