Thamineni Veerbhadram
-
‘దేశ ప్రజలకు ఎందుకు కాపలాగా లేరు’
సాక్షి, ఖమ్మం: కేంద్రంలోని బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే మానవ హక్కులను కాపాడుకోలేమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజలను దోపిడీ నుంచి కాపాడాలని, బీజేపీ పాలనలో దళితులు, గిరిజనుల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. పుల్వామా ఉగ్రదాడి ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో ఏచూరి మాట్లాడుతూ.. వామపక్షాలు, లౌకిక శక్తులను పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్ని ఎన్నికలు ముందు విడివిడిగానే పోటీ చేస్తాయని, కానీ అధికారం కోసం ఎన్నికల అనంతరం కలుస్తాయని అన్నారు. ప్రజలు మంచి తీర్పునిస్తే.. కేంద్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాపలదారుడిని అని చెప్పుకునే నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు ఎక్కడ రక్షణగా ఉన్నారని ప్రశ్నించారు. దుర్మార్గ పాలనకు చరమగీతం: తమ్మినేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలని సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రజలగొంతుకను వినిపించేందుకు పార్లమెంట్లో వామపక్షాల బలం పెంచాలన్నారు. కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఫిరాయించడం మంచిదికాదన్నారు. దేశంలో వామపక్షాల అవసరం ఎంతో ఉందన్న తమ్మినేని.. సీపీఎం, సీపీఐ ఐక్యంగా పోటీచేస్తాయని వెల్లడించారు. -
ఎర్రజెండా ముద్దుబిడ్డ ‘వర్ధెల్లి’
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం, ప్రజలకోసం ఉద్యమించిన గొప్ప నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు.. అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఉమ్మడి నల్లగొండ జిల్లా గర్వించదగ్గ ఎర్రజెండా ముద్దుబిడ్డగా నిలిచారని వక్తలు కొనియాడారు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములు సంస్మరణ సభను బుధవారం సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు, సీపీఎం కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సూర్యాపేట : ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన తాను నమ్మిన సిద్ధాంతం, ప్రజల కోసం ఉద్యమించి నల్లగొండ జిల్లా గర్వించదగ్గ ఎర్రజెండా ముద్దుబిడ్డగా వర్ధెల్లి బుచ్చిరాములు నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. భూస్వాములు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తనతోపాటు ఉద్యమించిన కార్యకర్తల కష్టాలను గురించి రాళ్లెత్తిన కూలీలుగా పుస్తకాన్ని రచించిన గొప్ప నాయకుడని.. ఆ మహానీయుడిని స్ఫూర్తిగా తీసుకుని యువత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సంస్మరణ సభను సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు వివిధ సంఘాలు, పార్టీల నాయకులు, సీపీఎం కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బుచ్చిరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ 1969 డిసెంబర్లో సూర్యాపేటలో జరిగిన యువజన మహాసభలకు బుచ్చిరాములు నాయకత్వం వహించారని, నాటినుంచే బుచ్చిరాములుతో తన అనుబంధం కొనసాగిందన్నారు. వర్ధమానుకోటలో 10రోజులు క్యాంపులో కలిసే ఉన్నామని, పోలీసులు దాడి చేస్తున్నారని తెలిసి మకాంను కొత్తగూడెం మార్చామని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టు సిద్ధాంతం అజయమైందన్నారు. సామాజిక న్యాయం కోసం ఆరాటపడ్డారన్నారు. పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆయన నడిపిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా గర్వించదగ్గ కమ్యూనిస్టు నేత బుచ్చిరాములు అన్నారు. పేదలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం సుదీర్ఘ పోరాటాలు చేసిన యోధుడు బుచ్చిరాములు అన్నా రు. ఆ మహానీయుడికి నివాళులర్పించే అవకాశం రావడం గర్వకారణమన్నారు. అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికుమార్ మాట్లాడుతూ నేటి తరానికి బుచ్చిరాములు ఆదర్శమన్నారు. తనతో పాటు పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని గురించి పుస్తకాన్ని రచించిన గొప్ప నాయకుడన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పోరాట యోధులకు నిలయమన్నారు. బుచ్చిరాములు చూపిన మార్గం ఎందరికో ఆదర్శమన్నారు. ప్రజా గాయకుడు గోరెటి వెంకన్న మాట్లాడుతూ బుచ్చి రాములు లాంటి పోరాటయోధులు ఉన్నంత కాలం కవులు, కళాకారులు ఉం టా రన్నారు. వారి పోరాటాలు, ఉద్యమాలను చూసే మాలో స్ఫూర్తి