న్యూఢిల్లీ: అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్సీ) ప్రక్రియను ఎలాగైనా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్–మే నెలల్లో జరుగుతాయని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర సాయుధ బలగాలు విధులు నిర్వర్తించాల్సి ఉందని, ఆ సమయంలో ఈ ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్‌ఆర్సీని పూర్తిచేయడానికి గతంలో విధించిన జూలై 31 గడువును పొడిగించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తేల్చి చెప్పింది.
ఈ వ్యవహారంలో కేంద్రం సహకరించడం లేదని, ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను మొత్తం నాశనం చేసేలా హోం శాఖ వ్యవహరిస్తోందని తప్పుపట్టింది. రాష్ట్ర అధికారులకు లోక్‌సభ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాల్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల వల్ల ఎన్‌ఆర్‌సీ నమోదుకు ఆటంకం కలగకుండా చూడాలని ఇది వరకే అత్యున్నత ధర్మాసనం అస్సాం ప్రభుత్వం, ఎన్‌ఆర్‌సీ కోఆర్డినేటర్, ఈసీలకు సూచించింది.
గడువులోనే పూర్తిచేస్తాం: రాజ్‌నాథ్
నిర్దిష్ట గడువులోగా ఎన్‌ఆర్సీని పూర్తిచేయడానికి కట్టుబడి ఉన్నామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విదేశీయులకు ఈ జాబితాలో స్థానం కల్పించమని, అలాగే ఒక్క భారతీయుడిని కూడా విస్మరించమని హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్సీ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నామని, ఇందుకు అవసరమైన అన్ని నిధుల్ని అస్సాంకు సమకూర్చామని చెప్పారు. సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టిన కొన్ని గంటల తరువాత రాజ్‌నాథ్ ఈ విధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment