పంజాబ్పై దాడి చేయండి: ఐఎస్ఐ
న్యూఢిల్లీ: భారత్ పై దాడి చేయాలని పాకిస్థాన్కు చెందిన సిక్కు ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. పంజాబ్లో తమ ఆదీనంలో ఉన్న స్లీపర్ సెల్స్ను అప్రమత్తం చేసిన ఐఎస్ఐ.. సర్బత్ ఖల్సా నిర్వాహకులను అరెస్టు చేసిన అంశాన్ని ఆసరాగా చేసుకొని అనూహ్య దాడులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నెల (నవంబర్) 10న బటిండాలో సిక్కులు సర్బత్ ఖల్సా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు.
అయితే, దీన్ని అదనుగా చేసుకొని ఘర్షణలు, అల్లర్లు సృష్టించాలని బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు ఇప్పటికే నిఘావర్గాల సమాచారం అందడంతో ఈ కార్యక్రమానికి పోలీసులు, పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 12మంది బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్లు కూడా తెలియడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం పంజాబ్ పోలీసులు పెద్ద మొత్తంలో అరెస్టు చేశారు. 180మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 23న అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్ను అరెస్టు చేసినప్పటి నుంచి ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.