Bahujan Left Front
-
కాంగ్రెస్ కూటమికి కామ్రేడ్స్ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రజా కూటమికి సీపీఐ గుడ్‌బై చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత స్నేహధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కామ్రేడ్లు మండిపడుతున్నారు. మిత్రపక్షాల పట్ల కాంగ్రెస్ పూర్తి నిర్లక్ష్య, నిరాసక్త ధోరణిని కనబరుస్తోందని కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో స్నేహబంధాలు కొనసాగించొద్దని నిర్ణయించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా కలిసొచ్చే వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని వెళ్లాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల బలం పెంచుకునేందుకు ఉపయోగపడే వ్యూహాన్ని అనుసరించాలనే ఆలోచనతో ఉంది. ఇందుకోసం సహచర కమ్యూనిస్టుపార్టీ సీపీఎంతో స్నేహసంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. నాయకత్వంపై కామ్రేడ్ల అసంతృప్తి రాష్ట్ర శాసనసభ ఎన్నికలపుడు కాంగ్రెస్ కూటమిలో సీపీఐ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పేరిట సీపీఎం విడిగా పోటీ చేయడం వల్ల ఈ రెండుపార్టీల మధ్య మిత్రత్వం దెబ్బతింది. ఆ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు దారుణమైన పరాజయం ఎదురవడం.. తొలిసారి కమ్యూనిస్టుల్లేని అసెంబ్లీ ఏర్పడటంతో కామ్రేడ్లలో అంతర్మథనం మొదలైంది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్‌తో జతకట్టడంపై సీపీఐలో, బీఎల్ఎఫ్ ప్రయోగాన్ని ఆచరణలో సరిగా అమలు చేయలేకపోయినందుకు సీపీఎంలో ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాలపై అంతర్గతంగా విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం మూడు సీట్ల కోసం కాంగ్రెస్‌తో పొత్తుకోసం సాగిలపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గభేటీలో పలువురు నేతలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో పార్టీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసేందుకు చాడ వెంకటరెడ్డి సిద్ధపడి.. చివరినిమిషంలో వెనక్కు తగ్గారు. పార్టీ మౌలిక విధానాలు, సిద్ధాంతాలకు భిన్నంగా బీఎల్ఎఫ్ తరఫున కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం, సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించడం పట్ల రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీరును సీపీఎం కేంద్రకమిటీ తప్పుబట్టింది. బీఎల్ఎఫ్ ప్రయోగం కారణంగా రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి మద్దతుగా ఉన్న పైతరగతుల వారు దూరమయ్యారు. దీంతోపాటు ఎవరికోసమైతే బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను తీసుకొచ్చారో ఆ కింది తరగతుల వారు సంప్రదాయ రాజకీయపార్టీలకే మద్దతివ్వడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రత్యామ్నాయం కోసం.. శాసనసభ ఎన్నికల్లో రాజకీయంగా ఊహిం చని ఎదురుదెబ్బ తగలడంతో భవిష్యత్‌లో పార్టీ నిర్మాణంపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దృష్టిపెట్టాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. కామ్రేడ్ల మధ్య చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చి నట్లు తెలుస్తోంది. రెండుపార్టీలే అన్నిసీట్లకు పోటీచేసే పరిస్థితి లేదు కాబట్టి.. టీజేఎస్, జనసేన, ఎంసీపీఐ తదితర పార్టీలను కలుపుకుని పోవాల నే ఆలోచనతో ఉన్నాయి. ప్రధాన రాజకీయపార్టీల కు ప్రత్యామ్నాయంగా వామపక్ష, లౌకిక, ప్రజా తంత్ర కూటమి ఆలోచనను ప్రజల ముందుంచాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయి. ఈ వారంలో జరగనున్న సీపీఐ, సీపీఎం మలివిడత చర్చల్లో సీట్ల సర్దుబాటు, ఇతరపార్టీలతో చర్చలకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నాయి. -
సీపీఐ, జనసేనతో కలసి వెళ్దాం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, జనసేనతో కలిసి పోటీ చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) నిర్ణయించింది. తమతోపాటు కలిసేందుకు ముందుకు వస్తే ఆ రెండు పార్టీలతోపాటు తెలంగాణ జనసమితి, ఇతర వామపక్షాలు, సామాజిక న్యాయం కోసం పాటుపడే పార్టీలు, సంస్థలను కూడా కలుçపుకుని వెళ్లాలని భావిస్తోంది. సామాజిక న్యాయ సాధనే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తోంది. గురువారమిక్కడ బీఎల్ఎఫ్ భాగస్వామ్యపక్షాల సమావేశం జరిగింది. సీపీఎం, ఎంసీపీఐ, బీఎల్పీ, మహాజన సమాజ్‌పార్టీ, టీబీఎస్పీ, టీ లోక్‌సత్తా పార్టీల నాయకులు దీనికి హాజరయ్యారు. రాష్ట్రంలో వామపక్ష, సామాజిక శక్తుల బలాన్ని పెంచుకోవాలని.. ఓటు శాతం, కేడర్ పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సీపీఐతో ప్రాథమిక చర్చలు జరిపిన నేపథ్యంలో మరోసారి చర్చించి స్పష్టత పొందాలని భావిస్తున్నారు. సీపీఐ, జనసేనలతో చర్చల తర్వాత ఏ పార్టీ ఏ సీటు నుంచి పోటీ చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. బీఎల్ఎఫ్ ప్రయోగానికి సీపీఐ విముఖం... బీఎల్ఎఫ్ ప్రయోగాన్ని ఇక ముందు కూడా కొనసాగించనున్నట్టు సీపీఎం నేతలు ప్రకటించడం పట్ల సీపీఐ అసంతృప్తి చెందుతున్నట్టు సమాచారం. తమతో చర్చించినప్పుడు బీఎల్ఎఫ్ కాకుండా వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల బలోపేతానికి కృషిచేద్దామని చెప్పి.. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి సీపీఐ నాయకత్వం వర్తమానం పంపించినట్టు తెలిసింది. రాష్ట్రంలో వామపక్ష శక్తుల బలోపేతానికి సీపీఎంతో కలిసి పనిచేయాలని భావిస్తున్న సీపీఐ.. బీఎల్ఎఫ్ ఎజెండాకు అంగీకరించబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలు లేనందున టీజేఎస్, టీడీపీతో కలిసి వెళ్లాలని.. సీపీఎం కూడా కలిసొస్తే ఆలోచించవచ్చుననే అంచనాలో సీపీఐ ఉన్నట్టు సమాచారం. -
కొత్త ప్రయోగం ఫలించేనా ?
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు, సామాజిక తెలంగాణ ప్రధాన ఎజెండాగా సీపీఎం–బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశాయి. మరో రెండురోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ కొత్త రాజకీయ ప్రయోగం ఏ మేరకు ఆశించిన ఫలితాలనిస్తుందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఎన్నికలకు ముందే తమ ఎజెండాపై చర్చ జరిగేలా చేయడంతో పాటు వివిధ సామాజికవర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను తీసుకురాగలగడం తమ విజయంగా బీఎల్ఎఫ్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు సందర్భంగా అభ్యర్థుల సామాజిక నేపథ్యం, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారనే చర్చకు తీసుకువచ్చామని అంటున్నారు. కొంతకాలంగా బీఎల్ఎఫ్ను ప్రచారంలోకి తెచ్చినా విస్తృతప్రాతిపదికన ఇతర వామపక్షాలు, సంఘాలు, సంస్థలతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయలేకపోవడం ఒక వైఫల్యంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయపార్టీలు ఇస్తున్న హామీలు, ఆర్థికంగా లబ్ధి చేకూర్చే సంక్షేమ ఫలాలు, పథకాలపై చేస్తున్న వాగ్దానాలకు భిన్నంగా ప్రత్యామ్నాయ విధానాలు ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది చర్చనీయాంశమవుతోంది. 107 సీట్లలో బీఎల్ఎఫ్ పోటీ... సీపీఎం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు,స్వచ్ఛందసంస్థలతో ఏర్పడిన బీఎల్ఎఫ్ మొదటిసారిగా మొత్తం 107 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ప్రధానపార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో తాము ప్రధాన పాత్రపోషిస్తామని బీఎల్ఎఫ్ చెబుతోంది. ఈ ఎన్నికల్లో సీపీఎంగా 26 స్థానాల్లో, బీఎల్ఎఫ్ పక్షాన 81 సీట్లలో పోటీలో ఉన్నారు. తెలంగాణలో 90% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలదే కావడంతో, ప్రస్తుత ఎన్నికల్లో 52 శాతమున్న బీసీలకు 50.4% సీట్లు, 18 