అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు.. మోసపోయిన తర్వాత కానీ.. | Social Media Awareness and Sensitisation Need for Women to Prevention of Harassment | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు.. మోసపోయిన తర్వాత కానీ..

Published Wed, Jan 4 2023 7:57 PM | Last Updated on Wed, Jan 4 2023 7:57 PM

Social Media Awareness and Sensitisation Need for Women to Prevention of Harassment - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మోసం చేశాడని చేతుల్లో ముఖం దాచుకుంటే మోసపోయానని తనను తాను హింసించుకుంటే పోయిన కాలం తిరిగి రాదు... జీవితం కూడా. సాంకేతికత మన పురోగతికి సాధనం మాత్రమే. సాంకేతికత మన జీవితాన్ని నిర్దేశించే ఆయుధం కాదు. అది ప్రశ్నించి... పరిహసించే పరిస్థితికి లోనుకావద్దు.

‘అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోతున్నారు’... ఈ మాట పందొమ్మిది వందల అరవైలలో ఉండేది, ఎనభైలలోనూ ఉండేది. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ వింటున్నాం. ‘మోసపోతున్నది అమ్మాయిలేనా అబ్బాయిలు మోసపోవడం లేదా, మోసం చేస్తున్నది అబ్బాయిలేనా మోసం చేస్తున్న అమ్మాయిలు లేరా’ అనే కౌంటర్‌ వాదన కూడా అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది... తేడా అంతా మోసపోతున్న తీరులోనే. టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగంతో పాటు దుర్వినియోగమూ ఎక్కువైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వేగం వచ్చింది, మోసం చేయడం సులువైంది. సోషల్‌ మీడియా ఇద్దరి జీవితాలను నిర్దేశించే స్థాయికి వెళ్లిందంటే... ఆ తప్పు టెక్నాలజీది కాదు, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మనిషిదే. అమ్మాయిలు తమకు చట్టపరమైన రక్షణ ఉందా లేదా అనే ఆలోచన లేకుండా తమకు తాముగా జీవితాన్ని అభద్రతవలయంలోకి నెట్టివేసుకుంటున్నారని చెప్పారు సీనియర్‌ న్యాయవాది పార్వతి.

‘‘మా దగ్గరకు వచ్చే మహిళలనే గమనిస్తే... ఒకప్పుడు ఎక్కువ శాతం భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు, గృహహింస కారణాలతో వచ్చేవారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని కూడా వచ్చేవారు. ఇప్పుడు ‘కొంతకాలం లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండి, ఇప్పుడు మొహం చాటేశాడనే కేసులు ఎక్కువయ్యాయి. ఇలాంటి కేసుల వివరాల్లోకి వెళ్తే ఆ ఇద్దరి మధ్య పరిచయానికి వేదిక సోషల్‌ మీడియానే అయి ఉంటోంది. ముఖాముఖి కలవడానికి ముందే ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలనూ షేర్‌ చేసుకుని ఉంటున్నారు. సరిగ్గా ఇక్కడే అమ్మాయిలు గమనించాల్సింది, జాగ్రత్త పడాల్సిందీ. ఎందుకంటే... అబ్బాయిలు మాటల్లో పెట్టి అమ్మాయిల వివరాలన్నీ తెలుసుకుంటున్నారు, తన గురించిన వివరాలను చాలా జాగ్రత్తగా ఇస్తారు. అతడు మొహం చాటేశాక, అతడి గురించి ఈ అమ్మాయిలను ఏ వివరం అడిగినా తెల్లమొహం వేస్తారు. ‘అన్ని వివరాలనూ షేర్‌ చేస్తున్నామని చెప్పారు కదా, అతడి గురించి నువ్వు తెలుసుకున్న దేంటి?’ అని అడిగినప్పుడు అమ్మాయిలు చెప్పే వివరాల్లో అతడి అభిరుచులు, ఇష్టమైన క్రీడాకారులు, అతడు చూసిన సినిమాలు, జీవితం పట్ల అతడి ఆకాంక్ష లు, చదివిన పుస్తకాలు... ఇలా ఉంటుంది జాబితా. అతడి ఉద్యోగం, చదువు, ఊరు, అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల వివరాలు... ఏమీ చెప్పలేరు. ఒకవేళ అప్పటికే పెళ్లయిన వాడా అని కూడా తెలుసుకోరు. అతడు ఫోన్‌ నంబర్‌ మార్చేస్తే ఇక ఏ రకంగానూ అతడిని ట్రేస్‌ చేయలేని స్థితిలో ఉంటుంది పరిస్థితి.

అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు!
అమ్మాయిలు మాత్రం తనతో పాటు ఇంట్లో అందరి ఫొటోలు షేర్‌ చేయడం, ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పేర్లు, ఉద్యోగం, బ్యాంకు బాలెన్స్, నగలు... అన్నీ చెప్పేసి ఉంటారు.‘పరిచయమైన వ్యక్తి ఫోన్‌ చేసి పలకరించేటప్పుడు చాలా సాధారణమైన మాట ‘భోజనం చేశావా’ అని అడిగితే దానిని తన మీదున్న కన్‌సర్న్‌ అని మురిసిపోతారు. తనకు సమయానికి అన్నం వండి పెట్టిన అమ్మ, తనకు అన్నీ అమర్చి పెడుతున్న నాన్న ఆ పనులన్నీ తన మీద ప్రేమతోనే చేస్తున్నారనే ఆలోచన రావడం లేదు. అతడి నుంచి ‘గుడ్‌నైట్‌’ మెసేజ్‌ వస్తుంది, దానికి అమ్మాయి నుంచి వెంటనే రిప్లయ్‌ వస్తే ‘ఇంకా నిద్రపోలేదా’ అని అడుగుతాడు. ఇవన్నీ చెప్పి.. ‘నా మీద అంత ప్రేమగా ఉండేవాడు. మా అమ్మానాన్నల కంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయి ఇద్దరం సహజీవనంలో ఉన్నాం’ అని చెబుతారు. అవతలి వ్యక్తి పెళ్లి ప్రస్తావన రానివ్వకుండా జాగ్రత్తపడిన విషయం మోసపోయిన తర్వాత కానీ అమ్మాయిలకు తెలియడం లేదు. ఈలోపు అమ్మాయి బ్యాంకు బాలెన్స్, నగలు ఖర్చయిపోయి ఉంటాయి. శ్రద్ధావాకర్‌ కేసులో దారుణం జరిగింది కాబట్టి సమాజం దృష్టిలోకి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాలేదనే మాటే కానీ మోసపోయి... న్యాయపోరాటం చేయలేక, ఆవేదనతో మానసికంగా కృంగిపోతున్న వాళ్లు ఎందరో’’ అని చెప్పారు లాయర్‌ పార్వతి.

వంచనకు సాధనం
అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమ పేరుతో వంచించడానికి సోషల్‌ మీడియాను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడితే ఒకసారికి కాకపోయినా ఐదారు దఫాలు మాట్లాడిన తర్వాతకైనా ముసుగు జారిపోతుంది. ఇక ఫేస్‌బుక్, వాట్సాప్‌ చాటింగ్‌లో అవతలి వ్యక్తి మనోభావాలను పసిగట్టడం సాధ్యం కానే కాదు. మోసపోతున్నది అమ్మాయిలు మాత్రమే అని కాదు, మోసపోతున్న వాళ్లలో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటున్నారు. ఒకప్పుడు కలం స్నేహాలు ఎక్కడో ఉన్న ఇద్దరు వ్యక్తులను అనుసంధానం చేసేవి. అవి పరస్పరం అభిప్రాయాలు, అభిరుచులను షేర్‌ చేసుకోవడానికే పరిమితమయ్యేవి. సోషల్‌ మీడియా స్నేహాలు జీవితాలను నిర్దేశిస్తున్నాయి, తప్పుదారిలో నడిపిస్తున్నాయంటే... ఆ తప్పు సాంకేతికతది  కాదు. మెదడు ఉన్న, విచక్షణ ఉండాల్సిన మనిషిదే.
– వాకా మంజులారెడ్డి


చట్టాలున్నాయి...కానీ!

పెళ్లి చేసుకున్న మహిళకు చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉందో, సహజీవనం విషయంలో కూడా అలాంటి రక్షణను కల్పించింది చట్టం. అయితే సహజీవనాన్ని నిరూపించుకోవాలి. చాలా సందర్భాల్లో నిరూపణ కష్టమవుతోంది. ఆ ఇద్దరూ ఒకే కప్పు కింద జీవించారని చుట్టుపక్కల వాళ్లు సాక్ష్యం చెప్పాలి. అలాగే ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ వంటి సాంకేతిక ఆధారాలను చూపించవచ్చు. కానీ న్యాయస్థానం ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించడం లేదు, సెకండరీ ఎవిడెన్స్‌గా మాత్రమే తీసుకుంటుంది. సహజీవనాన్ని నిరూపించలేని పరిస్థితుల్లో ‘క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్, చీటింగ్‌’ కేసులు పెట్టవచ్చు. కానీ అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు, సమాజానికి భయపడి ఈ పని చేయలేకపోతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసులు పెట్టి జీవితంలో మరింత అల్లకల్లోలంలోకి వెళ్లడానికి ఇష్టపడరు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడమే చెప్పదగిన సూచన. పుట్టిన రోజుకి ఫ్లవర్‌ బొకేలు పంపించినంత మాత్రాన అతడిది సంపూర్ణమైన ప్రేమ అనే భ్రమలోకి వెళ్లవద్దు.
– ఈమని పార్వతి, హైకోర్టు న్యాయవాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement