woman protection
-
అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు.. మోసపోయిన తర్వాత కానీ..
మోసం చేశాడని చేతుల్లో ముఖం దాచుకుంటే మోసపోయానని తనను తాను హింసించుకుంటే పోయిన కాలం తిరిగి రాదు... జీవితం కూడా. సాంకేతికత మన పురోగతికి సాధనం మాత్రమే. సాంకేతికత మన జీవితాన్ని నిర్దేశించే ఆయుధం కాదు. అది ప్రశ్నించి... పరిహసించే పరిస్థితికి లోనుకావద్దు. ‘అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోతున్నారు’... ఈ మాట పందొమ్మిది వందల అరవైలలో ఉండేది, ఎనభైలలోనూ ఉండేది. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ వింటున్నాం. ‘మోసపోతున్నది అమ్మాయిలేనా అబ్బాయిలు మోసపోవడం లేదా, మోసం చేస్తున్నది అబ్బాయిలేనా మోసం చేస్తున్న అమ్మాయిలు లేరా’ అనే కౌంటర్ వాదన కూడా అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది... తేడా అంతా మోసపోతున్న తీరులోనే. టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగంతో పాటు దుర్వినియోగమూ ఎక్కువైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వేగం వచ్చింది, మోసం చేయడం సులువైంది. సోషల్ మీడియా ఇద్దరి జీవితాలను నిర్దేశించే స్థాయికి వెళ్లిందంటే... ఆ తప్పు టెక్నాలజీది కాదు, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మనిషిదే. అమ్మాయిలు తమకు చట్టపరమైన రక్షణ ఉందా లేదా అనే ఆలోచన లేకుండా తమకు తాముగా జీవితాన్ని అభద్రతవలయంలోకి నెట్టివేసుకుంటున్నారని చెప్పారు సీనియర్ న్యాయవాది పార్వతి. ‘‘మా దగ్గరకు వచ్చే మహిళలనే గమనిస్తే... ఒకప్పుడు ఎక్కువ శాతం భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు, గృహహింస కారణాలతో వచ్చేవారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని కూడా వచ్చేవారు. ఇప్పుడు ‘కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, ఇప్పుడు మొహం చాటేశాడనే కేసులు ఎక్కువయ్యాయి. ఇలాంటి కేసుల వివరాల్లోకి వెళ్తే ఆ ఇద్దరి మధ్య పరిచయానికి వేదిక సోషల్ మీడియానే అయి ఉంటోంది. ముఖాముఖి కలవడానికి ముందే ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలనూ షేర్ చేసుకుని ఉంటున్నారు. సరిగ్గా ఇక్కడే అమ్మాయిలు గమనించాల్సింది, జాగ్రత్త పడాల్సిందీ. ఎందుకంటే... అబ్బాయిలు మాటల్లో పెట్టి అమ్మాయిల వివరాలన్నీ తెలుసుకుంటున్నారు, తన గురించిన వివరాలను చాలా జాగ్రత్తగా ఇస్తారు. అతడు మొహం చాటేశాక, అతడి గురించి ఈ అమ్మాయిలను ఏ వివరం అడిగినా తెల్లమొహం వేస్తారు. ‘అన్ని వివరాలనూ షేర్ చేస్తున్నామని చెప్పారు కదా, అతడి గురించి నువ్వు తెలుసుకున్న దేంటి?’ అని అడిగినప్పుడు అమ్మాయిలు చెప్పే వివరాల్లో అతడి అభిరుచులు, ఇష్టమైన క్రీడాకారులు, అతడు చూసిన సినిమాలు, జీవితం పట్ల అతడి ఆకాంక్ష లు, చదివిన పుస్తకాలు... ఇలా ఉంటుంది జాబితా. అతడి ఉద్యోగం, చదువు, ఊరు, అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల వివరాలు... ఏమీ చెప్పలేరు. ఒకవేళ అప్పటికే పెళ్లయిన వాడా అని కూడా తెలుసుకోరు. అతడు ఫోన్ నంబర్ మార్చేస్తే ఇక ఏ రకంగానూ అతడిని ట్రేస్ చేయలేని స్థితిలో ఉంటుంది పరిస్థితి. అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు! అమ్మాయిలు మాత్రం తనతో పాటు ఇంట్లో అందరి ఫొటోలు షేర్ చేయడం, ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పేర్లు, ఉద్యోగం, బ్యాంకు బాలెన్స్, నగలు... అన్నీ చెప్పేసి ఉంటారు.