సిపిఎం రెండు శాఖల ఏర్పాటు: ఏపికి మధు, తెలంగాణకు తమ్మినేని
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రెండు రాష్ట్రాలకు రెండు శాఖలను ఏర్పాటు చేసింది. రెండు కమిటీలకు కార్యదర్శులను నియమించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా సీనియర్ నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను నియమించారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కార్యదర్శిగా పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు పెనుమల్లి మధును నియమించారు. వీరిద్దరూ విద్యార్థి దశ నుంచే పార్టీ తరపున వివిధ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీతారం ఏచూరీ, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే రెండు రాష్ట్రాలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కమిటీలు నియమించిన మొట్టమొదటి పార్టీ సీపీఎం. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల కమిటీలకు కూడా సభ్యులను నియమించారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత రాఘవులు చెప్పారు. పొత్తులపై రెండు రాష్ట్ర కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని ఆయన చెప్పారు.