Fathers death
-
కవలలకు కన్నీటి ‘పరీక్ష’
పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్ రూరల్: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ జన్మించారు. వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది. చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్‌లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విషాదాన్ని దిగమింగి.. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బైక్ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ధనుష్ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్‌లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
Siraj: అబ్బాయిలు ఏడ్వకూడదని నాన్న చెప్పేవాడు.. కానీ ఆపుకోలేక..!
Mohammed Siraj Emotional Tweet: టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్.. చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ ట్వీట్లో సిరాజ్ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. అబ్బాయిలు ఎప్పుడూ ఏడ్వకూడదని నాన్న చెప్పేవారని, దీంతో బహిరంగంగా ఉన్నప్పుడు బాధను దిగమింగుకోగలిగినా.. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను.. మిస్ యు డాడ్, లవ్ యు డాడ్ అని తండ్రిని తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా, సిరాజ్ ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ పర్యటనలో ఉండగా అతని తండ్రి మరణించిన విషయం తెలసిందే. Dad you used to tell me that boys never cry … I don’t cry 😢 in front of people but when I am alone I can’t stop myself 😭😭😭😭😭 #missyoudad #loveyou https://t.co/DO7JUq91Q7 — Mohammed Siraj (@mdsirajofficial) November 11, 2021 ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానాన్ని సిరాజ్ భర్తీ చేసే అవకాశం ఉంది. చదవండి: హేడెన్‌కు ఖురాన్‌ను బహుకరించిన రిజ్వాన్.. పాక్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
ఖమ్మం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీలం నర్సింహారెడ్డి(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడటంతో.. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కుమారుడు నాగిరెడ్డి బుధవారం బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సోదరింటికి వెళుతూ మృత్యు ఒడిలోకి..
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి గ్రామంలో ఎల్లమ్మగుడి మూల మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడటంతో రొడ్ల వీరారెడ్డి(45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన వీరారెడ్డి తండ్రి రాజిరెడ్డి 15 రోజుల క్రితం మృతిచెందారు. దీంతో వీరారెడ్డిని తన ఇంట్లో ఒకరోజు నిద్రచేయాలని ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్‌పల్లిలో ఉంటున్న సోదరి కోరింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి ట్రాక్టర్‌ను తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఐతరాజ్పల్లి ఎల్లమ్మ గుడి మూల మలుపు వద్ద బోల్తాపడింది. ట్రాక్టర్ నడుపుతూ వెళుతున్న వీరారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళుతున్న స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరారెడ్డి శనివారం మృతిచెందాడు. (సుల్తానాబాద్) -
తండ్రి మృతి.. తట్టుకోలేక ఆగిన తనయుడి గుండె
ముస్తాబాద్, న్యూస్‌లైన్: వడదెబ్బ తగిలి తండ్రి అస్వస్థతకు గురై చనిపోయాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేని తనయుడి గుండె ఆగిన సంఘటన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం నాంపెల్లి(59) స్థానిక ఐకేపీ కేంద్రంలో హమాలీగా పని చేస్తున్నాడు. ఆదివారం ఐకేపీ కొనుగోలు కేంద్రం మూసివేస్తుండడంతో శనివారం పొద్దంతా ఎండలో ధాన్యం బస్తాలను మోశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నాంపెల్లి అస్వస్థతకు గురై కుప్పకూలాడు. ఏం జరిగిందో కుటుంబసభ్యులు తెలుసుకునేలోపే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అంత్యక్రియలకు తీసుకెళుతుండగా, తండ్రి మృతదేహం వెనుకే వచ్చిన ఆయన పెద్ద కుమారుడు రాజు(28) తండ్రిని తల్చుకొని కుప్పకూలాడు. అక్కడే ప్రాణాలు విడిచాడు. అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించిన బంధువులు నాంపెల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. సాయంత్రం రాజు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, నాంపెల్లి అన్న భార్య చంద్రవ్వ ఈ రెండు మరణాలు చూసి షాక్‌తో పక్షవాతానికి గురైంది. పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
కూతురి పుట్టిన రోజు నాడు.. తండ్రి మృతి
నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్ : తన గారాల పట్టి తొలి పుట్టిన రోజును ఎంతో వేడుకగా జరపాలని కలలు కన్నాడు ఆ తండ్రి. కార్యక్రమానికి కావాల్సిన కేక్, మిఠాయిలు వంటికి ఆర్డర్ చేశాడు. బంధువుల ఇళ్లకు వెళ్లి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఇంకొన్ని గంటల్లో చూడబోయే ఆనంద క్షణాల్ని తలచుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఊహించని ఘటన జరిగిపోయింది. ఆర్టీసీ బస్సు రూపంలో అతడిని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కొద్దిసేపట్లో సంబరాలు చేసుకోబోతున్న ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన నూతక్కి బాజీరావు(23)కు ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన నాగమ్మతో రెండేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయిన ఏడాదికి ఆ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. స్రవంతి అని పేరుపెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శుక్రవారం స్రవంతి తొలి పుట్టిన రోజు. ఎంతో ఘనంగా వేడుక జరపాలని ఆ దంపతులు కలలు కన్నారు. కుమార్తె స్రవంతి పుట్టిన రోజుకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు బాజీరావు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వచ్చాడు. బేకరీలో స్వీట్స్, కేక్ ఆర్డర్ ఇచ్చాడు. నరసరావుపేట నుంచి సంతమాగులూరులోని అత్తగారింటికి వెళ్లి కూతురి పుట్టిన రోజు వేడుకలకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించాడు. తిరిగి నరసరావుపేటకు బయలుదేరాడు. మార్గంమధ్యలో పెట్లూరివారిపాలెం ఓగేరువాగు బ్రిడ్జి వద్దకు రాగానే విజయవాడ నుంచి వినుకొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బాజీరావుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రున్ని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరితో స్నేహంగా ఉండే బాజీరావు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఏరియా వైద్యశాలకు తరలివచ్చి దు:ఖసాగరంలో మునిగిపోయారు.