తన భార్యను నుంచి తనను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత దేశంలోకి తనను అడుగుపెట్టనివ్వడం లేదని పాపులర్ యూట్యూబర్ కర్ల్ రాక్ ఆరోపిస్తున్నాడు. కనీసం తనకు వివరణ కూడా ఇవ్వట్లేదంటూ ఇండియన్ గవర్నమెంట్ పై ఆరోపణలు గుప్పిస్తూ తాజాగా యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయితే కార్ల్ రాక్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన కారణం ఇంతకాలం వెల్లడించకుండా వస్తున్న కేంద్ర హోం శాఖ.. తాజాగా దానిపై వివరణ ఇచ్చుకుంది.
న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్‌కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్‌రైస్.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇతనికి భారీగా మద్ధతు లభిస్తోంది. ‘కర్ల్ రాక్’ పేరుతో యూట్యూబర్‌గా పాపులర్ అయిన కార్ల్.. ట్రావెల్ సేఫ్టీ, వివిధ ప్రాంతాల్లో కల్చర్, వేరేదేశాల్లో ఫారినర్లకు ఎదురయ్యే మోసాల మీద వీడియోలు తీస్తుంటాడు. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 1.8 మిలియన్ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. 2019లో భారత్‌కు చెందిన మనీషా మాలిక్‌కు పెండ్లి చేసుకున్నాడు. అయితే కిందటి ఏడాది అక్టోబర్ నుంచి అతన్ని భారత్‌లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఈ విషయంపై భారత్‌ను నిలదీయడంతో పాటు న్యూజిలాండ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నాడు.
కనీసం స్పందించరా?
2020 అక్టోబర్‌లో దుబాయ్, పాకిస్థాన్‌లో అతను పర్యటించాడు. ఆ టైంలో న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి అతను బయలుదేరగానే.. అతన్ని భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో తనపేరు చేర్చిందన్నది అతని వాదన. ‘269 రోజుల నుంచి నా భార్యను చూడనివ్వడం లేదు. భారత ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. కనీసం కారణాలైనా చెప్పమని ఎన్ని మెయిల్స్ పంపినా బదులు లేదు. నా భార్య, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బదులు ఇవ్వడం లేద’ని వీడియోలో వాపోయాడు అతను. అంతేకాదు ట్విటర్‌లో న్యూజిలాండ్ పీఎం జెస్సిండాను సైతం ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం కర్ల్‌కు సపోర్ట్‌గా సైన్ పిటిషన్ కూడా నడుస్తోంది.
ఈ కోణాలు కూడా!
అయితే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందువల్లే అతనికి ఇలా జరుగుతోందని కొందరు మద్ధతుదారులు అంటున్నాడు. అంతేకాదు గతంలో అతను పాక్‌లో కొన్ని నెలలు గడిపాడు కూడా. అటుపై పాక్ అక్రమిత కశ్మీర్‌తో పాటు సైనిక శిబిరాలను సైతం సందర్శించాడు. ఈ నేపథ్యంలోనే అనుమానాల నడుమ భారత ప్రభుత్వం అతన్ని అడ్డుకుంటోందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ ఐఎస్‌ఐ తనను గమనిస్తోందని అప్పట్లో అతను తీసిన వీడియోను సైతం పోస్ట్ చేస్తున్నారు.
#Exclusive | ‘India is a secular country and it shouldn’t have any laws which talk about religion’, says Karl Rock on anti-CAA protests.
— TIMES NOW (@TimesNow) December 19, 2019
Watch TIMES NOW’s Mohit Sharma speaking exclusively with YouTuber (@YouTube) @iamkarlrock. pic.twitter.com/RVtx6YWwI6
ఆరోపణలపై స్పందించిన కేంద్రం
అయితే కర్ల్ రాక్ విషయంలో వినిపిస్తున్న వాదనలను, ఆరోపణలను కేంద్రం ఖండించింది. వీసా నిబంధనల, షరతులు ఉల్లంఘించిన నేరానికే అతన్ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టూరిస్ట్ వీసా మీద వచ్చిన అతను.. వ్యాపారాల్లో భాగం అయ్యాడని, ఇది వీసా కండిషన్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందని, వచ్చే ఏడాది వరకు అతన్ని దేశంలోకి అనుమతించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. కాగా, కరోనా టైంలో ఢిల్లీ ప్లాస్మా బ్యాంకులో రెండుసార్లు రక్తదానం చేసి సీఎం కేజ్రీవాల్ నుంచి అభినందనలు కూడా అందుకున్నాడు కర్ల్ రాక్.
Comments
Please login to add a commentAdd a comment