ఆ నిధుల సేకరణ వివరాలు చెప్పండి
న్యూఢిల్లీ: విదేశాల నుంచి సేకరించిన నిధుల వివరాలను తెలియజేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కేంద్ర హోం శాఖ కోరింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ఆప్‌కు నోటీసు జారీ చేసింది.
విదేశీ నిధుల సేకరణపై రాజకీయ పార్టీలకు మామూలుగా పంపే నోటీసుల్లో భాగంగా ఆప్‌కు జారీ చేశామని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పినట్టు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది. ఇది షోకాజ్ నోటీసు కాదని ఆయన స్పష్టం చేశారు. ఆప్ ఇచ్చే సమాధానాన్ని చూసిన తర్వాతే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆప్ సేకరించిన విరాళాలపై పలు ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో మూలాలున్న ఉగ్రవాద సంస్థల నుంచి ఆప్ విరాళాలు సేకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ వరుసగా పరాజయం పాలైంది.