ప్రతీకాత్మక చిత్రం
ప్రశ్నః మాది ప్రకాశంజిల్లా. నా చిన్న కూతురు మా వూర్లోనే ఉండే మా బంధువుల అబ్బాయి మాయలోపడి అతనితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ దిగులుతో నా భర్త ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. మైనర్‌గా ఉన్నప్పుడే అతనిని పెళ్లిచేసుకుంటానని మా అమ్మాయి మమ్మల్ని అడిగితే... ‘నీదింకా చిన్నవయసు. పెళ్లీడు కూడా రాలేదు. ముందు చదువుకొమ్మ’ని చెప్పాం. అతనికి ఏ ఉద్యోగమూ లేదు. నిన్నెలా పోషిస్తాడంటూ ఆమెను సర్దిచెప్పే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత కూడా ఆ అబ్బాయి మా అమ్మాయి వెంటపడటం ఆపలేదు. మా అమ్మాయికి కూడా చదువు మీద శ్రద్ధ పోయింది. ఎంతో కష్టపడి బతికేవాళ్లం. పెద్దమ్మాయిని టెంత్‌తోనే ఆపేయించాం. కనీసం ఈ అమ్మాయినైనా చదివించాలనుకున్నాం. కానీ మమ్మల్ని కాదని అతని వెంట వెళ్లిపోయింది. సమస్య అది కాదు. అమ్మాయి అతనితో వెళ్లిపోయి 9 నెలలు కావస్తోంది. కానీ ఇంత వరకూ అతను పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు వాళ్లింటికి కూడా తీసుకురాకుండా మా వూరికి 15 కి.మీ. దూరంలో ఉన్న టౌన్‌లో ఉంచాడని విన్నాం. ఈ మధ్య అబ్బాయి వాళ్లమ్మానాన్న అతనికి వేరే సంబంధాలు వెతుకుతున్నారని తెలిసింది. ఇదేంటని అడిగితే ‘ఐదు లక్షలిస్తే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’నని రాయబారం పంపాడు. అయితే ఈ మధ్యే మా అమ్మాయికి అబార్షన్ కూడా చేయించాడని తెలిసింది. అమ్మాయి ఆరోగ్యం ఎలావుందోననే బెంగ ఒకవైపు, నా భర్తపోయిన దిగులు మరోవైపు... నాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఒకవైపు లోకం కాకై పొడుస్తోంది. బయటకెళ్లాలంటే నరకంగా ఉంది. కనీసం వాళ్లిద్దరూ కలిసి ఏదో కష్టం చేసుకొని బతుకుతారనుకుంటే వాళ్ల తల్లీదండ్రీ వేరే సంబంధాలు వెతుకుతున్నారు. ఆ అబ్బాయిని నమ్మి వెళ్లినందుకు నా కూతురి జీవితం నా కళ్ల ముందే నాశనం అవుతున్నా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా సమస్యకు పరిష్కారం చూపి, నా బిడ్డ జీవితాన్ని కాపాడండి.
– ఒక అభాగ్యురాలు
జ: వుమన్ ప్రొటెక్షన్ సెల్‌లో కంప్లెయింట్ చేయాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. కానీ ఇటువంటి కేసుల్లో ఇది అంత తేలిక కాదు. నా అనుభవంలో చాలా కేసులు చూసాను. బలవంతంపైన పెళ్లి చేసుకున్నా, రేపు సరిగ్గా ఉంటాడన్న నమ్మకం లేదు. వద్దు వద్దు అంటే బలవంతంగా పెళ్లి చేయడం అనవసరం. కానీ, చేసిన ద్రోహానికి అతను శిక్ష అనుభవించితీరక తప్పదు. ముందు ఆ అమ్మాయిని అతని కస్టడీలోంచి బయటపడేయాలి. లేదంటే చాలా ప్రమాదం. ఆమెకి అబార్షన్ అయినంత మాత్రాన ఏదో కొంపమునిగిపోయినట్టు భావించాల్సిన పనిలేదు. సామాజిక గౌరవాలూ, పరువూ అంటూ మోరలిస్టిక్‌గా ఆలోచించడం మానుకొని, ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయాలి. అంతేగానీ ఒకసారి బయటకు Ðð ళ్లింది కాబట్టి అతడితోటే ఉండాలని అనుకోవద్దు. అమ్మాయి చిన్న పిల్ల. అతనితో వెళ్లాకకానీ అతని స్వభావం తెలియలేదు. యిప్పుడు నీతిబోధల కంటే ఆ అమ్మాయి ప్రాణాలు ముఖ్యం. తక్షణమే ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకోండి. అందుకే పిల్లలకు మంచి చెడులను గుర్తించే జ్ఞానాన్నివ్వాలి. తమంత తాము నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా అది పనికివస్తుంది.
– కల్పన కన్నాభిరాన్, డైరెక్టర్,
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment