కేజ్రీవాల్‌కు మరో షాక్.. విదేశీ విరాళాలపై ఆరా
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కష్టాలు వీడటం లేదు. తిరుగుబాటు జెండా ఎగరేసిన కుమార్ విశ్వాస్ ఎన్నాళ్లు పార్టీలో ఉంటారో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఆ పార్టీకి వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ విరాళాల విషయమై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఆ పార్టీ ఉల్లంఘించిందన్న అనుమానంతోనే ఈ ప్రశ్నలు తలెత్తినట్లు తెలిసింది. ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు వెళ్లాయి.
అయితే... ఈ నోటీసులు సర్వసాధారణంగా వెళ్లేవేనని, అన్ని పార్టీలనూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటామని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని పార్టీలనూ వాళ్లకు వస్తున్న విరాళాల గురించిన వివరాలు అడుగుతుంటామని, అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా వెళ్లాయని తెలిపారు. అయితే.. తమ వద్ద దాచడానికి ఏమీ లేదని, అధికారులకు తాము అన్నివిధాలా సహకరిస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. పార్టీ స్థాపించే సమయంలో తమవద్ద డబ్బులు లేనందున విరాళాలు ఇవ్వాలని ఆప్ విజ్ఞప్తి చేయడంతో.. చాలామంది దాతలు ముఖ్యంగా విదేశాల నుంచి కూడా భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. 2013 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆప్ విరాళాలపై విచారణ జరిపింది గానీ అప్పట్లో అక్రమాలు ఏవీ బయటపడలేదు.