MHA
-
మణిపూర్ హింసాకాండపై విచారణకు కమిటీ ఏర్పాటు
ఇంఫాల్: ఇటీవల జరిగిన మణిపూర్ అల్లర్లపై విచారణకు గౌహతి హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజయ్ లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది కేంద్ర హోంశాఖ. కమిటీలో ఎవరెవరున్నారంటే... మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇటీవల ఇక్కడ పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మాట ప్రకారం కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా నేతృత్వం వహిస్తారు. ఈ త్రిసభ్య కమిటీలో మిగిలిన ఇద్దరిలో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ కాగా మరొకరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్. కమీషన్ల విచారణ చట్టం 1952(60 ఆఫ్ 1952) లోని సెక్షన్-3 ప్రకారం ఈ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, విచారణను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆరు నెలల లోపే నివేదిక సమర్పించాలని కోరింది కేంద్ర హోంశాఖ. హైవే మీద అడ్డంకులను తొలగించండి... ఇదిలా ఉండగా నిత్యావసర వస్తువులను చేరవేసేందుకు వీలుగా ఇంఫాల్ దిమాపూర్ జాతీయ రహదారిపై ఉంచిన అడ్డంకులను తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇది కూడా చదవండి: ఒడిశా పోలీస్ సీరియస్ వార్నింగ్.. -
చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు: అమిత్ షా
న్యూఢిల్లీ: సరిహద్దులో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేయటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు. తవాంగ్ ఘర్షణను చూపుతూ కాంగ్రెస్ మరేదో అంశంపై ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా రాయబారుల వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో ఖర్చు చేశారని ఆరోపించారు. ‘సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. 5వ ప్రశ్న తర్వాత కాంగ్రెస్ అత్యుత్సాహం కనిపించింది. ఆ ప్రశ్నను కాంగ్రెస్ సభ్యుడే అడిగారు. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు సభకు అంతరాయం కలిగించారు. వారు అనుమతించి ఉంటే నేను సమాధానం ఇచ్చేవాడిని. 2006-06, 2006-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు రూ 1.35 కోట్లు అందాయి. అది ఎఫ్సీఆర్ఏ ప్రకారం సరైనది కాదు. నిబంధనల ప్రకారమే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను హోంశాఖ రద్దు చేసింది. నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని స్పష్టం చేస్తున్నా.’ అని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత బలగాలు: రాజ్‌నాథ్ -
ఐఏఎస్ అధికారి జీతేంద్ర నారాయణ్‌ను సస్పెండ్ చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి జీతేంద్ర నారాయణ్‌ను సస్పెండ్ చేసింది కేంద్ర హోంశాఖ. ఓ మహిళను ఆయన లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో నివేదికను పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జేతేంద్రపై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి(యూటీ డివిజన్) అశుతోష్ అగ్నిహోత్రి ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ఆదేశాలు జారీ చేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన జీతేంద్ర నారాయణ్ అండమాన్ నికోబార్‌లో ఓ మహిళను వేధించారని ఇటీవల అరోపణలు వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసుల నుంచి నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ. జీతేంద్రపై వచ్చిన ఆరోపణలు నిజమే అని ఆదివారం అందిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆ మరునాడే చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. జీతేంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఉన్నత హోదాలో ఉండి అధికార దుర్వినియోగానికి, ప్రత్యేకించి మహిళలపై వేధింపులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాల్లో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. జీతేంద్ర నారాయణ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులతో పాటు, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. చదవండి: కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి -
వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి రాజీనామా
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్‌ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్‌కు భద్రతా సలహాదారుగా విజయ్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్‌గానూ, జమ్ముకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ ఐజీగానూ విజయ్‌కుమార్ విధులు నిర్వర్తించారు. ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి.. -
విదేశాల్లో బంధువులున్నారా? మీకో గుడ్‌న్యూస్: నిబంధనలు మారాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. ఈ మేరకు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, వారి బంధువులకు శుభవార్త అందించింది. తాజా సవరణతో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించాల్సిన అవసరం లేకుండానే పది లక్షల రూపాయల వరకు భారతీయ బంధువులకు, కుటుంబీకులకు విదేశాల్లో ఉంటున్న వారు పంపించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు సవరించిన నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు ఏడాదిలో రూ.10 లక్షలకు మించి నిధులు అందిన 90 రోజుల్లోగా ప్రభుత్వానికి అధికారికంగా వెల్లడించేలా నిబంధనలు మార్చింది. ఇప్పటివరకు ఈ వ్యవధి 30 రోజులు మాత్రమే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఎ)కి సంబంధించిన కొన్ని నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. దీనికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ నిబంధనలు, 2022 గెజిట్ నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కాగా విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం 2011లో, రూల్ 6 ప్రకారంలో ఏ వ్యక్తి అయినా తన బంధువుల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన విదేశీ విరాళాన్ని స్వీకరిస్తే, అటువంటి సహకారం అందిన 30 రోజులలోపు కేంద్రానికి వివరాలు తెలియజేయాల్సి ఉండింది. ప్రస్తుత నిబంధన ప్రకారం 10 లక్షలకు మించి విదేశీ నిధులను స్వీకరిస్తే 90 రోజులలోపు సమాచారాన్ని కేంద్రానికి అందించాలి. అదేవిధంగా, ఎఫ్సీఆర్ఏ నిధులను స్వీకరించడానికి 'రిజిస్ట్రేషన్' లేదా 'ముందస్తు అనుమతి' పొందే నిబంధన 9కి కూడా మార్పులు చేసింది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు లేదా ఎన్జీవోలు తమకు అందిన నిధులు, బ్యాంకు ఖాతా సమాచారాన్ని హోంమంత్రిత్వ శాఖకు అందించే గడువు 45 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ఇది 30 రోజులు మాత్రమే. ఎన్జీవోలు లేదా సంస్థలు, వ్యక్తులు విదేశీ నిధులను స్వీకరణకు సంబంధించి తన అధికారిక వెబ్సైట్లో ప్రతీ త్రైమాసికంలో వివరాలను అందించాలనే మరో నిబంధనను కూడా తొలగించింది. ఒక వేళ బ్యాంకు ఖాతా, పేరు, చిరునామా లేదా విదేశీ నిధులు మారిన పక్షంలో, ఆ సమాచారాన్ని మునుపటిలా 15 రోజుల ముందు కాకుండా 45 రోజులలోపు అందించాలి. అలాగే ఆయా నిధుల వినియోగంపై ఆడిటెడ్ స్టేట్మెంట్ అందించడానికి ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 9 నెలల సమయం ఉంటుంది. -
బాబోయ్.. ఇవెక్కడి పోలీస్ స్టేషన్లు!!
