న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్‌ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు.
‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్‌కు భద్రతా సలహాదారుగా విజయ్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్‌గానూ, జమ్ముకశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ ఐజీగానూ విజయ్‌కుమార్ విధులు నిర్వర్తించారు.
ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..
Comments
Please login to add a commentAdd a comment