ముస్తాబాద్, న్యూస్‌లైన్: వడదెబ్బ తగిలి తండ్రి అస్వస్థతకు గురై చనిపోయాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేని తనయుడి గుండె ఆగిన సంఘటన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం నాంపెల్లి(59) స్థానిక ఐకేపీ కేంద్రంలో హమాలీగా పని చేస్తున్నాడు. ఆదివారం ఐకేపీ కొనుగోలు కేంద్రం మూసివేస్తుండడంతో శనివారం పొద్దంతా ఎండలో ధాన్యం బస్తాలను మోశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నాంపెల్లి అస్వస్థతకు గురై కుప్పకూలాడు. ఏం జరిగిందో కుటుంబసభ్యులు తెలుసుకునేలోపే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కన్నుమూశాడు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అంత్యక్రియలకు తీసుకెళుతుండగా, తండ్రి మృతదేహం వెనుకే వచ్చిన ఆయన పెద్ద కుమారుడు రాజు(28) తండ్రిని తల్చుకొని కుప్పకూలాడు. అక్కడే ప్రాణాలు విడిచాడు. అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించిన బంధువులు నాంపెల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. సాయంత్రం రాజు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, నాంపెల్లి అన్న భార్య చంద్రవ్వ ఈ రెండు మరణాలు చూసి షాక్‌తో పక్షవాతానికి గురైంది. పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.