శాతమున్న ఎస్సీలకు 23.5% (జనరల్ సీట్లలోనూ ఇచ్చారు), 10 శాతమున్న ఎస్టీలకు 12.6 %(జనరల్ సీట్లలోనూ ఇచ్చారు), 12 శాతమున్న మైనారిటీలకు 8.5%, 7 శాతమున్న ఓసీలకు 5.5% సీట్లు కేటాయించారు. రాష్ట్రచరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్‌కు కూడా టికెట్‌ను కేటాయించి అందరి దృష్టిని ఆకర్షించారు. గెలిచే అవకాశాలు అంతంతే గతంలో గెలిచిన భద్రాచలం(ఎస్టీ), మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం, పార్టీ పరంగా బలమున్న వైరా, పాలేరు, తదితర నియోజకవర్గాల్లో విజయావకాశాలున్నట్టుగా సీపీఎం అంచనా వేస్తుంది. అయితే భద్రాచలం పరిధిలో పార్టీకి పట్టున్న మూడుమండలాలు ఏపీలో కలిపేయడం, మిర్యాలగూడలో ప్రధానపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం, ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి విజయావకాశాలు ఉండటంతో వీటిలో ఒక్క సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. మధిర, నారాయణ్‌పేట్, ఆలేరు, చెన్నూరు, కొత్తగూడెం,మహబూబాబాద్ స్థానాలపై బీఎల్ఎఫ్ ఆశాభావంతో ఉన్నాయి. నారాయణ్‌పేట్‌లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో చివరకు ఎలాంటి ఫలితం వెలువడుతుందన్న ఉత్కంఠ నెలకొంది. -
‘సోనియా తెలంగాణ తల్లి ఎలా అవుతుంది’
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ సమయంలో తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణం ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలని విమర్శించారు. ఎన్నికల వేళ వివిధ పార్టీల మ్యానిఫెస్టోలు ప్రజలకు తాయిలాలు ఇచ్చేలా ఉన్నాయని, అమలుకు సాధ్యమయ్యే విధంగా ఏ ఒక్కటిలేవని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతరులపై కామెంట్స్ చేసి సెంటిమెంట్ ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మళ్లీ ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిపించకపోతే ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటాననే వారు ప్రజలకు ఏం సేవ చేస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు పెట్టె ప్రలోభాలకు ప్రజలు మోసపోవద్దని, నిజాయితీతో పనిచేసే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థులను గెలిపించాలని వీరభద్రం కోరారు. -
ఠాణాలో ప్రత్యక్షమైన చంద్రముఖి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్జండర్ చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఆమె ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం చంద్రముఖి కనిపించకుండా పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రాన్స్‌జండర్లు ఓ వైపు ఆందోళనకు దిగగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. గురువారంలోగా చంద్రముఖిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించడంతో బంజారాహిల్స్ పోలీసులు హుటాహుటిన లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఇది జరిగిన 12 గంటల వ్యవధిలోనే చంద్రముఖి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఆమె నోరు విప్పితేగానీ అసలు ఏం జరిగిందన్న విషయం తెలియదు. -
కాంగ్రెస్ నుంచి ఔట్.. బీఎల్ఎఫ్ నుంచి పోటీ
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెప్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థుల నాలుగో జాబితాను ఆ ఫ్రంట్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం గురువారం విడుదల చేశారు. నాలుగో జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ కు బిఎల్ ఎఫ్ పార్టీ ద్వారా సీటు కేటాయించారు. సీపీఎం నుంచి నకిరేకల్ అభ్యర్థిగా ఎన్సీ(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన నగేష్‌కి చోటు లభించింది. నాలుగో జాబితాలో ఎస్సీలకు మూడు, ఎస్టీలకు రెండు, ముస్లీం-5, బీసీ-5, ఎంబీసీలకు ఒకటి చొప్పున సీట్లను ప్రకటించారు. -
నా పైనే దాడి చేస్తారా?
సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ల ప్రచారంలో తలెత్తిన ఘర్షణ వివాదాస్పదమైంది. అసలు ఏం జరిగింది? బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి తన అనుచరులతో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ యాదగిరిగుట్ట మండలంలో చేపట్టిన బైక్ ర్యాలీ మల్లాపురంలో మోత్కుపల్లి ప్రచారానికి ఎదురుపడింది. ఈ సమయంలో ఇరువురు పరస్పరం అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టవేరా వాహనం మోత్కుపల్లి ప్రచార వాహనాన్ని తాకడంతో అక్కడ వివాదం తలెత్తింది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తన ప్రచారాన్ని అడ్డుకుని తనపై దాడి చేశారని మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించారు. నాపై దాడి చేస్తారా అంటూ మోత్కుపల్లి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకుడు కర్ర వెంకటయ్య తన అనుచరులతో వచ్చి మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు. రాస్తారోకో చేస్తున్న మోత్కుపల్లిని ఆందోళన విరమించాలని యాదగిరిగుట్ట ఏసీపీ మనోహర్‌రెడ్డి కోరారు. భిక్షమయ్యగౌడ్‌ను అరెస్టు చేస్తేనే ఆందోళన విరమిస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు మోత్కుపల్లిని అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తుర్కపల్లి పీఎస్‌లోనూ మోత్కు పల్లి దీక్ష కొనసాగించారు. భిక్షమయ్యగౌడ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోత్కుపల్లిపై జరిగిన దాడిని నిరసిస్తూ గోదావరి నదీ జలాల సాధన సమితి బుధవారం ఆలేరు బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ తెలిపారు. దాడి జరగలేదని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. భిక్షమయ్యను అరెస్ట్ చేయాలి: మోత్కుపల్లి ‘‘ఎన్నికల ప్రచారంలో ఉన్న నాపై దాడికి కారకుడైన భిక్షమయ్యగౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. నాపై కావాలనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ అండ చూసుకుని మల్లాపురంలో ప్రచారాన్ని అడ్డుకున్నారు. నా వాహనాన్ని ఢీ కొట్టారు. చేయి చేసుకున్నారు. నియోజకవర్గంలో నాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భిక్షమ య్యగౌడ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు’’. ఒప్పందం బయటపడింది: భిక్షమయ్యగౌడ్ ‘‘టీఆర్ఎస్ పార్టీతో మోత్కుపల్లి నర్సింహులు కుదుర్చుకున్న ఒప్పందం బయటపడింది. నా వాహనం మోత్కుపల్లి వాహనానికి తాకినా, నేను ఆయనను తిట్టినట్లు తేలినా రాజకీయాలను వదిలిపెడతా. నేను అనుమతి తీసుకుని బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాను. ప్రచారంలో భాగంగా ఇద్దరం మల్లాపురంలో ఎదురుపడ్డాం.. పరస్పరం అభివాదం చేసుకున్నాం. నాపై ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’’ భిక్షమయ్యగౌడ్‌పై అట్రాసిటీ కేసు తుర్కపల్లి: మోత్కుపల్లి ఫిర్యాదు మేరకు భిక్షమయ్య గౌడ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 279, 504, 506, 143 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులు తెలిపారు. దాడిని ఖండిస్తున్నాం: బీఎల్ఎఫ్ సాక్షి,హైదరాబాద్: బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు ప్రచార యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. -
27 మందితో బీఎల్ఎఫ్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థుల తొలి జాబితాను 27 మందితో విడుద ల చేసింది. బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ఈ జాబితాను గురువారం విడుదల చేశారు. బీఎల్ఎఫ్ ప్రకటించిన 27 మంది లో ఎస్సీ స్థానాలు 7, ఎస్టీ స్థానాలు 3, జనరల్ స్థానా లు 17 ఉన్నాయి. ఇందులో 9 మంది సీపీఎం అభ్యర్థులు, 14 మంది బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండి యా (ఎంసీపీఐ) అభ్యర్థులు ముగ్గురు, తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి శ్రీనివాస్ బహద్దూర్‌ను నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు.. సీపీఎం అభ్యర్థులు.. తొడసం భీమ్రావు (ఖానాపూర్), మర్రి వెంకటస్వామి (మానకొండూరు), ఎ.