‘పరిచయమైన వ్యక్తి ఫోన్ చేసి పలకరించేటప్పుడు చాలా సాధారణమైన మాట ‘భోజనం చేశావా’ అని అడిగితే దానిని తన మీదున్న కన్సర్న్ అని మురిసిపోతారు. తనకు సమయానికి అన్నం వండి పెట్టిన అమ్మ, తనకు అన్నీ అమర్చి పెడుతున్న నాన్న ఆ పనులన్నీ తన మీద ప్రేమతోనే చేస్తున్నారనే ఆలోచన రావడం లేదు. అతడి నుంచి ‘గుడ్‌నైట్’ మెసేజ్ వస్తుంది, దానికి అమ్మాయి నుంచి వెంటనే రిప్లయ్ వస్తే ‘ఇంకా నిద్రపోలేదా’ అని అడుగుతాడు. ఇవన్నీ చెప్పి.. ‘నా మీద అంత ప్రేమగా ఉండేవాడు. మా అమ్మానాన్నల కంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయి ఇద్దరం సహజీవనంలో ఉన్నాం’ అని చెబుతారు. అవతలి వ్యక్తి పెళ్లి ప్రస్తావన రానివ్వకుండా జాగ్రత్తపడిన విషయం మోసపోయిన తర్వాత కానీ అమ్మాయిలకు తెలియడం లేదు. ఈలోపు అమ్మాయి బ్యాంకు బాలెన్స్, నగలు ఖర్చయిపోయి ఉంటాయి. శ్రద్ధావాకర్ కేసులో దారుణం జరిగింది కాబట్టి సమాజం దృష్టిలోకి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాలేదనే మాటే కానీ మోసపోయి... న్యాయపోరాటం చేయలేక, ఆవేదనతో మానసికంగా కృంగిపోతున్న వాళ్లు ఎందరో’’ అని చెప్పారు లాయర్ పార్వతి. వంచనకు సాధనం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమ పేరుతో వంచించడానికి సోషల్ మీడియాను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడితే ఒకసారికి కాకపోయినా ఐదారు దఫాలు మాట్లాడిన తర్వాతకైనా ముసుగు జారిపోతుంది. ఇక ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్‌లో అవతలి వ్యక్తి మనోభావాలను పసిగట్టడం సాధ్యం కానే కాదు. మోసపోతున్నది అమ్మాయిలు మాత్రమే అని కాదు, మోసపోతున్న వాళ్లలో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటున్నారు. ఒకప్పుడు కలం స్నేహాలు ఎక్కడో ఉన్న ఇద్దరు వ్యక్తులను అనుసంధానం చేసేవి. అవి పరస్పరం అభిప్రాయాలు, అభిరుచులను షేర్ చేసుకోవడానికే పరిమితమయ్యేవి. సోషల్ మీడియా స్నేహాలు జీవితాలను నిర్దేశిస్తున్నాయి, తప్పుదారిలో నడిపిస్తున్నాయంటే... ఆ తప్పు సాంకేతికతది కాదు. మెదడు ఉన్న, విచక్షణ ఉండాల్సిన మనిషిదే. – వాకా మంజులారెడ్డి చట్టాలున్నాయి...కానీ! పెళ్లి చేసుకున్న మహిళకు చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉందో, సహజీవనం విషయంలో కూడా అలాంటి రక్షణను కల్పించింది చట్టం. అయితే సహజీవనాన్ని నిరూపించుకోవాలి. చాలా సందర్భాల్లో నిరూపణ కష్టమవుతోంది. ఆ ఇద్దరూ ఒకే కప్పు కింద జీవించారని చుట్టుపక్కల వాళ్లు సాక్ష్యం చెప్పాలి. అలాగే ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ వంటి సాంకేతిక ఆధారాలను చూపించవచ్చు. కానీ న్యాయస్థానం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించడం లేదు, సెకండరీ ఎవిడెన్స్‌గా మాత్రమే తీసుకుంటుంది. సహజీవనాన్ని నిరూపించలేని పరిస్థితుల్లో ‘క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్’ కేసులు పెట్టవచ్చు. కానీ అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు, సమాజానికి భయపడి ఈ పని చేయలేకపోతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసులు పెట్టి జీవితంలో మరింత అల్లకల్లోలంలోకి వెళ్లడానికి ఇష్టపడరు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడమే చెప్పదగిన సూచన. పుట్టిన రోజుకి ఫ్లవర్ బొకేలు పంపించినంత మాత్రాన అతడిది సంపూర్ణమైన ప్రేమ అనే భ్రమలోకి వెళ్లవద్దు. – ఈమని పార్వతి, హైకోర్టు న్యాయవాది -
భద్రతకు భరోసా
-
దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం సహించదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కాగా, ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదవండి: (2023 ఖరీఫ్‌కు పోలవరం) -
మహిళల రక్షణ చేతల్లో చూపించిన సీఎం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : ఎన్నో సంవత్సరాలుగా మహిళ రక్షణ, భద్రత కోసం నేతలు చెబుతున్న మాటలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతల ద్వారా నిజం చేశారని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రశంసించారు. ఒక దళిత మహిళను హోం మంత్రి చేయడం ద్వారా సీఎం మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం దిశ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు అండగా ఉండేలా దిశ చట్టాన్ని కానుకగా తీసుకువచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందని చెప్పారు. మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో జరిగింది తమకెందుకులే.. అని అనుకోకుండా రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అటువంటి అన్యాయం జరగకుండా ఉండాలని ఈæ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాలను ఆరికట్టడానికి సీఎం దిశ చట్టాన్ని తీసుకువచ్చారని, రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక ప«థకాలకు మంచి స్పందన లభించిందన్నారు. చరిత్రగా నిలిచిపోతుంది.. ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం తీసుకురావడం ఒక చరిత్రగా నిలిచిపోతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 1349 పోలీసుస్టేషన్లు ఒక యూనిట్‌గా పని చేస్తాయన్నారు. అంతర్జాతీయంగా కూడా చాలా అరుదైన చట్టంగా నిలుస్తుందన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకు వచ్చిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టెక్నికల్ సర్వీస్) జి.పాలరాజ్ పేర్కొన్నారు. ఐపీసీలో 354(ఇ) సెక్షన్‌ను చేర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు సుభాష్‌చంద్రబోస్, పుష్ప శ్రీవాణి, మంత్రులు మోపిదేవి, పినిపే విశ్వరూప్, కన్నబాబు, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, నందిగం సురేష్, చింతా అనురాధ, వంగా గీత, గొడ్డేటి మాధవి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, కంగాటి శ్రీదేవి, రజిని, పద్మావతి, ఉషా శ్రీచరణ్, జక్కంపూడి రాజా, సీఎం ప్రోగ్రామ్స్ సమన్వయ కర్త తలశిల రఘురాం, మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, దిశ ప్రత్యేకాధికారులు దీపికా పటేల్, కృతికా శుక్లా, నన్నయ వీసీ జగన్నాథరావు, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నెట్టేట ముంచుతారు
మనలో ఎక్కువ మంది ఇంటర్నెట్ ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసా?. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడానికి కాదు. యూట్యూబ్‌లో విహరించడానికి కాదు.. ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు. ఇంటర్నెట్లో మీ తొలి ప్రాధాన్యత ఏమిటంటే.. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా 90 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా లేక పలువురు మోసపోతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు సైబర్‌మిత్ర పేరిట ఫేస్బుక్, వాట్సాప్ నంబర్‌ను (9121211100 ) సచివాలయంలో హోంమంత్రి సుచరిత శుక్రవారం ఆవిష్కరించారు. సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): ఇంట్లోకి కావాల్సిన వస్తువుల కోసం దుకాణాలకు వెళ్లడం నిన్నటి మాట. నేడు సరాసరి నెట్ఇంట్లోకి వెళ్లిపోతున్నారు. చేతిలో అన్ని హంగులు కలిగిన సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్లో అన్ని వస్తువులు కొనేయవచ్చు. ఇంట్లోనే కూర్చొని తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసి, కొనుగోలు చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇలా ఆర్డర్ చేశామో లేదో ఇంటి ముంగిట్లో వచ్చి వాలుతుంది. నాణేనికి రెండు వైపుల బొమ్మ, బొరుసు ఉన్నట్లుగానే సులభ రీతిలో సేవలందిస్తున్న ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించకతప్పదని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వెబ్సైట్ భద్రమేనా..? సాధారణంగా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే సంబంధిత వెబ్సైట్లోకి లాగిన్ అవ్వకతప్పదు. ఆ సమయంలో సదరు వెబ్సైట్ భద్రమైనదేనా అని తనిఖీ చేయడం తప్పనిసరి. వెబ్‌సైట్‌ను టైప్చేసేటప్పుడు అడ్రస్ బార్‌ను పరిశీలించాలి. హెచ్‌టీటీపీ అని ఉంటేనే పరిగణించాలి. అలాగే అదే అడ్రస్ బార్లో తాళం మూసి ఉన్నట్లుగా గుర్తు ఉండడం అవసరమనే విషయాన్ని గుర్తించాలి. షాపింగ్ మెయిల్స్‌తో జాగ్రత్త.. మీ ఆన్లైన్ లావాదేవీల వివరాల్ని పసిగట్టేందుకు సైబర్ నేరగాళ్లు పసిగట్టేందుకు సైబర్ నేరగాళ్లు షిప్పింగ్ మెయిల్స్ పంపిస్తుంటారు. కన్ఫార్మ్ యువర్ పేమెంట్, పర్చేజ్ అండ్ కౌంట్ డీటేయిల్స్ అంటూ సందేశాలొస్తే అసలు నమ్మొద్దు. ఆపరేటింగ్ సిస్టమ్‌ను తరచూ యాంటివైరస్, యాంటీ స్పైవేర్, ఫైర్‌వాల్ లాంటి భద్రమైన ఫీచర్లతో అప్డేట్ చేయాలి. లింక్‌లు క్లిక్ చేయవద్దు ఆన్లైన్లో ఎక్కువగా దేనికోసమైతే ఎక్కువ వెతికామో దానికి సంబంధించిన లింక్‌లు మన కంప్యూటర్లోకి వస్తాయి. తమ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తే రాయితీలు, బహుమతులొస్తాయని ఆశ పెడుతుంటారు. పలు సందర్భాల్లో ఆ లింక్‌లు సైబర్నేరగాళ్లవి అయి ఉండొచ్చు. అందుకే రాయితీ బహుమతులు నిజమైనవేనా అని ఒరిజినల్ వెబ్సైట్లో తనిఖీ చేసిన తర్వాత ఆర్డర్ చేయడం మంచిది. తాము ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని వ్యక్తిగత ఖాతా వివరాలను వెల్లడించాలని సూచించి ఆ తర్వాత ఖాతాల్లోని నగదును ఖాళీ చేస్తున్నారు. సైబర్‌నేరాలు పొంచి ఉన్న సందర్భంలో ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి వివరాలు షేర్ చేయవద్దని, బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే ఎటువంటి వివరాలు తెలుపొద్దని ఇలాంటి వారిపై తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కార్డు వివరాలు సేవ్ చేయవద్దు తరచూ ఆన్లైన్ షాపింగ్ చేసే వారు తప్పిదాలకు పాల్పడుతున్నారు. ప్రతిసారి వెబ్సైట్లో క్రెడిట్–డెబిట్ కార్డుల వివరాలు నమోదు చేయడం ఎందుకనే కారణంతో సేవ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఆ వివరాలు తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనికి తోడు ప్రతినెలా కార్డు లావాదేవీలు ఏమైనా జరిగాయా మీరు ఏదైనా షాపింగ్ చేశారా అని క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాంటివి జరిగినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే సేవా కేంద్రాన్ని సంప్రదించి, కొత్త కార్డును తీసుకోవాలి. ఆన్లైన్లో కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వెంటనే ఆయా వివరాల్ని తొలగించాలి. తప్పనిసరిగా వెబ్ బ్రౌజర్లోని కుకిస్ను తొలగించిన తర్వాతే కంప్యూటర్ను ఆఫ్ చేయాలి. లేదంటే హ్యాకర్లు ఆ వివరాల్ని హ్యాక్ చేసి, కార్డులోని డబ్బులు కొట్టేసేందుకు అవకాశముంది. తరచూ పలు వెబ్సైట్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటే గనుక ప్రతి వెబ్‌సైట్‌కు పాస్‌వర్డు పెట్టుకోవడం ఉత్తమం. అలాగే ఎక్కువ కాలం ఒకే పాస్వర్డును వినియోగించకుండా తరచూ మార్చేయాలి. సైబర్ నేరాలపై అవగాహన సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఓటీపీ నంబర్, ఆన్లైన్లో వ్యక్తిగత ఖాతా వివరాలు నమోదు చేయడం ఆధార్, బ్యాంకు ఖాతాల నెంబర్లు ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. లాటరీలు తగిలాయని, పెద్దమొత్తంలో డబ్బు గెలుచుకున్నారని వచ్చే సమాచారాలకు స్పందించ కూడదు. స్క్రాచ్ కార్డులు పేరిట ప్రముఖ కంపెనీల లెటర్లు, స్క్రాచ్ కార్డులు పంపి, వాటిలో ఖరీదైన కార్లు గెలుచుకున్నారని, టాక్సులు కట్టాలని డబ్బులు తాము సూచించిన అకౌంట్లో వేయాలని వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు. అలా చాలా మంది స్పందించి లక్షలాది రూపాయలు నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోజు రోజుకీ సైబర్‌నేరగాళ్లు కొంత పుంతలు తొక్కుతున్నారు. వ్యక్తిగత వివరాలు, ఏటీఎం కార్టు, క్రెడిట్ కార్డు వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. బ్యాంకు అధికారులు కూడా ఎవరి వ్యక్తిగత ఖాతా వివరాలు అడగరు. ఇది గమనించాలి. –వి.గోపినాథ్, సీఐ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్, విశాఖపట్నం -
స్త్రీ రక్షణ ఇంకా ముఖ్యం
అది ఢిల్లీలోని ఇండియా గేట్. అక్కడ ఒక స్త్రీ ఆవు మాస్క్ ధరించి నిలబడింది. దానిని అతడు ఫొటో తీశాడు. కలకత్తాలోని హౌరాబ్రిడ్జ్. అక్కడ మరో స్త్రీ ఆవు మాస్క్ ధరించి నిలబడింది. దానిని అతడు ఫొటో తీశాడు. ముంబైలో అరేబియా సముద్రం ఎదురుగా నిలుచుని ఉన్న ఆవు మాస్క్ స్త్రీ ఫొటోను కూడా అతడు తీశాడు.ఈ మూడు చోట్ల అనే ఉంది... దేశమంతా తిరుగుతూ దేశంలోని అన్ని ప్రాంతాలలో ఆవు మాస్క్ ధరించిన స్త్రీలను సుజాత్రో ఘోష్ అనే ఆ 23 ఏళ్ల కుర్రవాడు ఫొటో తీయదలుచుకున్నాడు. తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టదలుచుకున్నాడు. ఎందుకు?దేశమంతా స్త్రీలు ఉన్నారు గనుక.అయితే?వారి మీద అత్యాచారాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి కనుక.దానికి ఇలాంటి నిరసన ఎందుకు? దేశంలో స్త్రీ రక్షణ కంటే మిన్నగా మత విశ్వాసాలు ముందుకొచ్చాయి. స్త్రీను కాపాడుకోవడంలో కంటే మత విశ్వాసాన్ని కాపాడుకోవడంలో మెజారిటీ సమాజం, రాజకీయ పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. స్త్రీ మీద అత్యాచారం జరిగితే అరెస్టులు, శిక్షలు తేలడానికి ఏళ్లు పడుతుంది. కాని మత విశ్వాసాల విషయాలలో ఆఘమేఘాల మీద చట్టాలు, ఆర్డినెన్స్‌లు జారీ అయిపోతున్నాయి. ‘ఇది సరికాదు’ అంటాడు సుజాత్రో ఘోష్.కలకత్తా నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడిన ఈ ఫొటోగ్రాఫర్ దేశంలో జరుగుతున్న అత్యాచారాల పై కలత చెందాడు. తన వంతుగా సృజనాత్మకంగా నిరసన తెలియ చేయాలనుకున్నాడు. ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు మాస్క్ కొని తెలిసిన స్త్రీకి తొడిగి ఒక ఫొటో తీశాడు. ఆ ఫొటో చూశాక అతడికి తన నిరసన విధానం ఏమిటో తెలిసి వచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతాలలో వివిధ స్త్రీలను ఆవు మాస్క్‌తో ఫొటోలు తీసి స్త్రీ రక్షణ పట్ల సమాజం, ప్రభుత్వాలు చైతన్యవంతం అవడానికి కృషి చేస్తున్నాడు.ఈ ప్రయత్నం అతణ్ణి పాపులర్ చేస్తోంది. అయితే ఊహించినట్టుగానే కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కొడతాం, చంపుతాం అని మెసేజ్‌లు పెట్టినవారు కూడా ఉన్నారు. కాని వేలాది మంది స్త్రీలు కుల, మతాల ప్రమేయం లేకుండా తన నిరసన విధానానికి మద్దతు పలకడం చూసి సుజాత్రో ధైర్యంగా ఉన్నాడు.మంచి పనికి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. నా నిరసన ఆగదు అన్నాడతను.‘‘గోవు పట్ల సమాజంలో ఉన్న మనోభావాలకు విలువ ఇవ్వాల్సిందే. కాని గోవు కంటే ముందు స్త్రీ మాన ప్రాణమే ముఖ్యం అని భావించే సమాజాన్ని కూడా ఆశించడం అవసరమని ఇటీవలి అత్యాచార ఉదంతాలు నిరూపిస్తున్నాయి కదూ’’ అంటాడు సుజాత్రో. -
సినీ మహిళల కోసం అసోసియేషన్
పెరంబూరు: సినీ మహిళా సంరక్షణ కోసం ఒక అసోసియేషన్ ప్రారంభం కానుంది. సౌత్ ఇండియన్ ఫిలిం ఉమెన్స్ అసోసియేషన్ పేరుతో మే ఒకటవ తేదీన ప్రారంభించనున్నట్లు వైశాలి సుబ్రమణియన్ గురువారం వెల్లడించారు. దీని గురించి ఆమె తెలుపుతూ సినీరంగంలో మహిళల సంక్షేమం కోసం ఈ అసోసియేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అసోసియేషన్‌కు తాను అధ్యక్షురాలిగానూ, వీపీ.ఈశ్వరి కార్యదర్శకురాలుగానూ, ఎస్.మీనా మరుదాసి ఉపకార్యదర్శిగానూ, ఎం.గీత కోశాధికారిగానూ, ఎంజల్ సామ్రాజ్ ఉపాధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వమించనున్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణికి తెలియజేయగా మంచి ప్రయత్నం అమలు ప్రారంభించండి అని ప్రోత్సహించారని చెప్పారు. అదే విధంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఛాయాగ్రాహకుల సంఘం అధ్యక్షుడు పీసీ.శ్రీరామ్ తమ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారని తెలిపారు. మే ఒకటవ తేదీన జరగనున్న ఈ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకకు చిత్రపరిశ్రమకు చెందిన 24 శాఖలకు చెందిన ప్రముఖులతో పాటు పీసీ.శ్రీరామ్, నటుడు సత్యరాజ్, నటి రోహిణి, రేవతి, సచ్చు, పుష్కర్గాయత్రి విశ్చేయనున్నారని తెలిపారు. అదేవిధంగా తమ సౌత్ ఇండియన్ ఫిలిం ఉమెన్స్ అసోసియేషన్‌లో సినీపరిశ్రమకు చెందిన మహిళలందరూ సభ్యులుగా చేరాలని వైశాలి సుబ్రమణియన్ తెలిపారు. -
అమ్మాయే మనకు ముఖ్యం పరువు అనే ఆలోచనే వద్దు
ప్రశ్నః మాది ప్రకాశంజిల్లా. నా చిన్న కూతురు మా వూర్లోనే ఉండే మా బంధువుల అబ్బాయి మాయలోపడి అతనితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ దిగులుతో నా భర్త ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. మైనర్‌గా ఉన్నప్పుడే అతనిని పెళ్లిచేసుకుంటానని మా అమ్మాయి మమ్మల్ని అడిగితే... ‘నీదింకా చిన్నవయసు. పెళ్లీడు కూడా రాలేదు. ముందు చదువుకొమ్మ’ని చెప్పాం. అతనికి ఏ ఉద్యోగమూ లేదు. నిన్నెలా పోషిస్తాడంటూ ఆమెను సర్దిచెప్పే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత కూడా ఆ అబ్బాయి మా అమ్మాయి వెంటపడటం ఆపలేదు. మా అమ్మాయికి కూడా చదువు మీద శ్రద్ధ పోయింది. ఎంతో కష్టపడి బతికేవాళ్లం. పెద్దమ్మాయిని టెంత్తోనే ఆపేయించాం. కనీసం ఈ అమ్మాయినైనా చదివించాలనుకున్నాం. కానీ మమ్మల్ని కాదని అతని వెంట వెళ్లిపోయింది. సమస్య అది కాదు. అమ్మాయి అతనితో వెళ్లిపోయి 9 నెలలు కావస్తోంది. కానీ ఇంత వరకూ అతను పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు వాళ్లింటికి కూడా తీసుకురాకుండా మా వూరికి 15 కి.మీ. దూరంలో ఉన్న టౌన్లో ఉంచాడని విన్నాం. ఈ మధ్య అబ్బాయి వాళ్లమ్మానాన్న అతనికి వేరే సంబంధాలు వెతుకుతున్నారని తెలిసింది. ఇదేంటని అడిగితే ‘ఐదు లక్షలిస్తే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’నని రాయబారం పంపాడు. అయితే ఈ మధ్యే మా అమ్మాయికి అబార్షన్ కూడా చేయించాడని తెలిసింది. అమ్మాయి ఆరోగ్యం ఎలావుందోననే బెంగ ఒకవైపు, నా భర్తపోయిన దిగులు మరోవైపు... నాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఒకవైపు లోకం కాకై పొడుస్తోంది. బయటకెళ్లాలంటే నరకంగా ఉంది. కనీసం వాళ్లిద్దరూ కలిసి ఏదో కష్టం చేసుకొని బతుకుతారనుకుంటే వాళ్ల తల్లీదండ్రీ వేరే సంబంధాలు వెతుకుతున్నారు. ఆ అబ్బాయిని నమ్మి వెళ్లినందుకు నా కూతురి జీవితం నా కళ్ల ముందే నాశనం అవుతున్నా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా సమస్యకు పరిష్కారం చూపి, నా బిడ్డ జీవితాన్ని కాపాడండి. – ఒక అభాగ్యురాలు జ: వుమన్ ప్రొటెక్షన్ సెల్లో కంప్లెయింట్ చేయాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. కానీ ఇటువంటి కేసుల్లో ఇది అంత తేలిక కాదు. నా అనుభవంలో చాలా కేసులు చూసాను. బలవంతంపైన పెళ్లి చేసుకున్నా, రేపు సరిగ్గా ఉంటాడన్న నమ్మకం లేదు. వద్దు వద్దు అంటే బలవంతంగా పెళ్లి చేయడం అనవసరం. కానీ, చేసిన ద్రోహానికి అతను శిక్ష అనుభవించితీరక తప్పదు. ముందు ఆ అమ్మాయిని అతని కస్టడీలోంచి బయటపడేయాలి. లేదంటే చాలా ప్రమాదం. ఆమెకి అబార్షన్ అయినంత మాత్రాన ఏదో కొంపమునిగిపోయినట్టు భావించాల్సిన పనిలేదు. సామాజిక గౌరవాలూ, పరువూ అంటూ మోరలిస్టిక్గా ఆలోచించడం మానుకొని, ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయాలి. అంతేగానీ ఒకసారి బయటకు Ðð ళ్లింది కాబట్టి అతడితోటే ఉండాలని అనుకోవద్దు. అమ్మాయి చిన్న పిల్ల. అతనితో వెళ్లాకకానీ అతని స్వభావం తెలియలేదు. యిప్పుడు నీతిబోధల కంటే ఆ అమ్మాయి ప్రాణాలు ముఖ్యం. తక్షణమే ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకోండి. అందుకే పిల్లలకు మంచి చెడులను గుర్తించే జ్ఞానాన్నివ్వాలి. తమంత తాము నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా అది పనికివస్తుంది. – కల్పన కన్నాభిరాన్, డైరెక్టర్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ -
నారీమణులకు రక్ష
తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో మహిళల రక్షణే ధ్యేయంగా ఎస్పీ అభిషేక్ మొహంతి చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న షీటీం, రక్షక్ బృందాలకు తోడుగా యాంటీ ర్యాపిడ్ యాక్షన్ టీంలను నియమిస్తున్నారు. దీంతో తిరునగరంలో మహిళలకు మరింత భద్రత లభించనుంది. తిరుపతిక్రైం: ‘నేను స్కూల్‌కు వెళుతుంటే .. ఓ వ్యక్తి వారం రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపుల మరీ ఎక్కువయ్యాయి.. పోకిరీల బారి నుంచి నన్ను కాపాడండి’ అంటూ ఓ బాలిక డయల్ 100కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న ఓ బృందం రంగంలోకి దిగింది. సదరు ఆ విద్యార్థినిని అనుసరించింది. ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టి సమర్థవంతంగా పోకిరీలకు చెక్‌పెట్టింది. ఇప్పటి వరకు తిరుపతి అర్బన్ జిల్లాలో షీటీమ్, రక్షక్ టీమ్‌లు మహిళల రక్షణ చర్యలు చేపట్టేవి. వీటికితోడు ఇప్పుడు కొత్తగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇకపై అర్బన్ జిల్లాలో ఈ టీమ్ కూడా మహిళలకు అందుబాటులో ఉంటుంది. మహిళలపై వేధింపులు ఇతరత్రా నేరాలు పెరగడంతో భద్రతలో భాగంగా పోలీసు విభాగం మహిళల భద్రత కోసం కొత్త విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలు సుమారు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సుమారు 30 శాతం వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. మహిళలను వేధిస్తున్నవారిలో యువకులు, విద్యార్థులతో పాటు ఉద్యోగులూ ఉన్నారు. ఇందులో 30 నుంచి 50 ఏళ్ల పురుషులు ఎక్కువమంది ఉంటున్నారు. షీ టీమ్ పనితీరు ఇలా జిల్లా కేంద్రమైన ప్రధాన బస్టాండులో కాలేజీలు, ఆటోలల్లో ఇతర ప్రాంతాల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో షీటీమ్‌లు నిఘాపెడుతున్నాయి. సిటీ బస్సుల్లో కాలేజ్ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులతో షీ బృందాలు కలసిపోతున్నాయి. ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తారు. పోకిరీలు రెచ్చిపోగానే సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించి వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. తమను ఎవరినీ వేధించడంలేదంటూ నిందితులు తప్పించుకునే వీలులేకుండా కెమెరా దృశ్యాల సాక్ష్యంగా చూపిస్తున్నారు. తొలిసారి చిక్కితే కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. మరోసారి తప్పు చేయనని లిఖిత పూర్వకంగా రాయించుకుని వదలిపెడుతున్నారు. రెండవ సారి మహిళలను వేధిస్తూ చిక్కితే వెంటనే వారిపై వివిధ సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కూడా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వాట్సప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు డయల్ 100కు ఫోన్ చేసినా మెసేజ్ పంపినా షీ బృందాలకు సమాచారం అందిస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ప్రధాన ప్రాంతాలైన బస్టాండులు, కాలేజీ అడ్డాలలో షీటీమ్‌లు మాటు వేస్తాయి. పోకిరీలను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తున్నాయి. మహిళా రక్షక్ : నిరంతరం మహిళల భద్రత కోసం వాహనాల్లో నగర శివార్లు, చిన్న చిన్న గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. ఏదైనా మహిళలపై అవాంఛనీయ సంఘటనలు జరిగినా, చిన్నపిల్లలను వేధించినా, బాల్య వివాహాలకు ప్రయత్నించినా ఈ టీమ్‌లు వెంటనే వారికి బుద్ధి చెబుతాయి. ఎప్పకప్పుడు జరిగిన సంఘటనలు ఉన్నతాధికారులకు తెలుపుతూ వారి సూచనల మేరకు నడుచుకుంటూ ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. అంతేగాకుండా గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో స్కూళ్లకు నిలిచిపోయిన విద్యార్థులను స్కూళ్లకు తరలించడం, బడిఈడు పిల్లలు పనులకు వెళుతుంటే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి గృహాలకు తరలించడం తదితర మహిళల భద్రత కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అండగా ఉంటున్నాయి. నూతనంగా మహిళా రెస్పాన్స్ టీమ్ మహిళలకు అత్యాధునిక భద్రత కల్పించేందుకు అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో నూతనంగా మహిళా రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా వెంటనే వీరు పరిష్కరిస్తారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, మహిళలను వేధించినా, బాధపెట్టినా, వరకట్న వేధింపులకు పాల్పడినా, బాల్య వివాహాలు చేసినా, చిన్న వయస్సులో బాలికలను వ్యభిచార గృహాలకు విక్రయించిన వారి ఆట కట్టించేందుకు ఈ టీమ్ పని చేస్తుంది. ట్రాఫిక్ డీఎస్పీ సుకుమారిని ఇన్చార్జిగా నియమించారు. ఈ టీమ్‌లో 18 మంది మహిళా సిబ్బంది సేవలందించనున్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు మహిళల కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు, విభాగాలు ఉన్నాయి. ఇప్పటికే అర్బన్ జిల్లాలో మహిళల భద్రత కోసం కోసం షీటీమ్, మహిళా రక్షక్ ఉండగా తాజాగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం మహిళలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడమే లక్ష్యంగా ఈ టీమ్‌ను ప్రారంభించడం జరిగింది. మహిళల కోసం ఇప్పటికే పోలీసు వాట్సాప్ 8099999977 ఉంది. ప్రత్యేకంగా 8500069777 అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – మహిళా రక్షక్,రాపిడ్ రెస్పాన్స్ టీమ్ఇన్చార్జి డీఎస్పీ సుకుమారి -
మహిళల రక్షణకు సరికొత్తగా 'సేఫ్టీ పిన్' యాప్
కొత్త కొత్త ఆప్స్ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటివల్ల మొబైల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటోంది. ఇప్పుడు కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి రానుంది. ఈ అప్లికేషన్ తన సర్కిల్లో ఉండేవారికి సమాచారాన్ని షేర్ చేస్తుంది. తోటివారి రక్షణ, సేఫ్టీ గురించి, వారు ఉండే చోటు వంటి వాటి గురించి ఆ గ్రూప్‌లో వారికి ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. ‘సేఫ్టీపిన్’ అనేది మ్యాప్ బేస్డ్ అప్లికేషన్. తమ చుట్టు పక్కన ఉన్నవారితో ఒక సర్కిల్‌గా ఏర్పడి, వారి వివరాలను అందచేసే ఆప్ ఇది. ఈ ఆప్‌లో ఏది పోస్ట్ చేసినా అది ఆ సర్కిల్లో ఉన్నవారి వాల్ ట్యాగ్ మీద కనపడుతుంది. సేఫ్టీపిన్ కో ఫౌండర్ అయిన ఆశిష్ బాబు ఈ ఆప్ గురించి మాట్లాడుతూ, ‘‘ఈ ఆప్ వాడకందార్లు ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకోవచ్చు. రోడ్డు తేడాగా ఉందా, సర్కిల్లోని ఏదైనా ప్రదేశంలో ఇబ్బందులున్నాయా, వీధి దీపాలు పగిలిపోయాయా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఎలా ఉంది... వంటివి తెలుసుకుని, అవి అనువుగా లేనప్పుడు ఆ దారిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది’ అన్నారు. యూజర్లు తమకు నచ్చిన చిత్రాలను ఈ అప్లోడ్ చేయవచ్చు. ఏవైనా ప్రదేశాలు చూసి వచ్చినప్పుడు అక్కడ కలిగే అనుభూతులను, వారి భావాలను విశదపరచవచ్చు. ఇవి ఆ సర్కిల్లో వారికి షేర్ చేయవచ్చు. అది చూసి ఆ సర్కిల్లోని వారంతా వారి కామెంట్లు పొందుపరచవచ్చు. వీటికితోడు, అతి సమీపంగా ఉండే ఫార్మశీ, పోలీస్ స్టేషన్ గురించి కూడా పొందుపరచవచ్చు. ‘సేఫ్టీ పిన్’ తన వాడకందార్లకు ఒక మ్యాప్‌ను ఇచ్చి, నగరంలోని ప్రాంతాలను చూపుతుంది. ప్రమాదకరమైన ప్రాంతాలు వచ్చినప్పుడు రెడ్ కలర్, రక్షణ మధ్యస్థంగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ కలర్తోను, క్షేమకరమైన ప్రాంతాలను ఆకుపచ్చరంగుతోను సూచిస్తుంది. ఈ ఆప్ వాడకందార్లు, అప్పటికప్పుడు పడుతున్న చిత్రహింసను, రక్షణ లోపాలను, అంటే వీధి దీపాలు పగిలిపోయినా, డ్రైనేజీ మూతలు ఓపెన్ అయిపోయి ఉండటం వంటివి తెలుస్తాయి. ‘సేఫ్టీ పిన్ ద్వారా ప్రజలు సమాజరక్షణ విషయంలో పాలుపంచుకోవచ్చు. రోడ్డు మీద ఎవరైనా ఎవరినైనా హింసిస్తున్నా, స్త్రీలు దాడులకు గురవుతున్నా ఆ సర్కిల్లోని వారికి సమాచారం అందుతుంది’ అని కో ఫౌండర్ అయిన కల్పనా విశ్వనాథ్ తెలిపారు. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ మీద దొరుకుతుంది.