
పెళ్లి పేరుతో మోసం
► ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయింపు
ముద్దనూరు: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ప్రేమించి ఇప్పుడు మోసం చేశాడని జయకుమారి అనే యువతి మంగపట్నంలోని ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం బైఠాయించింది. ముద్దనూరులోని ఎల్‌ఎమ్ కాంపౌండ్‌లో నివసిస్తున్న తాను మంగపట్నం గ్రామానికి చెందిన దివాకర్ అనే యువకుడు రెండేళ్ల నుంచి ప్రేమించుకున్నామని ఆమె తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు నిరాకరిస్తున్నారని పేర్కొంది.
మరొకరిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవడంతో తాను న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పింది. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. దివాకర్‌పై కేసు నమోదు చేశారని పేర్కొంది. అతన్ని న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్ విధించారని తెలిపింది. అయినా అతను మారకపోవడంతో ఏఎస్పీ అన్బురాజన్ కు సోమవారం ఫిర్యాదు చేశానని చెప్పింది. దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని వివరించింది.