అంతా టెక్నాలజీమయం. వర్చువల్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. నేరాలు ఎంత టెక్నిక్‌తో జరుగుతున్నాయో.. అంతే కౌంటర్ టెక్నాలజీతో వాటిని చేధిస్తున్నారు పోలీసులు. కీలకమైన పోలీసింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సూపర్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ, ఆ వ్యవస్థను పటిష్టపరిచే అంశంపై మాత్రం పూర్తి దృష్టి పెట్టడం లేదన్న విషయం తెలుసా?. దేశంలో పోలీసు వ్యవస్థ దీనస్థితిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ) నివేదిక వెల్లడించింది తాజాగా.. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (PSC) ఈ నివేదిక రూపొందించింది. తాజాగా ఈ కమిటీ హోం వ్యవహారాల శాఖకు సమర్పించిన నివేదికలో.. దేశంలో 257 పోలీస్ స్టేషన్లకు ఇప్పటివరకు వాహనాలే లేవట. మరో 638 పోలీస్ స్టేషన్లకు కనీసం టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇక 143 పోలీస్ స్టేషన్లకు వైర్లెస్, సెల్‌ఫోన్ లాంటి సౌకర్యాలు లేవని ఈ కమిటీ వెల్లడించింది. పనిలో పనిగా మోడ్రన్ పోలీసింగ్ వ్యవస్థకు బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరమని, త్వరగతిన స్పందన కోసం వాహన వ్యవస్థ సమకూరాలని, అత్యాధునిక ఆయుధాల అవసరమూ ఉందని ఈ కమిటీ అభిప్రాయపడింది. 21వ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ బలంగా లేకపోవడం మంచిది కాదు, ఆయా రాష్ట్రాలకు ఇంసెన్సిటివ్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే జమ్ము కశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వైర్ లెస్ సేవల కొరత మంచిది కాదని తెలిపింది. ఇక పలు రాష్ట్రాల విషయంలో హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖకు కీలక సూచనలు చేసిన ఈ కమిటీ.. కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో అవసరమైన చర్యలు త్వరగతిన చేపట్టాలని కోరింది. లా అండ్ ఆర్డర్ పరిరక్షించే క్రమంలో సిబ్బందికి గాయాలు కాకుండా ఉండేందుకు రక్షణ కవచాల ఆవశ్యకతను కమిటీ గుర్తు చేసింది. అంతేకాదు ఆయా పోలీస్ స్టేషన్ల తీరుతో జనాలు.. పొరుగు ప్రాంతాల స్టేషన్లను ఆశ్రయిస్తున్నారంటూ ఆసక్తికర అంశాన్ని సైతం ప్రస్తావించింది కమిటీ. మొత్తం దేశంలోని 16, 833 పోలీస్ స్టేషన్లను పరిశీలించి.. జనవరి 1, 2020 నాటి పరిస్థితుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఈ కమిటీ. అయితే ఈ పరిస్థితుల్లో ఈనాటికీ పెద్దగా మార్పు రాలేదని కమిటీ పేర్కొనడం గమనార్హం. -
‘269 రోజులైంది.. నా భార్యను చూడనివ్వరా?’
తన భార్యను నుంచి తనను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత దేశంలోకి తనను అడుగుపెట్టనివ్వడం లేదని పాపులర్ యూట్యూబర్ కర్ల్ రాక్ ఆరోపిస్తున్నాడు. కనీసం తనకు వివరణ కూడా ఇవ్వట్లేదంటూ ఇండియన్ గవర్నమెంట్ పై ఆరోపణలు గుప్పిస్తూ తాజాగా యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయితే కార్ల్ రాక్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన కారణం ఇంతకాలం వెల్లడించకుండా వస్తున్న కేంద్ర హోం శాఖ.. తాజాగా దానిపై వివరణ ఇచ్చుకుంది. న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్‌కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్రైస్.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇతనికి భారీగా మద్ధతు లభిస్తోంది. ‘కర్ల్ రాక్’ పేరుతో యూట్యూబర్‌గా పాపులర్ అయిన కార్ల్.. ట్రావెల్ సేఫ్టీ, వివిధ ప్రాంతాల్లో కల్చర్, వేరేదేశాల్లో ఫారినర్లకు ఎదురయ్యే మోసాల మీద వీడియోలు తీస్తుంటాడు. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 1.8 మిలియన్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. 2019లో భారత్‌కు చెందిన మనీషా మాలిక్‌కు పెండ్లి చేసుకున్నాడు. అయితే కిందటి ఏడాది అక్టోబర్ నుంచి అతన్ని భారత్‌లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఈ విషయంపై భారత్‌ను నిలదీయడంతో పాటు న్యూజిలాండ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నాడు. కనీసం స్పందించరా? 2020 అక్టోబర్‌లో దుబాయ్, పాకిస్థాన్‌లో అతను పర్యటించాడు. ఆ టైంలో న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అతను బయలుదేరగానే.. అతన్ని భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో తనపేరు చేర్చిందన్నది అతని వాదన. ‘269 రోజుల నుంచి నా భార్యను చూడనివ్వడం లేదు. భారత ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. కనీసం కారణాలైనా చెప్పమని ఎన్ని మెయిల్స్ పంపినా బదులు లేదు. నా భార్య, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బదులు ఇవ్వడం లేద’ని వీడియోలో వాపోయాడు అతను. అంతేకాదు ట్విటర్లో న్యూజిలాండ్ పీఎం జెస్సిండాను సైతం ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం కర్ల్కు సపోర్ట్‌గా సైన్ పిటిషన్ కూడా నడుస్తోంది. ఈ కోణాలు కూడా! అయితే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందువల్లే అతనికి ఇలా జరుగుతోందని కొందరు మద్ధతుదారులు అంటున్నాడు. అంతేకాదు గతంలో అతను పాక్‌లో కొన్ని నెలలు గడిపాడు కూడా. అటుపై పాక్ అక్రమిత కశ్మీర్‌తో పాటు సైనిక శిబిరాలను సైతం సందర్శించాడు. ఈ నేపథ్యంలోనే అనుమానాల నడుమ భారత ప్రభుత్వం అతన్ని అడ్డుకుంటోందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ ఐఎస్ఐ తనను గమనిస్తోందని అప్పట్లో అతను తీసిన వీడియోను సైతం పోస్ట్ చేస్తున్నారు. #Exclusive | ‘India is a secular country and it shouldn’t have any laws which talk about religion’, says Karl Rock on anti-CAA protests. Watch TIMES NOW’s Mohit Sharma speaking exclusively with YouTuber (@YouTube) @iamkarlrock. pic.twitter.com/RVtx6YWwI6 — TIMES NOW (@TimesNow) December 19, 2019 ఆరోపణలపై స్పందించిన కేంద్రం అయితే కర్ల్ రాక్ విషయంలో వినిపిస్తున్న వాదనలను, ఆరోపణలను కేంద్రం ఖండించింది. వీసా నిబంధనల, షరతులు ఉల్లంఘించిన నేరానికే అతన్ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టూరిస్ట్ వీసా మీద వచ్చిన అతను.. వ్యాపారాల్లో భాగం అయ్యాడని, ఇది వీసా కండిషన్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందని, వచ్చే ఏడాది వరకు అతన్ని దేశంలోకి అనుమతించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. కాగా, కరోనా టైంలో ఢిల్లీ ప్లాస్మా బ్యాంకులో రెండుసార్లు రక్తదానం చేసి సీఎం కేజ్రీవాల్ నుంచి అభినందనలు కూడా అందుకున్నాడు కర్ల్ రాక్. -
విస్కీ బాటిళ్లు, చిప్స్.. విశ్రాంతి కావాలి
న్యూఢిల్లీ: గురువారం దేశ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎమ్హెచ్ఏ) ఫేస్బుక్ పేజిలో దర్శనమిచ్చిన ఓ ఫోటోపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజనులయితే కేంద్ర ప్రభుత్వాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇన్ని విమర్శలు మూటగట్టుకోవడానికి ఆ ఫోటోలో ఏముందబ్బా అని చూస్తే.. రెండు విస్కీ బాటిళ్లు, పక్కనే స్నాక్స్ ప్లేట్ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే.. ‘తుఫానుతో దెబ్బతిన్న బెంగాల్లో చేపట్టిన సహాయక చర్యలు’ అనే పోస్ట్‌లో ఈ విస్కీ బాటిళ్ల ఫోటో దర్శనమిచ్చింది. ఇంకేముంది.. ఇది చూసిన నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ప్రతి ఒక్కరికి విశ్రాంతి కావాలి. అందుకు నిదర్శనం ఈ ఫోటో’.. ‘ఏంటి ఇదంతా.. ఎవరు బాధ్యత వహించాలి’.. ‘కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్ చేశారు నెటిజనులు. 15 నిమిషాల తర్వాత ఈ ఫోటోను తొలగించారు. ఈ సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘అనుకోకుండా జరిగిన తప్పిదం ఇది. ఈ రోజు ఓ జూనియర్ ఉద్యోగి ఈ పేజిని ఆపరేట్ చేశాడు. అయితే తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయాల్సిన ఫోటోను.. పొరపాటున ఎమ్హెచ్ఏ అకౌంట్లో పోస్ట్ చేశాడు. మా దృష్టికి రావడంతో వెంటనే దాన్ని తొలగించాము. సదరు ఉద్యోగి రాతపూర్వకంగా క్షమాపణలు కూడా తెలిపాడు’ అన్నారు. ఎమ్హెచ్ఏ ఫేస్బుక్ పేజిని 2.79 లక్షలకు పైగా ప్రజలు అనుసరిస్తున్నారు. -
ఎలాగైనా ఆపాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) ప్రక్రియను ఎలాగైనా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్–మే నెలల్లో జరుగుతాయని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర సాయుధ బలగాలు విధులు నిర్వర్తించాల్సి ఉందని, ఆ సమయంలో ఈ ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి గతంలో విధించిన జూలై 31 గడువును పొడిగించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కేంద్రం సహకరించడం లేదని, ఎన్ఆర్సీ ప్రక్రియను మొత్తం నాశనం చేసేలా హోం శాఖ వ్యవహరిస్తోందని తప్పుపట్టింది. రాష్ట్ర అధికారులకు లోక్‌సభ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాల్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల వల్ల ఎన్ఆర్సీ నమోదుకు ఆటంకం కలగకుండా చూడాలని ఇది వరకే అత్యున్నత ధర్మాసనం అస్సాం ప్రభుత్వం, ఎన్ఆర్సీ కోఆర్డినేటర్, ఈసీలకు సూచించింది. గడువులోనే పూర్తిచేస్తాం: రాజ్‌నాథ్ నిర్దిష్ట గడువులోగా ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి కట్టుబడి ఉన్నామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విదేశీయులకు ఈ జాబితాలో స్థానం కల్పించమని, అలాగే ఒక్క భారతీయుడిని కూడా విస్మరించమని హామీ ఇచ్చారు. ఎన్ఆర్సీ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నామని, ఇందుకు అవసరమైన అన్ని నిధుల్ని అస్సాంకు సమకూర్చామని చెప్పారు. సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టిన కొన్ని గంటల తరువాత రాజ్‌నాథ్ ఈ విధంగా స్పందించారు. -
కశ్మీర్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కల్లోల కశ్మీర్లో భద్రతా బలగాల కార్యకలాపాలకు సంబధించి కేంద్రం బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. పవిత్ర రంజాన్ మాసంలో భద్రతా పరమైన ఆపరేషన్లు చేపట్టవద్దని చెప్పింది. అయితే, అవతలివారు హింసాయుత చర్యలకు పాల్పడిన పక్షంలోగానీ, సామాన్య పౌరుల ప్రాణాలాను కాపాడేందుకుగానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిదాడి చేయవచ్చని సూచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులకు లేఖలు పంపింది. గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుండటం తెలసిందే. ఇదిలాఉంటే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా పలు విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌లోని చత్తాబల్ ప్రాంతంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. తీవ్రంత స్వల్పంగా ఉండటంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. పుల్వామా జిల్లాలో జరిగిన మరో సంఘటనలో.. రాజ్‌పోరా పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. అవికాస్తా గురి తప్పడంతో పక్కనున్నదుకాణాలు ధ్వంసమయ్యాయి. -
ది బెస్ట్ ఠాణా పంజగుట్ట..
పంజగుట్ట ఠాణాకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోనే ‘బెస్టాఫ్ త్రీ’లో ఒకటిగా ఈ పోలీస్ స్టేషన్‌ను కేంద్రం అధీనంలోని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రారంభంకానున్న డీజీపీలు, ఐజీపీల 52వ వార్షిక సదస్సులో పంజగుట్ట పోలీసులకు అవార్డు అందజేస్తారు. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని దేశంలోనే ఉత్తమంగా నిలిచే పది ఠాణాలను గుర్తించి...వాటిలో మూడింటిని బెస్టాఫ్ త్రీగా ఎంపిక చేస్తారు. దేశంలోని 140 పోలీస్ స్టేషన్లు దీనికోసం పోటీపడగా.. పంజగుట్ట ఠాణాకు ఈ గౌరవం దక్కడం విశేషం. సాక్షి, హైదరాబాద్: లైంగిక ఆరోపణ కేసులో ప్రముఖ గజల్ గాయకుడు కేసిరాజు శ్రీనివాస్‌ను అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో పంజగుట్ట ఠాణా పేరు మారుమోగింది. ఈ మోడల్ పోలీసుస్టేషన్ పేరు మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగానూ వినిపించనుంది. కేంద్రం ఆధీనంలోని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ పోలీసుస్టేషన్‌ను దేశంలోనే ‘బెస్టాఫ్ త్రీ’ల్లో ఒకటిగా ఎంపిక చేయడమే దీనికి కారణం. శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రారంభంకానున్న 52వ వార్షిక డీజీపీలు, ఐజీపీల సదస్సులో కేంద్రం పంజగుట్ట పోలీసులకు అవార్డు అందించనుంది. 51వ డీజీపీల సదస్సు 2016లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో జరిగింది. అప్పుడు ‘ఉత్తమ పోలీసుస్టేషన్ల’ గుర్తింపును తీర్మానంగా చేశారు. మౌళిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ దేశంలోనే ఉత్తమంగా నిలిచే పది ఠాణాలను గుర్తించాలని, వాటిలో మూడింటిని బెస్టాఫ్ త్రీగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని ఆ సదస్సులో నిర్ణయించారు. 2017 డిసెంబర్లో జరగాల్సిన 52వ వార్షిక సదస్సు ఈ నెలకు వాయిదా పడింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని టెక్కెన్పూర్లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడెమీలో శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. నెలన్నర అధ్యయనం తర్వాత ఎంపిక... దేశ వ్యాప్తంగా పది ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్ఏ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. కేంద్రం ఆధీనంలోని ఈ విభాగం 2017లో దేశంలోన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానించింది. మొత్తమ్మీద 140 పోలీసుస్టేషన్లు పోటీపడగా... అత్యధికంగా మహారాష్ట్రలోని పుణే కమిషనరేట్ నుంచి 16 ఎంట్రీలు వచ్చాయి. ఏపీ నుంచి రెండు పోలీసుస్టేషన్లు, తెలంగాణ నుంచి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, పంజగుట్ట ఠాణాలకు సంబంధించిన ఎంట్రీలు వెళ్ళాయి. 140 ఎంట్రీలను పరిగణలోకి తీసుకున్న ఈ విభాగం కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసింది. వాటిలో జూబ్లీహిల్స్, పంజగుట్ట కూడా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం గతేడాది హైదరాబాద్ చేరుకుని దాదాపు నెలన్నర పాటు రహస్యంగా ఈ రెండు ఠాణాల పనితీరు, వాటిలోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పోలీసుస్టేషన్ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల నివసించే వారు, పోలీసుస్టేషన్ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది. అత్యంత క్లిష్టమైన ఎంపిక విధానం... క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన బృందం ఆ ఠాణాకు సంబంధించి ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఆకస్మికంగా ఆ పోలీసుస్టేషన్‌ను సందర్శించే బృంద సభ్యులు మౌలిక వసతులు, వాటి నాణ్యతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్ళకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిశుభ్రత, పచ్చదనంతో అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరు, ఫైళ్ళ నిర్వహణలను పరిగణనలోకి తీసుకుంటారు. ‘టాప్ 1’ తెలిసేది ఆ రోజే... ప్రత్యేక ప్రామాణికాల ఆధారంగా పదింటి నుంచి తొలుత ‘బెస్టాఫ్ త్రీ’గా దేశంలోనే ఉత్తమమైన మూడు పోలీసుస్టేషన్లను ఎంపిక చేస్తారు. ఈ జాబితాను ఓ నిపుణుల కమిటీకి హెచ్ఎంఏ అందిస్తుంది. వీరు చేసే మదింపు తర్వాత ఉత్తమ పోలీసుస్టేషన్‌ను ఎంపిక చేసి, దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాన్ని రోల్‌మోడల్‌గా ప్రకటిస్తారు. 2017కు సంబంధించి పంజగుట్ట పోలీసుస్టేషన్ ‘బెస్టాఫ్ త్రీ’లో స్థానం సంపాదించింది. ఈ మేరకు ఎంహెచ్ఏ నుంచి రాష్ట్ర పోలీసు విభాగానికి వర్తమానం అందింది. గ్వాలియర్‌లో జరిగే సదస్సు నేపథ్యంలో శనివారమే మిగిలిన రెండు ఠాణాలు ఏంటి? ఈ మూడింటిలో మొదటి స్థానంలో నిలిచింది ఏది? అనే అంశాలు వెల్లడికానున్నాయి. -
పద్మ అవార్డుల కోసం ఎవరి పేర్లయినా..
