సాక్షి, ముంబై: మహారాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర అవతరించి మే ఒకటవ తేదీ ఆదివారానికి 62 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు నేడు కార్మిక దినోత్సవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాదాసీదాగా జరిపారు. అయితే ఈసారి కరోనా నియంత్రణలోకి రావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
హుతాత్మ చౌక్
ముఖ్యంగా మంత్రాలయంతోపాటు అనేక చారిత్రాత్మక భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాల్లో ప్రజల కోసం వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హుతాత్మ చౌక్‌ను ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. సంయుక్త మహారాష్ట్ర కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి బలిదానంతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం అవతరించి 63వ ఏట అడుగిడుతున్న సమయంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న మహారాష్ట్ర రాష్ట్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం..
ఆందోళనలలో పాల్గొన్న తెలుగువారు..
సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం 1938లో ప్రారంభమైంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముఖ్యంగా 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాటం ఉధృతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1955 నవంబర్ 21వ తేదీన సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన ఆందోళనలలో ముంబైలోని ఫ్లోరా ఫౌంటన్ (నేటి హుతాత్మ చౌక్) పరిసరాల్లో నాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి ఆదేశాలమేరకు ఆందోళనకారులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికిపైగా ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సంఘటన జరిగిన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా 1956 జనవరిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో 90 మంది అమరులయ్యారు. వీరితోపాటు అనేకమంది బలిదానాలతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. ఈ నేపథ్యంలో సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాడి అమరులైన 105 మంది అమరవీరుల జజ్ఞాపకార్థంగా ఫ్లౌరా ఫౌంటన్ పరిసరాల్లో ‘అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ఫ్లోరా ఫౌంటన్ పేరు మార్చి హుతాత్మ చౌక్‌గా నామకరణం చేశారు.
అయితే సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరువీరులందరి కుటుంబీకుల వివరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నేటికి లేవని తెలుస్తోంది. మరోవైపు సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలను అర్పించిన 105 మంది అమరవీరులలో ముగ్గురు తెలుగు వ్యక్తులున్నారు. వీరి పేర్లు బాలయ్య, ముత్తన్నలుగా తెలిసింది. అయితే మరో తెలుగు వ్యక్తి కూడా అమరవీరులలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం వివరాలేవి తెలియరాలేదు.
పెరిగిన జిల్లాలు..
మహారాష్ట్ర అవతరణ అనంతరం ఇప్పటి వరకు ఒకటి రెండు కాకుండా ఏకంగా 10 జిల్లాలు పెరిగాయి. రాష్ట్రం అవతరించిన సమయంలో 26 జిల్లాలున్న మహారాష్ట్ర ప్రస్తుతం 36 జిల్లాలకు చేరుకుంది. 1981 మేలో జాల్నా, సింధుదుర్గా జిల్లా అవతరించగా 1982 ఆగస్టులో లాతూరు, గడ్చిరోలి జిల్లాలు, 1990 అక్టోబర్‌లో ముంబై సబర్బన్ (ముంబై ఉపనగరం), 1998 జూలైలో వాషీం, నందుర్బార్ జిల్లాలు ఏర్పాటుకాగా చివరగా రెండేళ్ల కిందట 2014 ఆగస్టు ఒకటవ తేదీన ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
తొలిస్పీకర్‌గా తెలుగు వ్యక్తి...
సంయుక్త మహారాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటవ తేదీ మధ్యాహ్నం నూతన మంత్రిమండలి ఏర్పాటైంది. అయితే రాష్ట్రానికి తొలిస్పీకర్ బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్‌కు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment