కూతురి పుట్టిన రోజు నాడు.. తండ్రి మృతి
Published Sat, Aug 10 2013 4:08 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్ : తన గారాల పట్టి తొలి పుట్టిన రోజును ఎంతో వేడుకగా జరపాలని కలలు కన్నాడు ఆ తండ్రి. కార్యక్రమానికి కావాల్సిన కేక్, మిఠాయిలు వంటికి ఆర్డర్ చేశాడు. బంధువుల ఇళ్లకు వెళ్లి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఇంకొన్ని గంటల్లో చూడబోయే ఆనంద క్షణాల్ని తలచుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఊహించని ఘటన జరిగిపోయింది. ఆర్టీసీ బస్సు రూపంలో అతడిని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కొద్దిసేపట్లో సంబరాలు చేసుకోబోతున్న ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన నూతక్కి బాజీరావు(23)కు ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన నాగమ్మతో రెండేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయిన ఏడాదికి ఆ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. స్రవంతి అని పేరుపెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శుక్రవారం స్రవంతి తొలి పుట్టిన రోజు. ఎంతో ఘనంగా వేడుక జరపాలని ఆ దంపతులు కలలు కన్నారు. కుమార్తె స్రవంతి పుట్టిన రోజుకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు బాజీరావు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వచ్చాడు. బేకరీలో స్వీట్స్, కేక్ ఆర్డర్ ఇచ్చాడు. నరసరావుపేట నుంచి సంతమాగులూరులోని అత్తగారింటికి వెళ్లి కూతురి పుట్టిన రోజు వేడుకలకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించాడు. తిరిగి నరసరావుపేటకు బయలుదేరాడు.
మార్గంమధ్యలో పెట్లూరివారిపాలెం ఓగేరువాగు బ్రిడ్జి వద్దకు రాగానే విజయవాడ నుంచి వినుకొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బాజీరావుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రున్ని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరితో స్నేహంగా ఉండే బాజీరావు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఏరియా వైద్యశాలకు తరలివచ్చి దు:ఖసాగరంలో మునిగిపోయారు.
Advertisement
Advertisement