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పద్మ అవార్డుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం(సెప్టెంబర్ 15)తో ముగియనుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. 2018 ఏడాదికి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పద్మ అవార్డుల నామినేషన్లు స్వీకరించడానికి చివరితేదీని సెప్టెంబర్ 15గా(అర్ధరాత్రి వరకు) నిర్ణయించారు. ప్రజల్లో ఎవరైనా పద్మ అవార్డుల కోసం ఎవరి పేర్లయినా ప్రతిపాదించవచ్చు. దీనివల్ల వెలుగులోకి రాని చాలామంది అర్హులైన వ్యక్తులకు సరైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ప్రజలందరూ తమ ప్రతిపాదనలను అధికారిక వెబ్‌సైబ్ www.padmaawards.gov.in ద్వారా పంపొచ్చు. కేవలం ఆన్లైన్ ద్వారానే ప్రతిపాదనలను స్వీకరించనున్నారు. సామాన్యులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎంలు, గవర్నర్లు, మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారత రత్న, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు కూడా పద్మ అవార్డు కోసం వ్యక్తుల పేర్లను ఆన్లైన్ ద్వారానే ప్రతిపాదించే అవకాశాన్ని కల్పించారు. ప్రధాని మోదీ నియమించిన పద్మ అవార్డుల కమిటీ అవార్డుల ప్రదానంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. గతంలో రాజకీయ నేతలు, మంత్రులు సిఫార్సు చేసినవారికే పద్మ అవార్డులు అందేవి. అవార్డు గ్రహీతల ఎంపిక పారదర్శకంగా జరగడానికి నామినేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ చేశారు. -
విమానాలపై కెమికల్ దాడులు.. వార్నింగ్!
-
నాగా ఒప్పందం ఫైళ్లు ఇవ్వండి: సీఐసీ
న్యూఢిల్లీ: నాగా తీవ్రవాదులతో ప్రభుత్వానికి కుదిరిన నాగా ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని హోంశాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ఆదేశించింది. ఈ ఒప్పందం పత్రాలను ఇవ్వాలంటూ దాఖలైన ఓ సమాచార హక్కు దరఖాస్తును హోంశాఖ తిరస్కరించటంపై సీఐసీ మండిపడింది. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్‌కు చెందిన వెంకటేశ్ నాయక్ దరఖాస్తు చేయగా.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1) (ఏ) ప్రకారం వివరాలు అందజేయటం కుదరదని హోంశాఖ తెలిపింది. దీంతో నాయక్.. ప్రధాన సమాచార కమిషనర్ ఆర్ కమిషనర్ ఆర్కే మాథుర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐసీ నాగా ఒప్పందం వివరాలను వెంటనే తమకు ఇవ్వాలని ఆదేశించింది. -
పంజాబ్‌పై దాడి చేయండి: ఐఎస్ఐ
న్యూఢిల్లీ: భారత్ పై దాడి చేయాలని పాకిస్థాన్‌కు చెందిన సిక్కు ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. పంజాబ్‌లో తమ ఆదీనంలో ఉన్న స్లీపర్ సెల్స్‌ను అప్రమత్తం చేసిన ఐఎస్ఐ.. సర్బత్ ఖల్సా నిర్వాహకులను అరెస్టు చేసిన అంశాన్ని ఆసరాగా చేసుకొని అనూహ్య దాడులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నెల (నవంబర్) 10న బటిండాలో సిక్కులు సర్బత్ ఖల్సా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే, దీన్ని అదనుగా చేసుకొని ఘర్షణలు, అల్లర్లు సృష్టించాలని బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు ఇప్పటికే నిఘావర్గాల సమాచారం అందడంతో ఈ కార్యక్రమానికి పోలీసులు, పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 12మంది బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్లు కూడా తెలియడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం పంజాబ్ పోలీసులు పెద్ద మొత్తంలో అరెస్టు చేశారు. 180మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 23న అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.