సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సీపీఎం ఆధ్వర్యంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఊపిరి పోసుకుంది. లాల్– నీల్ నినాదంతో 21 రాజకీయ పార్టీలు, సంఘాలతో కలసి బీఎల్‌ఎఫ్ ఏర్పాటు కాగా, ఆవిర్భావ సదస్సును గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. బీఎల్‌ఎఫ్ చైర్మన్‌గా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్‌గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ఇప్పటికే ఎంపిక చేశారు. మరోవైపు కుల, సామాజిక సమస్యలపై పోరా డటానికి సీపీఎం ఇదివరకే తెలంగాణ సామాజిక సంఘాల ఐక్యవేదిక (టీమాస్)ను ఏర్పాటు చేసింది.
టీమాస్ కేవలం సామాజిక సమస్యలపై పోరాటాలకే పరిమితం కానుండగా, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షలున్న పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు బీఎల్‌ఎఫ్‌కు రూపకల్పన చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మినహా కలసి వచ్చే అన్ని పార్టీలతో ఈ వేదికను ఏర్పాటు చేయాలని భావించి 4 నెలలుగా కసరత్తు చేశారు. ప్రధాన వామపక్ష పార్టీలయిన సీపీఐ, న్యూడెమొక్రసీ తదితర పార్టీలు బీఎల్‌ఎఫ్‌కు దూరంగా ఉండగా, బీఎస్పీ, లోక్‌సత్తా వంటి పార్టీలు, ఇతర వామపక్ష పార్టీలు సహా మొత్తం 21 పార్టీలు ఫ్రంట్‌లో చేరాయి. మరో 15 పార్టీలు వేదికలో చేరనున్నాయని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం
అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న బీఎల్‌ఎఫ్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్‌పీఐ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిర్భావ సభలో పాల్గొంటారని సీపీఎం వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment