సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు, సామాజిక తెలంగాణ ప్రధాన ఎజెండాగా సీపీఎం–బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశాయి. మరో రెండురోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ కొత్త రాజకీయ ప్రయోగం ఏ మేరకు ఆశించిన ఫలితాలనిస్తుందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఎన్నికలకు ముందే తమ ఎజెండాపై చర్చ జరిగేలా చేయడంతో పాటు వివిధ సామాజికవర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను తీసుకురాగలగడం తమ విజయంగా బీఎల్‌ఎఫ్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు సందర్భంగా అభ్యర్థుల సామాజిక నేపథ్యం, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారనే చర్చకు తీసుకువచ్చామని అంటున్నారు. కొంతకాలంగా బీఎల్‌ఎఫ్‌ను ప్రచారంలోకి తెచ్చినా విస్తృతప్రాతిపదికన ఇతర వామపక్షాలు, సంఘాలు, సంస్థలతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయలేకపోవడం ఒక వైఫల్యంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయపార్టీలు ఇస్తున్న హామీలు, ఆర్థికంగా లబ్ధి చేకూర్చే సంక్షేమ ఫలాలు, పథకాలపై చేస్తున్న వాగ్దానాలకు భిన్నంగా ప్రత్యామ్నాయ విధానాలు ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది చర్చనీయాంశమవుతోంది.
107 సీట్లలో బీఎల్‌ఎఫ్ పోటీ...
సీపీఎం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు,స్వచ్ఛందసంస్థలతో ఏర్పడిన బీఎల్‌ఎఫ్ మొదటిసారిగా మొత్తం 107 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ప్రధానపార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో తాము ప్రధాన పాత్రపోషిస్తామని బీఎల్‌ఎఫ్ చెబుతోంది. ఈ ఎన్నికల్లో సీపీఎంగా 26 స్థానాల్లో, బీఎల్‌ఎఫ్ పక్షాన 81 సీట్లలో పోటీలో ఉన్నారు. తెలంగాణలో 90% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలదే కావడంతో, ప్రస్తుత ఎన్నికల్లో 52 శాతమున్న బీసీలకు 50.4% సీట్లు, 18 శాతమున్న ఎస్సీలకు 23.5% (జనరల్ సీట్లలోనూ ఇచ్చారు), 10 శాతమున్న ఎస్టీలకు 12.6 %(జనరల్ సీట్లలోనూ ఇచ్చారు), 12 శాతమున్న మైనారిటీలకు 8.5%, 7 శాతమున్న ఓసీలకు 5.5% సీట్లు కేటాయించారు. రాష్ట్రచరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్‌కు కూడా టికెట్‌ను కేటాయించి అందరి దృష్టిని ఆకర్షించారు.
గెలిచే అవకాశాలు అంతంతే
గతంలో గెలిచిన భద్రాచలం(ఎస్టీ), మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం, పార్టీ పరంగా బలమున్న వైరా, పాలేరు, తదితర నియోజకవర్గాల్లో విజయావకాశాలున్నట్టుగా సీపీఎం అంచనా వేస్తుంది. అయితే భద్రాచలం పరిధిలో పార్టీకి పట్టున్న మూడుమండలాలు ఏపీలో కలిపేయడం, మిర్యాలగూడలో ప్రధానపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం, ఇబ్రహీంపట్నంలో బీఎస్‌పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి విజయావకాశాలు ఉండటంతో వీటిలో ఒక్క సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. మధిర, నారాయణ్‌పేట్, ఆలేరు, చెన్నూరు, కొత్తగూడెం,మహబూబాబాద్ స్థానాలపై బీఎల్‌ఎఫ్ ఆశాభావంతో ఉన్నాయి. నారాయణ్‌పేట్‌లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో చివరకు ఎలాంటి ఫలితం వెలువడుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment