
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ సమయంలో తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణం ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలని విమర్శించారు. ఎన్నికల వేళ వివిధ పార్టీల మ్యానిఫెస్టోలు ప్రజలకు తాయిలాలు ఇచ్చేలా ఉన్నాయని, అమలుకు సాధ్యమయ్యే విధంగా ఏ ఒక్కటిలేవని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇతరులపై కామెంట్స్ చేసి సెంటిమెంట్ ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మళ్లీ ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిపించకపోతే ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటాననే వారు ప్రజలకు ఏం సేవ చేస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు పెట్టె ప్రలోభాలకు ప్రజలు మోసపోవద్దని, నిజాయితీతో పనిచేసే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అభ్యర్థులను గెలిపించాలని వీరభద్రం కోరారు.