రగులుతుందన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి.. తినడానికి తిండి లేని సమయంలోనూ పార్టీని వీడకుండా జెండా ను భుజాలపై మోశారని గుర్తు చేశారు. బీసీ కమిషన్ సభ్యుడు జూ లూరి గౌరీశంకర్ మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బుచ్చిరాములు అని కొనియాడారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, వైఎస్సాఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య. బీసీసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌లతోపాటు సాక్షి నెట్వర్క్ ఇన్చార్జి శ్రీకాంత్, మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, టెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, సీఎం పీఆర్ఓ రమేశ్, ప్రొఫెసర్ రమణనాయక్, బొమ్మగాని ప్రభాకర్, కేవీఎల్ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో ములకలపల్లి రాములు, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, నాయకులు పెద్దిరెడ్డి రాజా, డేవిడ్‌కుమార్, జుట్టుకొండ సత్యనారాయణ, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, బొమ్మిడి లక్ష్మీనారాయణ, జనార్దన్, గోవింద్ పాల్గొన్నారు. -
‘సోనియా తెలంగాణ తల్లి ఎలా అవుతుంది’
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ సమయంలో తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణం ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలని విమర్శించారు. ఎన్నికల వేళ వివిధ పార్టీల మ్యానిఫెస్టోలు ప్రజలకు తాయిలాలు ఇచ్చేలా ఉన్నాయని, అమలుకు సాధ్యమయ్యే విధంగా ఏ ఒక్కటిలేవని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతరులపై కామెంట్స్ చేసి సెంటిమెంట్ ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మళ్లీ ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిపించకపోతే ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటాననే వారు ప్రజలకు ఏం సేవ చేస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు పెట్టె ప్రలోభాలకు ప్రజలు మోసపోవద్దని, నిజాయితీతో పనిచేసే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థులను గెలిపించాలని వీరభద్రం కోరారు. -
ఓటమి భయంతోనే ముందస్తు జపం
సాక్షి, కామారెడ్డి/నిజామాబాద్: ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, దీంతో ప్రజలు తనను ఓడిస్తారన్న భయంతోనే ముందస్తు జపం చేస్తున్నారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘బహుజనులకు రాజ్యాధికారం–రాజకీయ పార్టీల వైఖరి’ అంశంపై శుక్రవారం జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగమని చెప్పిన హామీలేమి నెరవేరలేదన్నారు. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకునే.. ముందస్తు ఎన్నికలు అంటున్నాడని విమర్శించారు. రాజ్యాధికారం సాధించకపోవడం వల్లే దశాబ్దాలుగా బడుగు బలహీనవర్గాలు అణచివేతకు గురయ్యాయని, రాజ్యాధికారం ద్వారానే సామాజిక న్యాయం దక్కుతుందని తమ్మినేని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామన్న ప్రభుత్వం ఆ మాటను మర్చిపోయి కార్పొరేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. భూమిని దున్నుకుని బతుకుతున్న రైతులకు ఎకరానికి రూ.4 వేల సాయం అందించడం లేదని, అదే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రూ.లక్షల కొద్దీ దార పోసిందన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని, కార్పొరేట్ విద్యను రద్దు చేసి, పూర్తిగా ఉచిత విద్య అందిస్తామన్నారు. బీఎల్ఎఫ్ ప్రభంజనం సృష్టిస్తోందని, మెజారిటీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: గద్దర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరల భూ పంపిణీ, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు ఓటు అనే ఆ యుధంతో బుద్ధి చెప్పాలని ప్రజాగాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, రంజాన్‌కు మురిగిపోయిన బి ర్యానీ తినిపిస్తున్నాడని విమర్శించారు. రూ. వెయ్యి పింఛన్ ఇస్తానని భార్యాభర్తల మధ్య ఖ య్యం పెట్టిండన్నారు. దళితులకు భూమి లేదు. యువకులకు ఉద్యోగాలు లేవని విమర్శించారు. మహిళల మీద హింస పెరిగి పోయిందని, మంత్రివర్గంలో వారికి స్థానం లేకపోవడం సిగ్గుచేటన్నా రు. 52 శాతం ఉన్న బీసీలు, 12 శాతం ముస్లింలు, 15 శాతం దళితులు, అగ్రవర్ణాల్లోని 6 శాతం పేదలంతా ఏకమై టీఆర్ఎస్ సర్కారును కూల్చాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు భూమికి పచ్చా ని రంగేసినట్లు, సిరిమల్లె చెట్టుకింద లచ్చుమ మ్మో, దొర నీ టైం అయింది, సాల్ దొర నీ పాలన తదితర పాటలతో గద్దర్ అలరించారు. పలు తీర్మానాలు.. జుక్కల్ సభలో పలు తీర్మానాలు చేశారు. నియోజకవర్గంలోని 4 వేల మంది రైతులకు సంబంధించి 16 వేల ఎకరాల భూములకు పట్టాలు, పాసుబుక్కులతో పాటు పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. బిజ్జల్వాడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే చేపట్టాలని సభలో తీర్మానించారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లెండి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కౌలాస్ కాలువల మరమ్మతులు చేయాలని సభలో తీర్మానించారు. వైఎస్సార్ సీపీ నాయకులు సాయిలు, బీఎల్ఎఫ్, సీపీఎం వెంకట్రాములు, చంద్రశేఖర్, జడ్గె రవీందర్, సురేష్‌గొండ, విఠల్, బాల్‌రాజ్, మనోజ్, రాములు, భరత్ వాగ్మారే, శ్రీనివాస్, బాలు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిందే
నిజామాబాద్‌నాగారం: తెలంగాణ వచ్చాక కేసీఆ ర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితకు పదవులొచ్చాయి తప్ప ప్రజల బతుకులు మారలేదని టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ‘బహుజనుల రాజ్యాధికారం– ఓటర్ పాత్ర రాజకీయ పార్టీల వైఖరి’ అంశంపై జిల్లా కేంద్రంలోని లక్ష్మీకళ్యాణ మండపంలో టీమాస్ జిల్లా కన్వీనర్ పెద్ది వెంకట్రాములు అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల బతుకులు మార్చలేని సీఎం కేసీఆర్‌ను మార్చాల ని పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికారానికి ఓటే మార్గమని, వచ్చే ఎన్నికల్లో బహుజనుల బలం చూపించాలన్నారు. టీఆర్ఎస్ హయాంలో పేదలకు న్యాయం జరగలేదని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. త్వరలో బహుజన క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో భూ కబ్జాదారుల చెరలో ఉన్న భూములు కక్కిస్తామని, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే లా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. గుడిసెలు వేసుకొని పట్టాలు వచ్చే వరకు పేదల తరపున సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. బీఎల్ఎఫ్ను బలపరిచేందుకు ముందుకొచ్చే డ్వాక్రా సంఘాల మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి ఓటే బలమైన ఆయుధమని, ఇది ఏకే–47 కంటే శక్తివంతమైందని టీమాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాజు పేర్కొన్నారు. వివిధ పార్టీలు, సంఘాల నేతలు ప్రభాకర్, దండివెంకట్, సాయిబాబా, ఉప్పు సంతోష్, భూపాల్, ప్రకాశ్, పాలడుగు భాస్కర్, రమేశ్‌బాబు, నూర్జహాన్, మాల్యాల గోవర్ధన్, సాజుద్దిన్, మార్టిన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో పోలవరం ఉద్యమం
ముంపుప్రాంతాలపై టీ-టీడీపీ వైఖరి వెల్లడించాలి: తమ్మినేని భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో ఉద్యవుం చేపడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు మండలాల బదలాయింపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఇంత హడావిడిగా ముంపు మండలాల బదలాయింపుపై ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాలపై తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. -
సిపిఎం రెండు శాఖల ఏర్పాటు: ఏపికి మధు, తెలంగాణకు తమ్మినేని
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రెండు రాష్ట్రాలకు రెండు శాఖలను ఏర్పాటు చేసింది. రెండు కమిటీలకు కార్యదర్శులను నియమించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా సీనియర్ నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను నియమించారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కార్యదర్శిగా పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు పెనుమల్లి మధును నియమించారు. వీరిద్దరూ విద్యార్థి దశ నుంచే పార్టీ తరపున వివిధ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీతారం ఏచూరీ, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే రెండు రాష్ట్రాలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కమిటీలు నియమించిన మొట్టమొదటి పార్టీ సీపీఎం. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల కమిటీలకు కూడా సభ్యులను నియమించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత రాఘవులు చెప్పారు. పొత్తులపై రెండు రాష్ట్ర కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని ఆయన చెప్పారు.