న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెబెల్ ఎమ్మెల్యే ఆల్కా లంబాపై అనర్హత వేటు పడింది. ఆప్‌కు రాజీనామా చేసిన ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పీకర్ ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఆల్కా లంబా ఆప్‌కు రాజీనామా చేస్తున్నట్టు ట్విటర్‌లో ప్రకటించారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ.. తనను రాజీనామాచేయాలని ట్విటర్‌లో అడిగారని, అందుకే తాను రాజీనామా చేస్తున్న విషయాన్ని ట్విటర్‌లోనే చెప్తున్నానని ఆమె పేర్కొన్నారు.
పార్టీని వీడే సమయం ఆసన్నమైనందున ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అయిన అల్కా లంబా గతంలో ప్రకటించారు. గత ఆరేళ్ల ప్రయాణంలో పార్టీలో కొనసాగినందున గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నానని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను అల్కా బాహాటంగా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. అదేవిధంగా కేజ్రీవాల్ ట్విటర్‌లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ అల్కా గత కొంతకాలంగా ఆప్ తీరును విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment