మనలో ఎక్కువ మంది ఇంటర్‌నెట్ ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసా?. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడానికి కాదు. యూట్యూబ్‌లో విహరించడానికి కాదు.. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు. ఇంటర్‌నెట్‌లో మీ తొలి ప్రాధాన్యత ఏమిటంటే.. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా 90 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా లేక పలువురు మోసపోతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు సైబర్‌మిత్ర పేరిట ఫేస్‌బుక్, వాట్సాప్ నంబర్‌ను (9121211100 ) సచివాలయంలో హోంమంత్రి సుచరిత శుక్రవారం ఆవిష్కరించారు.
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): ఇంట్లోకి కావాల్సిన వస్తువుల కోసం దుకాణాలకు వెళ్లడం నిన్నటి మాట. నేడు సరాసరి నెట్‌ఇంట్లోకి వెళ్లిపోతున్నారు. చేతిలో అన్ని హంగులు కలిగిన సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అన్ని వస్తువులు కొనేయవచ్చు. ఇంట్లోనే కూర్చొని తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసి, కొనుగోలు చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇలా ఆర్డర్ చేశామో లేదో ఇంటి ముంగిట్లో వచ్చి వాలుతుంది. నాణేనికి రెండు వైపుల బొమ్మ, బొరుసు ఉన్నట్లుగానే సులభ రీతిలో సేవలందిస్తున్న ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించకతప్పదని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వెబ్‌సైట్ భద్రమేనా..?
సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే సంబంధిత వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వకతప్పదు. ఆ సమయంలో సదరు వెబ్‌సైట్ భద్రమైనదేనా అని తనిఖీ చేయడం తప్పనిసరి. వెబ్‌సైట్‌ను టైప్‌చేసేటప్పుడు అడ్రస్ బార్‌ను పరిశీలించాలి. హెచ్‌టీటీపీ అని ఉంటేనే పరిగణించాలి. అలాగే అదే అడ్రస్ బార్‌లో తాళం మూసి ఉన్నట్లుగా గుర్తు ఉండడం అవసరమనే విషయాన్ని గుర్తించాలి.
షాపింగ్ మెయిల్స్‌తో జాగ్రత్త..
మీ ఆన్‌లైన్ లావాదేవీల వివరాల్ని పసిగట్టేందుకు సైబర్ నేరగాళ్లు పసిగట్టేందుకు సైబర్ నేరగాళ్లు షిప్పింగ్ మెయిల్స్ పంపిస్తుంటారు. కన్ఫార్మ్ యువర్ పేమెంట్, పర్చేజ్ అండ్ కౌంట్ డీటేయిల్స్ అంటూ సందేశాలొస్తే అసలు నమ్మొద్దు. ఆపరేటింగ్ సిస్టమ్‌ను తరచూ యాంటివైరస్, యాంటీ స్పైవేర్, ఫైర్‌వాల్ లాంటి భద్రమైన ఫీచర్లతో అప్‌డేట్ చేయాలి.
లింక్‌లు క్లిక్ చేయవద్దు
ఆన్‌లైన్‌లో ఎక్కువగా దేనికోసమైతే ఎక్కువ వెతికామో దానికి సంబంధించిన లింక్‌లు మన కంప్యూటర్‌లోకి వస్తాయి. తమ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేస్తే రాయితీలు, బహుమతులొస్తాయని ఆశ పెడుతుంటారు. పలు సందర్భాల్లో ఆ లింక్‌లు సైబర్‌నేరగాళ్లవి అయి ఉండొచ్చు. అందుకే రాయితీ బహుమతులు నిజమైనవేనా అని ఒరిజినల్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసిన తర్వాత ఆర్డర్ చేయడం మంచిది. తాము ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని వ్యక్తిగత ఖాతా వివరాలను వెల్లడించాలని సూచించి ఆ తర్వాత ఖాతాల్లోని నగదును ఖాళీ చేస్తున్నారు. సైబర్‌నేరాలు పొంచి ఉన్న సందర్భంలో ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి వివరాలు షేర్ చేయవద్దని, బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే ఎటువంటి వివరాలు తెలుపొద్దని ఇలాంటి వారిపై తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
కార్డు వివరాలు సేవ్ చేయవద్దు
తరచూ ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు తప్పిదాలకు పాల్పడుతున్నారు. ప్రతిసారి వెబ్‌సైట్‌లో క్రెడిట్–డెబిట్ కార్డుల వివరాలు నమోదు చేయడం ఎందుకనే కారణంతో సేవ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఆ వివరాలు తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనికి తోడు ప్రతినెలా కార్డు లావాదేవీలు ఏమైనా జరిగాయా మీరు ఏదైనా షాపింగ్ చేశారా అని క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాంటివి జరిగినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే సేవా కేంద్రాన్ని సంప్రదించి, కొత్త కార్డును తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వెంటనే ఆయా వివరాల్ని తొలగించాలి. తప్పనిసరిగా వెబ్ బ్రౌజర్‌లోని కుకిస్‌ను తొలగించిన తర్వాతే కంప్యూటర్‌ను ఆఫ్ చేయాలి. లేదంటే హ్యాకర్లు ఆ వివరాల్ని హ్యాక్ చేసి, కార్డులోని డబ్బులు కొట్టేసేందుకు అవకాశముంది. తరచూ పలు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ ఉంటే గనుక ప్రతి వెబ్‌సైట్‌కు పాస్‌వర్డు పెట్టుకోవడం ఉత్తమం. అలాగే ఎక్కువ కాలం ఒకే పాస్‌వర్డును వినియోగించకుండా తరచూ మార్చేయాలి.
సైబర్ నేరాలపై అవగాహన
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఓటీపీ నంబర్, ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఖాతా వివరాలు నమోదు చేయడం ఆధార్, బ్యాంకు ఖాతాల నెంబర్లు ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. లాటరీలు తగిలాయని, పెద్దమొత్తంలో డబ్బు గెలుచుకున్నారని వచ్చే సమాచారాలకు స్పందించ కూడదు. స్క్రాచ్ కార్డులు పేరిట ప్రముఖ కంపెనీల లెటర్లు, స్క్రాచ్ కార్డులు పంపి, వాటిలో ఖరీదైన కార్లు గెలుచుకున్నారని, టాక్సులు కట్టాలని డబ్బులు తాము సూచించిన అకౌంట్‌లో వేయాలని వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు. అలా చాలా మంది స్పందించి లక్షలాది రూపాయలు నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోజు రోజుకీ సైబర్‌నేరగాళ్లు కొంత పుంతలు తొక్కుతున్నారు. వ్యక్తిగత వివరాలు, ఏటీఎం కార్టు, క్రెడిట్ కార్డు వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. బ్యాంకు అధికారులు కూడా ఎవరి వ్యక్తిగత ఖాతా వివరాలు అడగరు. ఇది గమనించాలి.
–వి.గోపినాథ్, సీఐ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment