
పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి..
► ప్రేమపేరుతో కానిస్టేబుల్ మోసం
►పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు..
ఊట్కూర్: ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి మైనర్‌ను మోసం చేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊట్కూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న భానుప్రకాశ్ మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక (17)ను ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి వెంట తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి తెలియడంతో పెళ్లి చేసుకోవాలని బాలిక భానుప్రకాశ్‌ను కోరింది.
తన ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని, కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటానని ఈ నెల 3వ తేదీన మాయమాటలు చెప్పి ఇంటికి పంపించాడు. మోసపోయినట్టు గమనించిన బాధితురాలు కానిస్టేబుల్‌ను నిలదీయడంతో ముఖం చాటేశాడు. సోమవారం నాడు బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై అత్యాచారం, చీటింగ్ కేసులు నమోదు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు.