సోదరింటికి వెళుతూ మృత్యు ఒడిలోకి..
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్‌పల్లి గ్రామంలో ఎల్లమ్మగుడి మూల మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడటంతో రొడ్ల వీరారెడ్డి(45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన వీరారెడ్డి తండ్రి రాజిరెడ్డి 15 రోజుల క్రితం మృతిచెందారు. దీంతో వీరారెడ్డిని తన ఇంట్లో ఒకరోజు నిద్రచేయాలని ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్‌పల్లిలో ఉంటున్న సోదరి కోరింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి ట్రాక్టర్‌ను తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఐతరాజ్‌పల్లి ఎల్లమ్మ గుడి మూల మలుపు వద్ద బోల్తాపడింది. ట్రాక్టర్ నడుపుతూ వెళుతున్న వీరారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళుతున్న స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరారెడ్డి శనివారం మృతిచెందాడు.
(సుల్తానాబాద్)