మల్లేశ్ (నర్సాపూర్), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), శేఖర్‌రావు (హూజూర్‌నగర్), బుర్రి శ్రీరాములు (కోదాడ), డాక్టర్ మిడియం బాబూరావు (భద్రాచలం), భూక్యా వీరభద్రం (వైరా), మాచర్ల భారతి (సత్తుపల్లి) బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు.. కోట వెంకన్న (సిర్పూరు), కనకం వంశీ (చొప్పదండి), ఫసీమొద్దీన్ (కరీంనగర్), పి.జయలక్ష్మి (ఆంధోల్), గుజ్జ రమేశ్ (మేడ్చల్), రాఘవేంద్రస్వామి గౌడ్ (రాజేంద్రనగర్), జయరాములు (దేవరకద్ర), వెంకటేశ్వర్లు (కొడంగల్), జింకల కృష్ణయ్య (వనపర్తి), రంజిత్‌కుమార్ (గద్వాల), రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ (సూర్యాపేట), సిద్దం రాము (వరంగల్ తూర్పు), వసపాక నర్సింహ (వర్ధన్నపేట), కోట రాంబాబు (మధిర) ఎంసీపీఐ అభ్యర్థులు.. సబ్బని కృష్ణ (బెల్లంపల్లి), తాండ్ర కుమార్ (శేరిలింగంపల్లి), మద్దికాయల అశోక్ (నర్సంపేట) -
బీఎల్ఎఫ్ దేశ రాజకీయాల్లో పెద్ద మలుపు
సాక్షి, హైదరాబాద్: బహుజన వామపక్ష వేదిక(బీఎల్ఎఫ్) ఆవిర్భావం దేశ రాజకీయాల్లో పెద్ద ముందడుగని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో సంక్షోభం తీవ్రంగా ఉన్న ఈ దశలో ప్రత్యామ్నాయ రాజకీయాల అవసరం ఉందని, వ్యక్తుల ఆధారంగా కాకుండా, విధానాల ఆధారంగానే ప్రత్యామ్నాయ రాజకీయాలు నడవాలని అభిప్రాయపడ్డారు. ఇపుడు దేశంలో రాజకీయ వాతావరణం మారుతోందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం 28 రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలతో బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు ఏచూరి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రజా ఉద్యమం రావాలి.. సభలో ఏచూరి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక దోపిడీలు యథేచ్ఛగా సాగుతున్నాయని, ప్రత్యామ్నాయ రాజకీయ విధానం తేవాలంటే ప్రజా ఉద్యమం జరగాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, గోరక్ష దళాలపై నిషేధం విధించమంటే మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దేశంలో మోరల్ పోలీసింగ్ పెరిగిపోయిందని పేర్కొన్నారు. మనుస్మృతి ఆధారంగా పాలించాలని చూస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, ఎన్నికల్లో హామీలు ఇచ్చి, ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి రావడం మినహా ఎలాంటి మార్పు లేదని అన్నారు. ప్రజా పోరాటాల ద్వారా బీఎల్ఎఫ్ను బలపరచాలని ఏచూరి పిలుపునిచ్చారు. 93 శాతంగా ఉన్న ప్రజలకే అధికారం దక్కాలి దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో 93 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఉన్నారని, వీరి చేతుల్లోకి అధికారాన్ని తేవడమే బీఎల్ఎఫ్ ప్రత్యేక ఎజెండా అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 28 పార్టీలతో ఏర్పాటైన బీఎల్ఎఫ్ ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అన్న స్పష్టమైన అవగాహనతో ఉందని, ఎర్రజెండా–నీలి జెండా అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో బీఎల్ఎఫ్ నిర్మాణం కొనసాగుతుందని, మే నెలలో నియోజకవర్గాల్లో జైత్రయాత్ర మొదలు పెడతామన్నారు. కాగా, 41 మందితో బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. నల్లా సూర్యప్రకాశ్ చైర్మన్‌గా, నలుగురు వైస్ చైర్మన్లుగా, తమ్మినేని వీరభద్రం సహా ఏడుగురిని కన్వీనర్లుగా ఎంపిక చేశారు. సభలో టి–మాస్ చైర్మన్ కంచ ఐలయ్య, ఎంసీపీఐ జాతీయ కార్యదర్శి గౌస్, మల్లు స్వరాజ్యం, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ కాదు: ప్రకాశ్ అంబేడ్కర్ దేశంలో బీజేపీ అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని, దేశానికి ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకారి అని ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ముస్లింలను అకారణంగా ద్వేషిస్తున్నారని, హిందువుల్లో స్లీపర్ సెల్స్ అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇంకెంత మాత్రం లౌకికవాద పార్టీ కాదని, అది ఆర్ఎస్ఎస్కు బి టీమ్‌గా మారిపోయిందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని, అంతా ఒక్కటై రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. సీపీఐనీ చేర్చండి సురవరంను కోరిన సీతారాం ఏచూరి ప్రత్యామ్నాయ రాజకీయ విధానం తో రాష్ట్రంలో ఏర్పడిన బీఎల్ఎఫ్లో సీపీఐని కూడా భాగస్వామి చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని సీతారాం ఏచూరి కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్‌తో కలసి హైదరాబాద్‌లో ఉంటున్న సురవరంను ఆయన నివాసంలో కలిశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఉభయులూ చర్చించారని సీపీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీపీఐ బీఎల్ఎఫ్లో చేరితే మరింత బలోపేతం అవుతుందని, దానికి తెలంగాణ సీపీఐ సమితి సానుకూలంగా నిర్ణయం తీసుకునేట్లు చొరవ తీసుకోవాలని సుధాకర్‌రెడ్డిని ఏచూరి కోరారు. -
ప్రత్యామ్నాయ వేదికగా బీఎల్ఎఫ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సీపీఎం ఆధ్వర్యంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఊపిరి పోసుకుంది. లాల్– నీల్ నినాదంతో 21 రాజకీయ పార్టీలు, సంఘాలతో కలసి బీఎల్ఎఫ్ ఏర్పాటు కాగా, ఆవిర్భావ సదస్సును గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. బీఎల్ఎఫ్ చైర్మన్‌గా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్‌గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ఇప్పటికే ఎంపిక చేశారు. మరోవైపు కుల, సామాజిక సమస్యలపై పోరా డటానికి సీపీఎం ఇదివరకే తెలంగాణ సామాజిక సంఘాల ఐక్యవేదిక (టీమాస్)ను ఏర్పాటు చేసింది. టీమాస్ కేవలం సామాజిక సమస్యలపై పోరాటాలకే పరిమితం కానుండగా, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షలున్న పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు బీఎల్‌ఎఫ్‌కు రూపకల్పన చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మినహా కలసి వచ్చే అన్ని పార్టీలతో ఈ వేదికను ఏర్పాటు చేయాలని భావించి 4 నెలలుగా కసరత్తు చేశారు. ప్రధాన వామపక్ష పార్టీలయిన సీపీఐ, న్యూడెమొక్రసీ తదితర పార్టీలు బీఎల్‌ఎఫ్‌కు దూరంగా ఉండగా, బీఎస్పీ, లోక్‌సత్తా వంటి పార్టీలు, ఇతర వామపక్ష పార్టీలు సహా మొత్తం 21 పార్టీలు ఫ్రంట్‌లో చేరాయి. మరో 15 పార్టీలు వేదికలో చేరనున్నాయని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న బీఎల్ఎఫ్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్పీఐ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిర్భావ సభలో పాల్గొంటారని సీపీఎం వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ
సాక్షి, ఖమ్మం : 31 పార్టీలతో కలసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మంగళవారం ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో మహాసభలో ఆయన మంగళవారం మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలు దెబ్బతిన్నాయని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు కొంత దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పెను మార్పులు వచ్చాయని, ఎర్రజెండా సత్తాను చూపించడానికి ఇది మంచి అవకాశమని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టలేదని అన్నారు. 165 స్థానాల నుంచి 99 స్థానాలకు బీజేపీ పరిమితమవడం ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలిచి, సీపీఎంను గెలిపించాలని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఫ్రంట్‌లో చేరాలని లెఫ్ట్ పార్టీలతో చర్చించగా.. సీపీఐ అందుకు అంగీకరించలేదని తెలిపారు. సీపీఐ కూడా ఫ్రంట్‌లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కూటమికి ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’గా నామకరణం చేస్తున్నామని, ఈ మేరకు జనవరి 28న ప్రకటన చేస్తామని వివరించారు. తెలంగాణలో సామాజిక న్యాయం, రాష్ట్రం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటం చేస్తామని వెల్లడించారు.