సాక్షి, ఖమ్మం : 31 పార్టీలతో కలసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మంగళవారం ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో మహాసభలో ఆయన మంగళవారం మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలు దెబ్బతిన్నాయని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు కొంత దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పెను మార్పులు వచ్చాయని, ఎర్రజెండా సత్తాను చూపించడానికి ఇది మంచి అవకాశమని చెప్పారు.
గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టలేదని అన్నారు. 165 స్థానాల నుంచి 99 స్థానాలకు బీజేపీ పరిమితమవడం ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలిచి, సీపీఎంను గెలిపించాలని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఫ్రంట్‌లో చేరాలని లెఫ్ట్ పార్టీలతో చర్చించగా.. సీపీఐ అందుకు అంగీకరించలేదని తెలిపారు.
సీపీఐ కూడా ఫ్రంట్‌లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కూటమికి ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’గా నామకరణం చేస్తున్నామని, ఈ మేరకు జనవరి 28న ప్రకటన చేస్తామని వివరించారు. తెలంగాణలో సామాజిక న్యాయం, రాష్ట్రం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటం చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment