
పోలీస్ స్టేషన్ ప్రతీకాత్మక చిత్రం
అంతా టెక్నాలజీమయం. వర్చువల్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. నేరాలు ఎంత టెక్నిక్‌తో జరుగుతున్నాయో.. అంతే కౌంటర్ టెక్నాలజీతో వాటిని చేధిస్తున్నారు పోలీసులు. కీలకమైన పోలీసింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సూపర్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ, ఆ వ్యవస్థను పటిష్టపరిచే అంశంపై మాత్రం పూర్తి దృష్టి పెట్టడం లేదన్న విషయం తెలుసా?. దేశంలో పోలీసు వ్యవస్థ దీనస్థితిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ) నివేదిక వెల్లడించింది తాజాగా..
కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (PSC) ఈ నివేదిక రూపొందించింది. తాజాగా ఈ కమిటీ హోం వ్యవహారాల శాఖకు సమర్పించిన నివేదికలో.. దేశంలో 257 పోలీస్ స్టేషన్లకు ఇప్పటివరకు వాహనాలే లేవట. మరో 638 పోలీస్ స్టేషన్లకు కనీసం టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇక 143 పోలీస్ స్టేషన్లకు వైర్లెస్, సెల్‌ఫోన్ లాంటి సౌకర్యాలు లేవని ఈ కమిటీ వెల్లడించింది. పనిలో పనిగా మోడ్రన్ పోలీసింగ్ వ్యవస్థకు బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరమని, త్వరగతిన స్పందన కోసం వాహన వ్యవస్థ సమకూరాలని, అత్యాధునిక ఆయుధాల అవసరమూ ఉందని ఈ కమిటీ అభిప్రాయపడింది.
21వ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ బలంగా లేకపోవడం మంచిది కాదు, ఆయా రాష్ట్రాలకు ఇంసెన్సిటివ్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే జమ్ము కశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వైర్ లెస్ సేవల కొరత మంచిది కాదని తెలిపింది. ఇక పలు రాష్ట్రాల విషయంలో హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖకు కీలక సూచనలు చేసిన ఈ కమిటీ.. కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో అవసరమైన చర్యలు త్వరగతిన చేపట్టాలని కోరింది. లా అండ్ ఆర్డర్ పరిరక్షించే క్రమంలో సిబ్బందికి గాయాలు కాకుండా ఉండేందుకు రక్షణ కవచాల ఆవశ్యకతను కమిటీ గుర్తు చేసింది. అంతేకాదు ఆయా పోలీస్ స్టేషన్ల తీరుతో జనాలు.. పొరుగు ప్రాంతాల స్టేషన్లను ఆశ్రయిస్తున్నారంటూ ఆసక్తికర అంశాన్ని సైతం ప్రస్తావించింది కమిటీ.
మొత్తం దేశంలోని 16, 833 పోలీస్ స్టేషన్లను పరిశీలించి.. జనవరి 1, 2020 నాటి పరిస్థితుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఈ కమిటీ. అయితే ఈ పరిస్థితుల్లో ఈనాటికీ పెద్దగా మార్పు రాలేదని కమిటీ పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment