ఎన్నార్సీపై చర్చించలేదు | PM narendra Modi claims his government never brought up NRC | Sakshi
Sakshi News home page

ఎన్నార్సీపై చర్చించలేదు

Published Mon, Dec 23 2019 1:48 AM | Last Updated on Mon, Dec 23 2019 8:00 AM

PM narendra Modi claims his government never brought up NRC - Sakshi

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన ర్యాలీకి హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)కు సంబంధించి తన ప్రభుత్వం ఇంతవరకు కేబినెట్‌లో కానీ, పార్లమెంట్లో కానీ చర్చించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అస్సాంలో మాత్రం ఎన్నార్సీని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిపారని గుర్తు చేశారు. ఎన్నార్సీపై విపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలకు, హింసాత్మక ఆందోళనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని  మోదీ గట్టిగా సమర్థించారు. ఆ చట్టాన్ని వ్యతిరేకించే ముందు ఆ చట్టంలోని అంశాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు.

భారతీయ ముస్లింలకు ఆ చట్టంతో ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.  పాకిస్తాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులకు పౌరసత్వం కల్పించాలని గతంలో మహాత్మాగాంధీయే చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గాంధీ పేరును తమ పేరుకు తగిలించుకున్న వారు తెలుసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్‌ అగ్రనేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మూడు పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వ హక్కులు కల్పించేందుకు ఉద్దేశించినదే కానీ.. ఇక్కడి వారి హక్కులను లాగేసుకునేది కాదు’ అని పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఉద్దేశాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనను గతంలో కాంగ్రెస్, టీఎంసీలు  సమర్థించాయని, ఇప్పుడు ఓటుబ్యాంక్‌ రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

  ఈ చట్టం అమలైతే ముస్లింలను నిర్బంధ కేంద్రా(డిటెన్షన్‌ సెంటర్‌)లకు పంపించేస్తారని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, పట్టణ నక్సలైట్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  శాంతి పాటించాలని, హింసకు పాల్పడవద్దని కాంగ్రెస్, తృణమూల్, ఆప్, లెఫ్ట్‌ పార్టీలు సీఏఏ ఆందోళనకారులకు ఎందుకు విజ్ఙప్తి చేయడం లేదని ప్రశ్నించారు.  తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని పలువురు సీఎంలు చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ.. వీరు తమ న్యాయాధికారులను సంప్రదిస్తే మంచిదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు. ఢిల్లీలోని అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ అనంతరం, వారికి యాజమాన్య హక్కులు కల్పించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాపూర్వక సభలో గంటన్నరకు పైగా ప్రధాని   ప్రసంగించారు. ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభ ఎన్నికల ప్రచార ప్రారంభంగానే కనిపించింది.

శరణార్థులు వేరు.. అక్రమ వలసదారులు వేరు
శరణార్థులకు, అక్రమ వలసదారులకు తేడా ఉందని, శరణార్థులు తమ వివరాలను దాచేందుకు ప్రయత్నించరని, అక్రమ వలసదారులు మాత్రం తమ వివరాలేవీ బయటపెట్టరని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము మళ్లీ విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని విరుచుకుపడ్డారు. మైనారిటీలపై పాకిస్తాన్‌ చూపే వివక్షను ఎండగట్టే అవకాశం వచ్చిందని, అయితే, ఇక్కడి విపక్షాల విభజన రాజకీయాల వల్ల ఆ అవకాశం కోల్పోయామని వ్యాఖ్యానించారు.

భిన్నత్వంలో ఏకత్వం
‘భిన్నత్వంలో ఏకత్వం.. భారతదేశ విశిష్టత’ అని నినదిస్తూ ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. అభివృద్ధిలో తన ట్రాక్‌ రికార్డును చూడాలని, విపక్షాల టేప్‌ రికార్డులను వినవద్దని ముస్లింలకు సూచించారు. నిరసనల సందర్భంగా పోలీసుల తీరును ప్రధాని  ప్రశంసించారు. వారెప్పుడు ప్రజలకు సహాయకారులుగానే ఉంటారన్నారు.

‘భయాందోళనలకు కారణం హోంమంత్రే’
సీఏఏపై అపోహలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ స్పందించింది. భయాందోళనలకు కారణం తాము కాదని, హోం మంత్రి అమిత్‌ షానేనని సమాధానమిచ్చింది. సీఏఏ తరువాత ఎన్నార్సీనేనని అమిత్‌ షా పార్లమెంట్లోనే ప్రకటించారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ గుర్తు చేశారు. భారత్‌లో డిటెన్షన్‌ సెంటర్లు లేవని ప్రధాని చెప్పడాన్ని శర్మ తప్పుబట్టారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆదివారం ట్విట్టర్లో విమర్శించారు.

మోదీ సభకు భారీ భద్రత
రామ్‌లీలా మైదానంలో ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభకు అధికారులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. పాత ఢిల్లీలో హింసాత్మక ఆందోళనలు జరిగిన దరియాగంజ్‌కు ఈ ప్రాంగణం ఒక కిలోమీటరు దూరంలోనే ఉండటంతో బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి. డీసీపీ ర్యాంక్‌ అధికారులు 20 మంది, దాదాపు వెయ్యిమంది ఢిల్లీ పోలీసులు, డ్రోన్‌ నిరోధక దళాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement