
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, జనసేనతో కలిసి పోటీ చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) నిర్ణయించింది. తమతోపాటు కలిసేందుకు ముందుకు వస్తే ఆ రెండు పార్టీలతోపాటు తెలంగాణ జనసమితి, ఇతర వామపక్షాలు, సామాజిక న్యాయం కోసం పాటుపడే పార్టీలు, సంస్థలను కూడా కలుçపుకుని వెళ్లాలని భావిస్తోంది. సామాజిక న్యాయ సాధనే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తోంది. గురువారమిక్కడ బీఎల్‌ఎఫ్ భాగస్వామ్యపక్షాల సమావేశం జరిగింది. సీపీఎం, ఎంసీపీఐ, బీఎల్‌పీ, మహాజన సమాజ్‌పార్టీ, టీబీఎస్‌పీ, టీ లోక్‌సత్తా పార్టీల నాయకులు దీనికి హాజరయ్యారు. రాష్ట్రంలో వామపక్ష, సామాజిక శక్తుల బలాన్ని పెంచుకోవాలని.. ఓటు శాతం, కేడర్ పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సీపీఐతో ప్రాథమిక చర్చలు జరిపిన నేపథ్యంలో మరోసారి చర్చించి స్పష్టత పొందాలని భావిస్తున్నారు. సీపీఐ, జనసేనలతో చర్చల తర్వాత ఏ పార్టీ ఏ సీటు నుంచి పోటీ చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.
బీఎల్‌ఎఫ్ ప్రయోగానికి సీపీఐ విముఖం...
బీఎల్‌ఎఫ్ ప్రయోగాన్ని ఇక ముందు కూడా కొనసాగించనున్నట్టు సీపీఎం నేతలు ప్రకటించడం పట్ల సీపీఐ అసంతృప్తి చెందుతున్నట్టు సమాచారం. తమతో చర్చించినప్పుడు బీఎల్‌ఎఫ్ కాకుండా వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల బలోపేతానికి కృషిచేద్దామని చెప్పి.. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి సీపీఐ నాయకత్వం వర్తమానం పంపించినట్టు తెలిసింది. రాష్ట్రంలో వామపక్ష శక్తుల బలోపేతానికి సీపీఎంతో కలిసి పనిచేయాలని భావిస్తున్న సీపీఐ.. బీఎల్‌ఎఫ్ ఎజెండాకు అంగీకరించబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలు లేనందున టీజేఎస్, టీడీపీతో కలిసి వెళ్లాలని.. సీపీఎం కూడా కలిసొస్తే ఆలోచించవచ్చుననే అంచనాలో సీపీఐ ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment