సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు, వ్యక్తులకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ సిద్ధమైంది. సైబర్ నేరాల పరిశోధనలో కీలకమైన సైబర్ డేటా అనలిటికల్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు సైబర్ నేరాల పరిశోధన సమర్థంగా జరిగేలా రాష్ట్ర పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అందుకోసం పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది.
రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటూ దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు ఇటీవల పెరిగిపోయాయి. అనేక సైబర్ నేరాల కేసులు పోలీసు స్టేషన్లకు వస్తున్నాయి. ఈ కేసుల పరిశోధనలో సైబర్ నేరగాళ్ల డేటా కీలకం. అందుకోసం జాతీయ స్థాయిలో సైబర్ నేరస్తుల వివరాలతో కూడిన ఆధునిక డేటా అనలిటికల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో దీనిని నెలకొల్పుతారు. సైబర్ నేరాల పరిశోధనలో ఇది సహాయకారిగా ఉంటుంది. అందుకోసం వివిధ రాష్ట్రాల్లోని డాటా సెంటర్లను రాష్ట్ర పోలీసు అధికారులు పరిశీలించారు.
ఈ సెంటర్ ఏర్పాటయ్యేలోగా నేరస్తుల సమాచార సేకరణకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోని సైబర్ డేటా అనలిటికల్ సెంటర్లతో రాష్ట్ర పోలీసు విభాగాన్ని అనుసంధానించారు. దీనివల్ల జాతీయస్థాయిలో సైబర్ నేరగాళ్ల సమాచారం, ప్రొఫైళ్లు, నేరాలకు పాల్పడే తీరు, కేసుల పరిశోధన రికార్డులు మొదలైనవన్నీ రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకంగా నంబర్, పాస్‌వర్డ్ ఇచ్చారు. వీటి ద్వారా అవసరం మేరకు నేరగాళ్ల సమాచారాన్ని పొందవచ్చు. రాష్ట్రంలో డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పూర్తిస్థాయిలో ఈ కేంద్రం నుంచే మరింత త్వరగా సమాచారం పొందవచ్చు.
సైబర్ సెల్స్ పటిష్టం
సైబర్ నేరాల పరిశోధనకు జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన సైబర్ సెల్స్‌ను మరింత పటిష్టం చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే బీటెక్ అర్హత ఉన్న ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లను నియమించారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బందికి కూడా సైబర్ నేరాల పరిశోధనలో పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం జిల్లాకు ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలతో కూడిన రిసోర్స్ పర్సన్ల బృందాలను ఎంపిక చేశారు. వారికి ఈ నెల 31 నుంచి అనంతపురంలో ఐదు రోజులు శిక్షణ ఇస్తారు. వారు జిల్లాలోని ఇతర సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తారు.
రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలోని నిపుణులు, ఐటీ నిపుణులు ఈ శిక్షణ ఇస్తారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డెస్క్ ఫోరెన్సిక్, మొబైల్ ఫోరెన్సిక్, పాస్‌వర్డ్ రికవరీ, సీడీఆర్ అనాలసిస్, ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్, ప్రోక్సీ ఎర్రర్ ఐడెంటిటీ, ఈ–మెయిల్, సోషల్ మీడియా మొదలైన వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లాస్థాయిలోనే డిజిటల్ ఎవిడెన్స్, సోషల్ మీడియా ఐడెంటిటీ వంటి కీలక సాక్ష్యాధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు పడేలా చేసే అవకాశం ఉంటుంది.
సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థ: కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ
సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ డేటా అనలిటికల్ సెంటర్‌తో పోలీసు స్టేషన్లను అనుసంధానిస్తున్నాం. జిల్లాస్థాయిలో పోలీసు అధికారులకు సైబర్ నేరాల పరిశోధనలో శిక్షణ ఇస్తాం. సైబర్ నేరాల పరిశోధన వ్యవస్థను పటిష్టంగా రూపొందిస్తున్నాం. బాధితులకు అండగా నిలవడంతోపాటు నేరస్తులను గుర్తించి సకాలంలో శిక్షించేలా పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment