ప్రాణాలు పోతున్నాయ్..
దేశంలో వైద్య సేవల కొరత.. ఏటా 10 లక్షల మంది మృతి
125 కోట్ల జనాభాకు ఉన్న డాక్టర్ల సంఖ్య 9.29 లక్షలే..
స్పెషలిస్ట్ డాక్టర్‌ను చూడని 70 కోట్ల మంది!
రోగాలతో అప్పులపాలవుతున్నవారు ఆరుకోట్ల పైనే
31 శాతం జనాభా ఉన్న 6 రాష్ట్రాల్లోనే 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సరైన వైద్యసేవలు అందుబాటులో లేక ఏటా 10 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు... గుండెలు పగిలే ఈ కఠోర వాస్తవం వేరెవరో చెప్పింది కాదు.. స్వయానా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదిక వెల్లడించిన పచ్చినిజం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ది మూడోస్థానమని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో దేశంలోని సామాన్యులకు కనీస వైద్యసేవలు కూడా అందుబాటులో లేవన్న కఠోర సత్యాన్ని ఇది చాటుతోంది. దేశంలో అందుతున్న వైద్యసేవల్లోని డొల్లతనాన్ని ఈ నివేదిక బట్టబయలు చేసింది.
తాజాగా కేంద్రానికి సమర్పించిన ఈ నివేదికలో పలు దిగ్భ్రాంతి కలిగించే అంశాలున్నాయి. దాదాపు 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 9.29 లక్షలమంది మాత్రమే డాక్టర్లున్నారని, అందులోనూ నిత్యం వైద్యసేవలందిస్తున్నవారు 7.24 లక్షలమందేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమందికీ ఒక డాక్టరు ఉండాలి. కానీ భారత్‌లో ఉన్న వైద్యులసంఖ్యతో పోలిస్తే 2వేల మందికి కూడా ఒక వైద్యుడు లేని పరిస్థితిని ఈ నివేదిక కళ్లకు కట్టింది.
నివేదికలో ప్రస్తావించిన ఇతర ముఖ్యాంశాలివీ..
* దేశ జనాభా 125 కోట్లు ఉంటే.. అందులో 70 కోట్ల మందికి ఇప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు అందుబాటులోకి రాలేదు. డబ్బున్నవాళ్లు నిత్యం స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలోనే వైద్యం పొందుతుంటే.. అసలు స్పెషలిస్ట్ డాక్టర్ అంటేనే తెలియనివాళ్లే అధికంగా ఉన్నారు.
* దేశంలో మెడికల్ రిజిస్ట్రేషన్ లోపభూయిష్టంగా ఉంది. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారున్నారు, వీరిలో వైద్యం చేస్తున్నవాళ్లెందరు?, మృతిచెందిన వారెంతమంది తదితర లెక్కలు సరిగా లేవు. అంతేకాదు ప్రస్తుతం స్పెషలిస్ట్ వైద్యులు, సూపర్ స్పెషలిస్టు వైద్యుల్లో 80 శాతం మంది పట్టణాల్లోనే ఉన్నారు. దీనివల్ల గ్రామీణులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అందట్లేదు.
* దేశంలో వైద్య పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. జాతీయ ఆరోగ్య విధానం-2015 ప్రకారం ఏటా వైద్యసేవలకోసం వెళుతున్నవారిలో 6.3 కోట్లమంది అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ), మధుమేహం, గుండెజబ్బు, కేన్సర్ వంటి జబ్బులు తీవ్రమవుతున్నందున సామాన్య, మధ్యతరగతి వర్గాలు అప్పుల్లోకి వెళుతున్నాయి.
వేధిస్తోన్న వైద్యకళాశాలల కొరత
దేశంలో ఉన్న జనాభాకు, వైద్యకళాశాలల సంఖ్యకూ పొంతనలేదు. అంతేకాదు.. దేశంలోఉన్న 65 శాతం వైద్య కళాశాలలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రాల మధ్య వైద్యసేవల వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు మధ్యభారత రాష్ట్రమైన మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. విచిత్రమేమంటే దేశ జనాభాలో 31 శాతం జనాభా ఆరు రాష్ట్రాల్లో ఉంటే.. 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడే ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల్లో 46 శాతం జనాభా ఉంటే.. వాటిల్లో కేవలం 21 శాతమే ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటులో అసమానతలు తొలగించాల్సిన, అన్ని రాష్ట్రాలకు సేవలందేలా సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత భారతీయ వైద్యమండలి(ఎంసీఐ)దే.
దేశంలో ఉన్న డాక్టర్ల సంఖ్య 9.29 లక్షలు
ప్రాక్టీస్ చేస్తున్నవారి సంఖ్య 7.24 లక్షలు
స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు అందనివారు 70 కోట్లు
వ్యాధులతో అప్పుల పాలవుతున్నవారు 6.30 కోట్లు
పట్టణాల్లో మాత్రమే ఉంటున్న స్పెషలిస్టులు 80 శాతం
31శాతం జనాభా ఉన్న 6 రాష్ట్రాల్లో 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు
46శాతం జనాభా ఉన్న 8 రాష్ట్రాల్లో 21 శాతం ఎంబీబీఎస్ సీట్లు