న్యూఢిల్లీ: గురువారం దేశ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎమ్‌హెచ్‌ఏ) ఫేస్‌బుక్ పేజిలో దర్శనమిచ్చిన ఓ ఫోటోపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజనులయితే కేంద్ర ప్రభుత్వాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇన్ని విమర్శలు మూటగట్టుకోవడానికి ఆ ఫోటోలో ఏముందబ్బా అని చూస్తే.. రెండు విస్కీ బాటిళ్లు, పక్కనే స్నాక్స్ ప్లేట్ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే.. ‘తుఫానుతో దెబ్బతిన్న బెంగాల్‌లో చేపట్టిన సహాయక చర్యలు’ అనే పోస్ట్‌లో ఈ విస్కీ బాటిళ్ల ఫోటో దర్శనమిచ్చింది. ఇంకేముంది.. ఇది చూసిన నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ప్రతి ఒక్కరికి విశ్రాంతి కావాలి. అందుకు నిదర్శనం ఈ ఫోటో’.. ‘ఏంటి ఇదంతా.. ఎవరు బాధ్యత వహించాలి’.. ‘కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్ చేశారు నెటిజనులు. 15 నిమిషాల తర్వాత ఈ ఫోటోను తొలగించారు.
ఈ సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘అనుకోకుండా జరిగిన తప్పిదం ఇది. ఈ రోజు ఓ జూనియర్ ఉద్యోగి ఈ పేజిని ఆపరేట్ చేశాడు. అయితే తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయాల్సిన ఫోటోను.. పొరపాటున ఎమ్‌హెచ్‌ఏ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. మా దృష్టికి రావడంతో వెంటనే దాన్ని తొలగించాము. సదరు ఉద్యోగి రాతపూర్వకంగా క్షమాపణలు కూడా తెలిపాడు’ అన్నారు. ఎమ్‌హెచ్‌ఏ ఫేస్‌బుక్ పేజిని 2.79 లక్షలకు పైగా ప్రజలు అనుసరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment