తల్లిదండ్రులను కొలిస్తేవిఠలుడు దిగి వచ్చాడు
సందర్భం- విఠోబా ఆలయం
మంచి ఏదైనా దేవుడికి త్వరగా చేరుతుంది. పుండలికుడిలోని పరివర్తనకు మెచ్చిన శ్రీ మహావిష్ణువుఅతడికి వరం ఇవ్వాలని అనుకుంటాడు. వెంటనే వైకుంఠాన్ని వీడి భూలోకం చేరుకుంటాడు.
మహారాష్ర్ట, షోలాపూర్ జిల్లాలోని పంధార్‌పూర్ పట్టణంలో 900 ఏళ్ల నాటి విఠోబా ఆలయం భారతీయ హైందవ సంప్రదాయ చరిత్రను తిరగరాయబోతోంది. తొలిసారి ఒక మహిళ ఈ ఆలయంలో అర్చకత్వ బాధ్యతలను చేపట్టబోతున్నారు. అలాగే, బ్రాహ్మణేతరులైన వారు సైతం ఈ ఆలయ పూజా కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం ఆలయ ట్రస్టు (విఠోబా రుక్మిణీ టెంపుట్ ట్రస్టు) గత వారం ఒక ఉద్యోగ ప్రకటన కూడా విడుదల చేసింది.
ఆలయంలో ఎనిమిది పూజారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, హైదవ మతాన్ని ఆచరిస్తూ, ఆలయ పూజలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన సారాంశం. ట్రస్టు చైర్మన్ అన్నా డాంగే పేరిట విడుదలైన ఆ ప్రకటన ప్రకారం మే 18న అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ట్రస్టు అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి గత జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ప్రేరణ.
ఆలయానికి వచ్చే ఆదాయంపై, పూజా కార్యక్రమాల నిర్వహణ అధికారంపై వారసత్వ హక్కుల కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న స్థానిక బద్వే, ఉత్పత్ కుటుంబాల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పూజారుల నియామకాల విషయంలో ట్రస్టు స్వంత నిర్ణయం తీసుకోడానికి వీలైంది. అత్యంత ప్రాచీనమైన విఠోబా దేవాలయాన్ని 1968లో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది. ఇంతకీ ఈ ఆలయ చరిత్ర ఏమిటి? స్థల పురాణం ఏమిటి?
తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన విఠోబా ఆలయం పంధార్‌పూర్‌లో నెలకొనడం వెనుక పుండలికుడు అనే ఒక యువ కుడి కథ ఉంది. జానుదేవ్, సత్యవతి దంపతులకు వరఫలంగా జన్మించినవాడు పుండలికుడు. వీరి కుటుంబం దండివరన్ అరణ్యానికి సమీపంలో నివాసం ఉండేది.
తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా, శ్రద్ధగా చూసుకునే పుండలికుడు వివాహం తర్వాత పూర్తిగా మారిపోతాడు! భార్య చుట్టూ తిరుగుతూ, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాడు. కొన్నిసార్లు అవమానించేవాడు కూడా.
కొడుకు ప్రవర్తనతో విసుగెత్తిన తల్లిదండ్రులు కాశీకి బయల్దేరుతారు. కాశీలో మరణిస్తే బాధల నుంచి, పునర్జన్మల నుంచి విముక్తి లభిస్తుందని వారి ఆశ. అయితే వారితో పాటు పుండలికుడు కూడా తన భార్యను వెంట పెట్టుకుని కాశీకి సిద్ధం అవుతాడు.
ప్రయాణంలో కూడా పుండలికుడు తన తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. చీటికి మాటికి పనులను పురమాయిస్తుంటాడు. తల్లిదండ్రులు కాలినడకన ప్రయాణం కొనసాగిస్తుంటే తను, తన భార్య గుర్రం మీద వెళుతుంటారు. మార్గం మధ్యలో ఈ నలుగురూ ఒక ఆశ్రమం చేరుకుంటారు.
ఆ ఆశ్రమం కుట్టుస్వామి అనే ఒక మహిమ గల సాధువుది. బాగా బడలికగా ఉండడంతో వాళ్లంతా ఆశ్రమంలోనే సేద తీరుతారు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక, పుండలికుడికి మెలకువ వచ్చి చూస్తే అతడికో దృశ్యం కనిపిస్తుంది! కొందరు అందమైన స్త్రీలు మురికి బట్టలతో ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. నీళ్లు మోసుకొచ్చి నేలంతా శుభ్రంగా కడుగుతారు. తర్వాత అవే బట్టలతో ప్రార్థన మందిరంలోకి వెళతారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆశ్చర్యంగా వాళ్ల బట్టలన్నీ ఎంతో కాంతిమంతంగా తళతళలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్లు ఎలాగైతే వచ్చారో, అలా మాయమైపోతారు.
ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన పుండలికుడు ఆశ్చర్యచకితుడైపోతాడు కానీ తనవాళ్లెవరినీ లేపడు. తనవాళ్లకేమీ చెప్పడు. ‘ఇదంతా కల కాదుకదా’ అని కూడా అనుకుంటాడు.
అయితే అతడిది కల కాదని రుజువు చేయడానికా అన్నట్లు, రెండో రోజు రాత్రి కూడా దేవతల్లాంటి ఆ స్త్రీమూర్తులు ప్రత్యక్షమౌతారు. పుండలికుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ల ఎదురుగా వెళ్లి ‘‘ఎవరు మీరు?’’ అని అడుగుతాడు. ‘‘మేము గంగా, యమునా నదులం, మిగతా వాళ్లు మిగతా నదులు’’ అని చెప్తారు ఆ స్త్రీమూర్తులు. పుండలికుడు అంతటితో ఊరుకోకుండా, ‘‘మీ బట్టలకు ఏమిటా మురికి?’’ అని ప్రశ్నిస్తాడు.
స్త్రీమూర్తులు చిరునవ్వు నవ్వి, ‘‘మానవులు తమ పాపాలను కడిగేసుకోవడం కోసం మాలో మునుగుతారు కదా. అలా మునిగినప్పుడు వాళ్లు వదిలిన పాపాలే ఈ మురికి మరకలు’’ అని చెప్తారు. అంతటితో ఊరుకోక, ‘‘ఓయీ... పుండలికా... ఈ పాపులలోకెల్లా నువ్వు మహాపాపివి. ఎందుకంటే, నీ తల్లిదండ్రులను నువ్వు బాధ్యతగా చూడడం లేదు కదా’’ అంటారు.
ఆ మాటలకు పుండలికుడు ఉలిక్కిపడతాడు. తల్లిదండ్రులను తానెంత నీచంగా చూసిందీ తలచుకుని తలచుకుని విలపిస్తాడు. వెళ్లి, తన తల్లిదండ్రుల కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటాడు.
మంచి ఏదైనా దేవుడికి త్వరగా చేరుతుంది. పుండలికుడిలోని పరివర్తనను మెచ్చిన విష్ణుమూర్తి అతడికి వరం ఇవ్వాలని అనుకుంటాడు. వెంటనే వైకుంఠాన్ని వీడి భూలోకం చేరుకుంటాడు.
విష్ణుమూర్తి వచ్చే సమయానికి పుండలికుడు తల్లిదండ్రుల సేవలో ఉంటాడు. వారికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు.
‘‘నాయనా తలుపు తియ్యి’’ అంటాడు విష్ణుమూర్తి.
‘‘పని మధ్యలో ఉన్నాను. వేచి ఉండండి’’ అంటాడు పుండలికుడు. విష్ణుమూర్తి మళ్లీ తలుపు తడతాడు.
పుండలికుడు దిగ్గున లేచి వెళ్లి, తలుపు తీసి, ద్వారం బయటికి ఒక ఇటుకను విసిరి, అంతవరకూ దీనిపై కూర్చోండి అని లోనికి వెళ్లిపోతాడు. విష్ణుమూర్తి ఆ ఇటుకపై కూర్చోడు. నిలుచుంటాడు. పుండలికుడు తన పనంతా పూర్తి చేసుకుని వచ్చే వరకు అలాగే నిలిచి ఉండాడు.
పుండలికుడు బయటికి వచ్చి విష్ణుమూర్తి కాళ్లపై పడి క్షమించమని కోరుతాడు. తల్లిదండ్రులపై అతడికున్న భక్తికి విష్ణుమూర్తి అంతటివాడే పరవశుడై, ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. పుండలికుడు చిత్రమైన వరం కోరతాడు. విష్ణుమూర్తిని ఎప్పటికీ భూమిపైనే ఉండిపొమ్మని అడుగుతాడు. అందుకు శ్రీమహావిష్ణువు అంగీకరించి, విఠోబాగా అవతరించి, అదే ఇటుక రాయిపై అలా నిలబడిపోతాడు. అలా కాల క్రమంలో ఆయన చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది. విఠోబాతోపాటు విష్ణుమూర్తి మరో అవతారమైన శ్రీకృష్ణుడు, ఆయన భార్య రుక్మిణీదేవిని కూడా ఈ ఆలయంలో కొలుస్తున్నారు. ఇక్కడికి ఒక్క మహరాష్ట్ర నుంచే కాకుండా, దేశ విదేశాలనుంచి రోజుకు 30 వేల మంది భక్తులు వచ్చి వెళుతుంటారు.